Saturday, October 9, 2010

మహిళ: ఆనాటి స్త్రీని మేల్కొలిపిన 'అనసూయ' (1వ భాగం)

తెలుగులో స్త్రీలకోసం స్థాపించిన మొదటి పత్రిక 'సతీహితబోధిని'. దాన్ని స్థాపించినది కందుకూరి వీరేశలింగం పంతులు. గొప్ప సంఘసంస్కర్తగా పేరు తెచ్చుకున్న ఆయనకి స్త్రీలపట్ల ఉన్నవన్నీ గొప్ప భావాలు కావు. ఆయన దృష్టిలో స్త్రీ అవలక్షణాల పుట్ట. అలాంటి స్త్రీని బాగుచేసి ఆదర్శగృహిణిగా నిలపడం గొప్ప సంస్కరణ కింద ఆయన భావించారు. అప్పట్లో సంస్కర్తలమనుకునే వాళ్లకి ఇలాంటి అభిప్రాయమే ఉండేదని తోస్తుంది.
స్వాతంత్ర్యానికి పూర్వమే స్త్రీల సంపాదకత్వంలో పత్రికలు వెలువడటం గొప్ప విషయమైతే అందులో కొన్ని పత్రికలు స్త్రీ విద్యకోసం, తద్వారా స్త్రీలలో చైతన్యం పెంపొందడం కోసం కృషిచేయడం మరింత విశేషమనే చెప్పాలి. 'హిందూసుందరి' స్త్రీ సంపాదకత్వంలో వెలువడిన తొలి పత్రిక. మొసలికంటి రమాబాయి సంపాదకత్వంలో 1902లోనే ఆ పత్రిక ప్రారంభమైంది. అప్పట్లో హిందూసుందరి పత్రిక వెలువడటం అనేది తెలుగుదేశంలో పెద్ద సంచలనాన్ని సృష్టించింది. ఇంతటి పేరు తెచ్చుకోకపోయినా స్త్రీ విద్యపైనా, సమాజంలో ఆనాడు ఉన్న సంఘదురాచారాలపైనా వచ్చిన మరో పత్రిక 'అనసూయ'. 1917లో ప్రారంభమైన ఈ పత్రికకి సంపాదకురాలు వింజమూరి వెంకటరత్నమ్మ. అనసూయ కంటే ముందు వచ్చిన స్త్రీల పత్రికలు హిందూసుందరి కాక సావిత్రి, జనానా, గృహలక్ష్మి అనేవి. వీటిలో హిందూసుందరి తప్ప మిగతా మూడూ అనసూయ వచ్చేనాటికి మాయమయ్యాయి.
"స్త్రీలెచ్చట నుచ్ఛస్థితిలో నుందురో యాదేశ మభివృద్ధిలోనున్న మాటయే. అట్లుండుటకు వారి యజ్ఞానాంధకారము పారద్రోలబడవలయును. వారు పురుషులతో సర్వవిధముల సమానలని యెన్నుకొనబడు నవస్థ రావలయును" (వింజమూరి వెంకటరత్నమ్మ, 1920 జనవరి సంచిక) అనే భావాన్ని వ్యక్తం చేయడం నిజంగా అప్పట్లో సాహసమే. సాహిత్యలోకంలో గొప్ప సంచలనాన్నీ, ప్రకంపనల్నీ పుట్టించిన 'స్త్రీ'ని చలం రచించింది 1925 ప్రాతంలో కాగా, అంతకు ఐదు సంవత్సరాల మునుపే పురుషులతో పాటు స్త్రీలు అన్నివిధాలా సమానమనే సమాజం రావాలని వీరు పేర్కొనడం విశేషమే.
'టైమ్స్ ఆఫ్ ఇండియా' పత్రికలో సర్ నారాయణచంద్ర వార్కరు రచించిన ఒక వ్యాసాన్ని వెంకటరత్నమ్మ 'ఇరువురు మాలకన్నియలు' పేరుతో అనువదించి 1919 జూలై-ఆగస్టు సంచికలో ప్రచురించారు. అందులో మాలకన్య హూవి తండ్రి తనకి పెళ్లి చేస్తాననీ, పెళ్లి వలన సుఖంగా ఉండొచ్చనీ చెబితే తండ్రితో "సుఖమా? భర్తలకును సుఖమునకును ఎంతో సంబంధముండుచున్నట్లు మాట్లాడుచున్నావే" అంటుంది.  (ఇంకావుంది)

No comments: