Tuesday, October 12, 2010

సినిమా: మంచి సినిమాకి మంచి రోజులు? (2వ భాగం)

ఆక్సిజన్ ఇచ్చిన 'ఆనంద్'
నిజం చెప్పాలంటే 1989లో రాంగోపాల్ వర్మ అనే కొత్త దర్శకుడు తీసిన 'శివ' సైతం స్వతంత్ర సినిమా అనే చెప్పాలి. అయితే అందులో హీరో నాగార్జున స్టార్ కావడం వల్లే ఆ సినిమా కోట్ల రూపాయల్లో వసూళ్ల వర్షాన్ని కురిపించింది. దాదాపు అదే సమయంలో తమ్మారెడ్డి భరద్వాజ్ రూపొందించిన 'అలజడి' చిత్రం సైతం స్వతంత్ర సినిమానే. స్టార్లు లేకపోవడం వల్లే ఆ సినిమా 'శివ' స్థాయి విజయాన్ని నమోదు చేయలేకపోయింది.  అయినప్పటికీ దానినీ చెప్పుకోదగ్గ స్థాయిలోనే ప్రేక్షకులు చూశారు.
ఇటీవలి కాలానికొస్తే స్టార్లు లేకుండా 'మంచి కాఫీలాంటి సినిమా' అంటూ శేఖర్ కమ్ముల రూపొందించిన 'ఆనంద్' సినిమాకి పెట్టుబడి పెట్టేందుకు గానీ, దాన్ని విడుదల చేయడానికి గానీ ఎవరూ ముందుకు రాలేదు. అయినా కేవలం తన పనినీ, తన సినిమానీ నమ్ముకున్న శేఖర్ రాష్ట్రం మొత్తం మీద కేవలం మూడంటే మూడు ప్రింట్లతో 'ఆనంద్'ని విడుదల చేస్తే, ఆ తర్వాత అది ఎంత సంచలనాన్ని సృష్టించిందీ, స్వతంత్ర సినిమా దర్శకుడిగా శేఖర్ కి ఎంత మైలేజ్ ఇచ్చిందీ మనకు తెలియంది కాదు. 'ఆనంద్' సినిమా మంచి సినిమా దర్శకులకి అక్సిజన్ లాగా పనిచేసిందని చెప్పాలి.
మూస పంథాలో తీస్తే తప్ప జనం చూడరనే అభిప్రాయం అందరిలో ఉంది. ఆ అభిప్రాయం తప్పని అప్పట్లో 'శివ', ఇప్పట్లో 'ఆనంద్' నిరూపించాయి. అయినప్పటికీ 'కమర్షియల్ ఉచ్చు'లో ఉండేందుకే ఇష్టపడే నిర్మాతలు తాము మార్కెట్ ఉందనుకున్న ఒక స్టార్ హీరోని పెట్టి 20 కోట్ల రూపాయలయినా ఖర్చుచేసి సినిమా తీస్తున్నారు కానీ, దానివల్ల నష్టాలు వచ్చినా భరిస్తున్నారు కానీ ఒక చిన్న చిత్రం మీద ఒక కోటి రూపాయలు వెచ్చించేందుకు మాత్రం అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. వాళ్లకి మరోరకంగా సినిమా నిర్మించడం తెలియకపోవడమే దీనికి కారణమంటే కరెక్టుగా ఉంటుంది. సినిమా నిర్మాణంలో వారికి అర్థమయ్యే ఒకే ఒక అంశం టేబుల్ ప్రాఫిట్. అది రావాలంటే ఒక స్టార్ హీరో లేదా స్టార్ డైరెక్టర్ ఉండాలి. ఇక స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లకు కూడా వాళ్లదైన ఒక అజెండా ఉంటుంది. ఫలానా తరహా సినిమాలనే ప్రేక్షకులు ఇష్టపడతారని వాళ్లు అనుకుంటూ ఉంటారు. కానీ చిత్రమేమంటే వాస్తవాలు అందుకు భిన్నంగా ఉంటాయి. వాళ్లు నటించే సినిమాల్లో సక్సెస్ అయ్యేది 15 నుంచి 20 శాతమే. అంటే ప్రేక్షకుల ఆదరణ పొందాలనే లక్ష్యంతో తీసిన సినిమాల్లో అత్యధిక శాతం పరాజయం పాలవుతుంటాయి. వాటికి పెట్టిన డబ్బులు కూడా తిరిగిరావు. అయినా స్టార్ల దృక్పథంలో మార్పు రావడం లేదు.  (ఇంకావుంది)                      

No comments: