Friday, October 29, 2010

సినిమా: మూడు క్రేజీ సినిమాలు - ఒక వాస్తవం (చివరి భాగం)

'ఖలేజా' కనిపిస్తున్నదెక్కడ?
మూడేళ్ల విరామంతో మహేశ్ సినిమా వస్తున్నదనేసరికి ఆయన అభిమానుల్లోనే కాక, సాధారణ ప్రేక్షకుల్లోనూ ఎంత ఆసక్తి! బాక్సాఫీసు చరిత్రని 'మహేశ్ ఖలేజా' తిరగరాస్తుందనే చాలామంది ఆశించారు, నమ్మారు. తీరా థియేటర్లలో సినిమా విడుదలయ్యాక చూస్తే.. 'ఈ సినిమా కోసమా మహేశ్ మూడేళ్లు ఆగింది' అనే వ్యాఖ్యలే, విమర్శలే. కథని కాక, కేవలం కాంబినేషన్ ని నమ్ముకుని సినిమా తీస్తే ఫలితం ఎలా ఉంటుందో చెప్పిన సినిమా 'ఖలేజా'. ఈ సినిమా కంటే ముందు వేరే దర్శకులతో వేరే సినిమాలు చేస్తానని మహేశ్ నుంచి ప్రకటనలు వచ్చాయి. కానీ అవన్నీ పక్కకి వెళ్లిపోయి, త్రివిక్రమ్ సినిమా ముందుకొచ్చింది. మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషనులో అదివరకు వచ్చిన 'అతడు' హిట్టవడం, అప్పుడే త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన 'జల్సా' విజయం సాధించడం దీనికి కారణం. హీరోయిన్ విషయంలోనూ ఇదే స్థితి. మొదట ఎంపిక చేసిన పార్వతీ మెల్టన్ ని కాదని 'అరుంధతి' సూపర్ హిట్టవడంతో అనుష్కని హీరోయినుగా తీసుకున్నారు. సూపర్ హీరో, సూపర్ హీరోయిన్, సూపర్ డైరెక్టర్ కాంబినేషన్ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుందని నిర్మాత ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 'పులి' కథని కానీ, 'ఖలేజా' కథని కానీ ముందుగా ఆయన వినలేదు. కాంబినేషన్స్ ని కుదుర్చుకుని, పెట్టుబడి పెట్టారంతే. ఒకప్పటి నిర్మాతలకీ, ఈ కాంబినేషన్ నిర్మాతలకీ అదే తేడా.
'ఖలేజా'లో ప్రారంభం నుంచి చివరిదాకా రీజనింగ్ కి అందని సన్నివేశాలెన్నో. హీరో ఇంట్రడక్షన్ సీనులో ఎడారిలో మనుషుల్ని మహేశ్ కత్తులతో కుత్తుకలు కోస్తుంటే, వాళ్లు అతనికి ఏం అన్యాయం చేశారో, ఎంతటి దుర్మార్గాలు చేశారో.. అనుకుంటాం. కానీ వాళ్లని అతను చంపింది 'నీళ్ల' కోసం! ఆ ఓపెనింగ్ ఫైట్ తోటే హీరో పాత్ర ఔచిత్యం దెబ్బతినిపోయింది. విషపు నీటివల్ల ఐదొందల పైచిలుకు జనాభా ఉన్న ఓ ఊరు వల్లకాడవుతుంటే, వాళ్లని 'దేవుడు'గా మహేశ్ ఎలా కాపాడాడనేది ఈ సినిమా ప్రధానాంశం. 'స్టఫ్' అంటూ లేని ఈ కథలోని 95 శాతం సన్నివేశాల్లో అంతా తానై కనిపిస్తాడు మహేశ్. అంటే ప్రధాన పాత్ర మీదే ధ్యాసంతా పెట్టిన దర్శకుడు మిగతా పాత్రల పట్ల చిన్నచూపు చూశాడు. తనవరకు విభిన్నమైన డైలాగ్ డిక్షనుతో, నటనతో మహేశ్ ఎంతగా చెలరేగిపోయినా, బిగువైన కథనం లేకపోవడమే 'ఖలేజా'కి ప్రతికూలంగా పరిణమించింది. ప్రపంచవ్యాప్తంగా తొలివారం బాక్సాఫీసు వద్ద భారీగా 21 కోట్ల రూపాయల షేరుని వసూలుచేసిన ఈ సినిమా కలెక్షన్లు రెండో వారం బాగా నెమ్మదించాయి. దాదాపు 40 కోట్ల రూపాయల (అంచనా) వ్యయమైన ఈ సినిమాకి పెట్టుబడి రావడం చాలా కష్టమనేది ట్రేడ్ వర్గాల మాట.
'బృందావనం' అందరిదయ్యేనా?
'బృందావనం' బాగుంది.. ఎక్కడికెళ్లినా ఇదే మాట. ఎన్టీఆర్ కథానాయకుడిగా; కాజల్ అగర్వాల్, సమంతా నాయికలుగా నటించిన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో సినిమా విడుదలైన తొలిరోజు నిర్మాత రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి ముఖాలు సంతోషంతో వెలిగిపోయాయి. 'బృందావనం' సూపర్ డూపర్ హిట్టయి, బాక్సాఫీసు వద్ద రారాజుగా వెలిగిపోతున్న 'రోబో'ని నిలువరించడం ఖాయమనే ట్రేడ్ వర్గాలు భావించాయి. అయితే టాక్ కీ, కలెక్షన్లకీ కనిపిస్తున్న దూరం బయ్యర్లని ఆందోళన పరుస్తోంది. పైరసీ కారణంగానే ఈ సినిమాకి ఆశించిన రీతిలో వసూళ్లు రావడం లేదనేది ఓ వాదన. అదే నిజమైతే 'రోబో' కలెక్షన్లు ఇంకా నిలకడగా ఎందుకున్నాయనేది ప్రశ్న. ఇంతవరకు చేయని కొత్త తరహా పాత్రలో ఎన్టీఆర్ నటన అందరి ప్రశంసలూ పొందుతున్నప్పటికీ స్త్రీల హక్కులు, సమానత్వం మీద ఎంతో చైతన్యం కనిపిస్తున్న ఈ రోజుల్లోనూ 'ఒక పురుషుడికి ఇద్దరు స్త్రీలు' పాయింట్ ఎలా మెప్పు పొందుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 30 కోట్ల రూపాయలకు మించి వ్యయమైన ఈ సినిమాకి పెట్టుబడి రావాలంటే మరో రెండు వారాల పాటు కలెక్షన్లు బలంగా ఉండాలి. అయితే 'రోబో' స్థాయిలో ఈ సినిమా పట్ల ప్రేక్షకులు ఆసక్తి కనపర్చడం లేదనేది కనిపిస్తున్న వాస్తవం. మాస్ హీరో అయిన ఎన్టీఆర్ సినిమాకి 'బృందావనం' వంటి సాఫ్ట్ టైటిల్ పెట్టడం వల్లే ఓపెనింగ్స్ లో ఉధృతి కనిపించ లేదనేది ట్రేడ్ విశ్లేషకుల భావన.
డబ్బింగ్ సినిమాల వల్ల తెలుగు సినిమాలకు థియేటర్లు కరువవుతున్నాయని ఇప్పటిదాకా చిన్న సినిమాల నిర్మాతలు ఆవేదన చెందుతూ వచ్చారు. ఇప్పుడు ఆ డబ్బింగ్ సినిమాల వల్ల తమకూ ముప్పు ఏర్పడిందని పెద్ద సినిమాల నిర్మాతలు బాధపడే రోజులొచ్చాయి. కిం కర్తవ్యం? కాంబినేషన్ల మీదకంటే కథాకథనాల మీద శ్రద్ధ ఎక్కువగా పెట్టడమే.                          

1 comment:

bangaRAM said...

katha kathanam nelavidichi samu cheste eppudaina eelanti cinemalanu
annipranthalavaru cheekodatharu.chalamandi herolu kathalo udhthakanna thama swantha imageki pradhanyatha istu pothunnathakalam veladi anjaneyudi vanti prekshakulu alanti cinemalanu chethakundilo paravestaru.charitra cheppe satyamide.aithe eekantha shoshanu vinipinchukone varaedaru?