Tuesday, October 5, 2010

సినిమా: 'రోబో', 'ఖలేజా'లకి 'బృందావనం' పోటీనిస్తుందా?

అక్టోబర్ 1న వచ్చిన రజనీకాంత్ 'రోబో'కీ, 7న వస్తున్న 'మహేశ్ ఖలేజా'కీ గట్టి పోటీ ఇచ్చేందుకు 14న రాబోతున్న మరో సినిమా 'బృందావనం'. జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తే, 'మున్నా' ఫేమ్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నారీ నారీ నడుమ మురారి తరహా పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. అతని సరసన నేటి అగ్ర నాయికల్లో ఒకరైన కాజల్ అగర్వాల్, 'ఏ మాయ చేసావె'తో యువతరంలో క్రేజ్ పొందిన సమంతా తమ అందచందాలు, అభినయంతో ఆకట్టుకోబోతున్నారు.
'అదుర్స్' తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తోన్న సినిమా కావడమే కాక, దిల్ రాజు సంస్థ నుంచి వస్తుండటంతో 'బృందావనం' మీద అంచనాలు చాలానే ఉన్నాయి. నటనలోనే కాకుండా డాన్సులోనూ నిష్ణాతుడైన ఎన్టీఆర్ ఈ సినిమాలో ఇప్పటివరకు చేయని ఓ కొత్తపాత్రలో అల్లరి యువకుడిగా కనిపించబోతున్నాడు. "టైటిల్ సాఫ్టుగా ఉన్నా ఎన్టీఆర్ అదరగొట్టడం ఖాయం. ఎంతో మాస్ ఇమేజ్ ఉన్న బాలకృష్ణగారు ఇదివరకు 'నారీ నారీ నడుమ మురారి', 'అనసూయమ్మగారి అల్లుడు' వంటి పాత్రలు చేశారు. ఆకట్టుకున్నారు. అలాగే ఎన్టీఆర్ కూడా ఈ సినిమాతో ఒక కుటుంబంలో ఉండే అన్ని వయసుల వాళ్లనీ ఆకట్టుకుంటారు" అని నిర్మాత రాజు చెప్పారు.
అయితే నందమూరి వంశానికి చెందిన హీరోల సినిమాల్ని తెలంగాణలో ఆడనివ్వమని ఇప్పటికే కొన్ని తెలంగాణ సంఘాలు హెచ్చరించిన నేపథ్యంలో నైజాంలో 'బృందావనం' ప్రదర్శనపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ మునుపటి సినిమా 'అదుర్స్'కి ఆ అనుభవం ఎదురయ్యింది కూడా. కాకపోతే 'బృందావనం' నిర్మాత రాజు స్వయంగా తెలంగాణవాసి కావడం వల్ల అడ్డంకులేమీ ఆ సినిమాకి ఎదురుకావనే నమ్మకం ఎన్టీఆర్ అభిమానుల్లో వ్యక్తమవుతోంది.                        

No comments: