Thursday, October 28, 2010

సినిమా: మూడు క్రేజీ సినిమాలు - ఒక వాస్తవం (1వ భాగం)

ఒక డబ్బింగ్ సినిమా ఒకవైపు.. మూడు భారీ, క్రేజీ తెలుగు సినిమాలు ఇంకోవైపు.. మామూలుగా అయితే డబ్బింగ్ సినిమా మట్టికరచి మాయం కావాలి. చిత్రం.. సీను రివర్స్. తెలుగులో అగ్ర కథానాయకులు నటించిన సినిమాల్నే వెనక్కి నెట్టేస్తూ ఆ డబ్బింగ్ సినిమా అప్రతిహతంగా బాక్సాఫీసును దున్నేస్తోంది. తెలుగు ప్రేక్షకులకి వినోదపు మజాని రుచి చూపిస్తూ నాణ్యమైన సినిమాకే వాళ్లు పట్టం కడతారనే నిజాన్ని చాటి చెబుతోంది. ఆ డబ్బింగ్ సినిమా 'రోబో'. ఆ భారీ, క్రేజీ సినిమాలు 'పులి', 'మహేశ్ ఖలేజా', 'బృందావనం'. తమిళ అగ్ర కథానాయకుడైన రజనీకాంత్ టాలీవుడ్ టాప్ హీరోల్ని పడగొట్టి బాక్సాఫీసు మీద గుత్తాధిపత్యం చలాయిస్తుండటం ఆషామాషీ సంగతి కాదు. టాలీవుడ్ వర్గాలు చాలా చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన సంగతి.
ఎందుకిలా జరిగింది? మొదటే హీరోని దృష్టిలో పెట్టుకుని కథలు వండటం తెలుగు దర్శకులు, రచయితలకి బాగా అలవాటైన పనయితే, స్క్రిప్టు మీదే ఎక్కువ దృష్టిపెట్టి, ఆ స్క్రిప్టుకి పనికొచ్చే నటుణ్ణి వెతుక్కోవడం తమిళ దర్శకుడైన శంకర్ కి తెలిసిన పని. 'రోబో' గురించీ, ఆ సినిమా ఆంధ్రప్రదేశ్ బాక్సాఫీస్ మీద చేస్తున్న సందడి గురించీ ఇదివరకే చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ సినిమా స్థాయిలో మన మూడు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు ఎందుకని ప్రేక్షకుల్ని అలరించలేక పోతున్నాయో విశ్లేషించుకోవాల్సిన సందర్భం.
తోకముడిచిన 'పులి'
'రోబో' కంటే మూడు వారాల ముందు విడుదలైన పవన్ కల్యాణ్ సినిమా 'పులి' (కొమరం పులి)ని ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో వెయ్యి ప్రింట్లతో విడుదల చేశారు. అందుకే తొలివారం ఆ సినిమా 25 కోట్ల రూపాయల్ని వసూలు చేసింది. నిజానికి అందులో ముప్పాతిక వంతు తొలి మూడు రోజుల్లోనే రావడం గమనార్హం. ఆ తర్వాత నుంచే ఆ సినిమాకి వచ్చే వాళ్లు కనుచూపు మేరలో కనిపించకుండా పోయారు. ఆ 'ఘనత'ని మొత్తంగా దర్శకుడు ఎస్.జె. సూర్యకే ఆపాదించారు. ప్రేక్షకుల్ని కుర్చీల్లోంచి లేవకుండా కూర్చోపెట్టాలంటే వినోదమన్నా వుండాలి, ఉత్కంఠభరితమైన కథనమన్నా వుండాలి. ఆ రెండూ లేకపోవడమే 'పులి' పరాజయానికి ప్రధాన కారణమనేది విమర్శకుల అభిప్రాయం. పులి పాత్ర చేత పదే పదే 'ప్రసంగాలు' ఇప్పించడం సినిమాకి పెద్ద మైనస్ పాయింట్. జనం సినిమాకి వచ్చేది ప్రధానంగా వినోదం కోసమేననే, సినిమాలోని ప్రధాన పాత్రలతో వాళ్లు సహానుభూతి చేందితేనే సినిమా ఆడుతుందనే ప్రాథమిక సత్యం తెలియకుండా తీసిన సినిమాగా 'పులి'ని చెప్పుకోవాలి. ఆరంభ సన్నివేశాల్లోనే పులి ఆవేశంగా ఐదు నిమిషాల సేపు జనానికి ఉపదేశించే రీతిలో ప్రసంగించడం చూసి బిత్తరపోయిన ప్రేక్షకులు, ఆ తర్వాత మరో మూడు నాలుగు సార్లు అలాంటి సీనులే ఎదురవడంతో కుర్చీల్లో ఎంత ఇబ్బందికరంగా మసిలారో 'పులి'ని చూసిన వాళ్లందరికీ అనుభవమే. నీతిబోధకుడు చెప్పే రీతిలో పవన్ కల్యాణ్ చెప్పిన నీతులు ప్రేక్షకుల్ని కదిలించాయి. ఎలా? కుర్చీల్లో అసహనంగా, చికాకుగా. రాజకీయ వేదికలపై చెప్పే ఆవేశభరిత, ఊకదంపుడు ఉపన్యాసాల్ని వినీ వినీ డంగైపోయిన జనం సినిమాలోనూ అలాంటి సీనే కనిపించడంతో మూకుమ్మడిగా 'పులి'కి వ్యతిరేకంగా ఓటేశారు. ఫలితంగా ఆ సినిమాపై పెట్టుబడి పెట్టిన నిర్మాత, బయ్యర్లు నిలువునా మునిగిపోయారు. తొలివారం భారీ కలెక్షన్లు సాధించిన ఆ సినిమా రెండో వారం సగానికంటే ఎక్కువ సంఖ్య థియేటర్లలో మాయమయ్యింది. మొత్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు రిలీజైన సినిమాల్లో నెంబర్ వన్ డిజాస్టర్ అనే ముద్రని సంపాదించుకుంది. (ఇంకావుంది)

No comments: