Wednesday, October 6, 2010

సినిమా: ఇక 'బెజవాడ రౌడీల' మీద రాంగోపాల్ వర్మ చూపు

ఏం చేసినా సంచలనం కోసమే చేస్తానని చెప్పే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరోసారి అదే పని చేశారు. రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని 'రక్త చరిత్ర'లో బంధించిన ఆయన ఇక 'బెజవాడ రౌడీలు' ఎలాంటి వాళ్లో, వాళ్లకి ఎంత భీకరమైన ఇమేజ్ ఉందో చెప్పడానికి ఉవ్విళ్లూరుతున్నారు. 'రక్త చరిత్ర' తర్వాత 'బెజవాడ రౌడీలు' సినిమా తీస్తానని ఆయన ప్రకటించగానే సంచలనం చెలరేగింది. విజయవాడకు చెందిన అనేకమంది రాజకీయ నాయకులు వర్మ ఆలోచనని ఖండించి, ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. 'అదుర్స్' నిర్మాత, తెలుగుదేశం పార్టీ నాయకుడు వల్లభనేని వంశీమోహన్ అయితే వర్మకి పిచ్చికుక్క కరిచి వుంటుందనీ, అందుకే ఇలాంటి సినిమాలు తీస్తానంటున్నాడనీ తీవ్రంగా విమర్శించారు. అయితే సాధారణ ప్రజానీకం నుంచి దీనిపై అంతగా స్పందన రాకపోవడం గమనార్హం.                        
తను తీసే ప్రతి సినిమాతోనూ వార్తల్లోకెక్కే వర్మ 'రక్త చరిత్ర'తో ఓవైపు సంచలనాన్ని సృష్టిస్తూనే, మరోవైపు వివాదాలకీ కేంద్ర బిందువయ్యారు. అనంతపురం జిల్లాకు చెందిన దివంగత తెలుగుదేశం నాయకుడు పరిటాల రవి జీవితం ఆధారంగా ఆయనకూ, మద్దెలచెరువు సూరికీ మధ్య జరిగిన ఆధిపత్య పోరును చిత్రిస్తూ ఆయన 'రక్త చరిత్ర' తీశారు. రవి పాత్రను బాలీవుడ్ నటుడు వివేక్ ఓబరాయ్ చేస్తే, సూరిగా తమిళ హీరో సూర్య నటించారు.
ఇటీవలే ఆడియో రిలీజైన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అనంతపురం ఫ్యాక్షన్ కక్షలకు అద్దంపట్టే ఈ సినిమా విడుదలకు ముందే సంచలనాన్ని సృష్టించడంతో పాటు వివాదాలకీ తెరతీసింది. ఆ సినిమాలో ఓబుల్ రెడ్డిని దుర్మార్గుడిగా చూపించారంటూ ఆయన వర్గీయులు ఆందోళన చేయడం, ఓబుల్ రెడ్డి స్వయంగా దెయ్యమై వచ్చినా తాను భయపడేది లేదని వర్మ ప్రకటించడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో 'బెజవాడ రౌడీలు' తీయబోతున్నట్లు వర్మ ప్రకటించడం సంచలనం రేకెత్తించింది. బెజవాడ సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకునే రోజుల్లోనే అక్కడి రౌడీయిజాన్నీ, దాని వెనకాల కారణాల్నీ క్షుణ్ణంగా పరిశీలించేవాణ్ణనీ చెప్పుకున్న వర్మ తన తొలి చిత్రం 'శివ'లో చూపించిన రౌడీయిజం బెజవాడ రౌడీయిజంతో పోలిస్తే సముద్రంలో ఒక నీటి చుక్క మాత్రమేనని తేల్చారు. 'వేరెక్కడా లేని ఒక మహా ప్రత్యేకమైన ప్రత్యేకత బెజవాడ రౌడీకి ఉన్నద'ని చెప్పిన ఆయన తన మైండులో 30 యేళ్లుగా ఆ సినిమా స్క్రిప్టు నలుగుతున్నదన్నారు. ఇప్పటికి ఆ స్క్రిప్టు పూర్తికావచ్చిందనీ, 'వీలైనంత తొందరలో బెజవాడకి కెమెరాని తీసుకెళ్లి అక్కడి రౌడీలని దానిలో బంధించి 70 ఎంఎం స్టీరియోఫోనిక్ సౌండులో అందరికీ చూపెట్టడానికి శరవేగంతో సన్నాహాలు జరుగుతున్నాయి' అని చెప్పారు వర్మ.
ఒకప్పటి బెజవాడ రౌడీ రాజకీయాలు, రౌడీ గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు సంగతి జగమంతా తెలిసిందే కాబట్టి ఎవర్ని ఎలా 'బెజవాడ రౌడీలు'లో వర్మ చూపించబోతున్నాడనేది ఆసక్తికరమైన అంశం. అదే ఇప్పుడు సంచలనాన్ని సృష్టిస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని వివాదాలకీ నెలవు కాబోతోంది.

No comments: