Wednesday, October 6, 2010

సినిమా: 580 థియేటర్లలో 'మహేశ్ ఖలేజా'

మహేశ్ సినిమా 'మహేశ్ ఖలేజా' 580 థియేటర్లలో గురువారం (7న) వస్తోంది. టైటిల్ విషయంలో చెలరేగిన వివాదం 'మహేశ్ ఖలేజా'కు అనుకూలంగా బుధవారం కోర్టు తీర్పునివ్వడంతో సమసింది. దీంతో ఈ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. మహేశ్ పవర్ ముందు ఏదీ నిలవదని ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన సి. కల్యాణ్ పాత్రికేయుల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఒక టాప్ హీరో మూడేళ్ల విరామంతో ప్రేక్షకుల ముందుకు రావడం ఇదే ప్రథమమని చెప్పాలి. మహేశ్ మునుపటి సినిమా 'అతిథి' 2007 అక్టోబరులోనే వచ్చిన సంగతి గమనార్హం.
ఇదివరకు పవన్ కల్యాణ్ కూడా ఇలాగే 'జానీ' సినిమా తర్వాత రెండున్నరేళ్లు పైగా గ్యాప్ తీసుకున్నాడు. కాగా ఒక తెలుగు సినిమా విడుదలకు ముందే 35 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ చేయడం ఇదే మొదటిసారి. అల్లు అరవింద్ కు చెందిన గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ అంత మొత్తం వెచ్చించి హక్కులు సొంతం చేసుకుంది. నైజాం, వైజాగ్ ఏరియాలను తన వద్దే వుంచుకుని మిగతా ఏరియాల హక్కుల్ని లాభానికి అమ్ముకుంది.
ఈ నేపథ్యంలో 'మహేశ్ ఖలేజా'కి ఓపెనింగ్స్ అసాధారణ రీతిలో ఉంటాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. కొద్ది గంటల్లో విడుదల కాబోతోన్న ఈ సినిమా ఎలాంటి రికార్డులు సాధిస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.                

No comments: