Sunday, October 10, 2010

సినిమా: మంచి సినిమాకి మంచి రోజులు? (1వ భాగం)

గ్రామీణ ప్రాంతాల్లో సినిమా థియేటర్లు ఒక్కొక్కటే మూతపడుతూ పట్టణాలు, నగరాల్లో మల్టీప్లెక్సుల సంఖ్య పెరుగుతుండటంతో తెలుగు సినిమా నిర్మాణ ఫార్ములా క్రమేపీ మార్పుకు గురవుతోంది. 'స్టార్ మేనియా' ఇప్పటికీ కొనసాగుతున్నా కొత్త తరహా కథాకథనాలతో వస్తున్న సినిమాలు సైతం కొద్దో గొప్పో ఆదరణ పొందుతున్నాయి, 'మంచి సినిమా'గా పేరు తెచ్చుకుంటున్నాయి. చంద్రసిద్ధార్థ్, శేఖర్ కమ్ముల, రవిబాబు, దేవా కట్టా, సాయికిరణ్ అడివి, క్రిష్, చైతన్య దంతులూరి, మధుర శ్రీధర్ వంటి దర్శకులు మంచి సినిమా పట్ల ఆశలు రేకెత్తిస్తున్నారు.
'ఆ నలుగురు' ఆదర్శం
ఆరు సంవత్సరాల క్రితం వచ్చిన 'ఆ నలుగురు' సినిమా ఈ నవ్య పంథాకు మార్గదర్శకంగా నిలిచిందని చెప్పాలి. చంద్రసిద్ధార్థ్ రూపొందించిన ఆ సినిమా 2004 సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా నంది అవార్డు పొందడమే కాక, ఉత్తమ నటునిగా రాజేంద్రప్రసాద్ కీ, ఉత్తమ క్యారెక్టర్ నటునిగా కోట శ్రీనివాసరావుకీ అవార్డులు సంపాదించి పెట్టింది. అన్నింటికీ మించి ఆ సినిమాని చెప్పుకోదగ్గ రీతిలో ప్రేక్షకులు సైతం ఆదరించారు. తన సినీ జీవితంలో 'ఆ నలుగురు' సినిమా ఓ మైలురాయి లాంటిదని రాజేంద్రప్రసాద్ గర్వంగా చెప్పుకోవడమే ఈ సినిమా గొప్పతనాన్ని చాటి చెబుతుంది. తన సంపాదనలో సగాన్ని ప్రజోపయోగ కార్యక్రమాలకు వెచ్చించే ఓ దినపత్రిక సంపాదకుడు రఘురామ్ తన మనసుకు విరుద్ధమైన పని చేయాల్సి వస్తే ఎలాంటి సంఘర్షణకు గురవుతాడు, అతడు చినిపోయాక కూడా అతని ఆత్మ ఎంతగా క్షోభిస్తుందనే అంశాన్ని హృద్యంగా చిత్రించిన విధానం అందరి ప్రశంసల్నీ పొందింది. మంచి సినిమా దర్శకుడిగా చంద్రసిద్ధార్థ్ ఎంతో పేరు తెచ్చుకున్నాడు. అయితే అతను కేవలం మంచి సినిమా దర్శకుడే కాదు, 'స్వతంత్ర సినిమా' దర్శకుడు కూడా. 'స్టార్' విలువ మీద ఆధారపడకుండా, నిర్మాత వత్తిళ్లకు తలొగ్గకుండా, తనేం తీయదలచుకున్నాడో, దాన్ని అందంగా, నాణ్యంగా సెల్యులాయిడ్ మీద చిత్రించేవాడూ, మార్కెట్లు, వర్తమాన ధోరణులు, అభిప్రాయాలు, ప్రేక్షకుల అంచనాలు, అమలులో ఉన్న సినిమా రూపకల్పన విధానాల ప్రభావం లేకుండా తీసేవాడూ స్వతంత్ర సినిమా దర్శకుడు అని సూత్రీకరిస్తాడు బాలీవుడ్ లో 'రఘు రోమియో' చిత్ర రూపకర్త రజత్ కపూర్. ఆ రెండు సినిమాలతో పాటు బాలీవుడ్ లో వచ్చిన 'హైదరాబాద్ బ్లూస్', 'మాన్సూన్ వెడ్డింగ్', 'సత్య', 'ఝంకార్ బీట్స్', 'దేవ్ డి', 'హరిశ్చంద్రాచ్చి ఫ్యాక్టరీ', 'ఖర్గోష్' వంటి సినిమాలు స్వతంత్ర సినిమా జెండాని నిలబెట్టేందుకు ఉపకరించాయి. వాటి తరహాలోనే తెలుగులో 'ఆనంద్', 'హ్యాపీడేస్', 'ఎ ఫిల్మ్ బై అరవింద్', 'వినాయకుడు', 'మంత్ర', 'అనసూయ', 'గమ్యం', 'బాణం', 'విలేజ్ లో వినాయకుడు', 'లీడర్', 'ప్రస్థానం', 'అందరి బంధువయ', 'వేదం' వంటి సినిమాలు మంచి సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి. వీటిలో చాలావాటికి ప్రేక్షకాదరణ కూడా ఉండటం ఇక్కడ గమనించాల్సిన అంశం.  (ఇంకావుంది)

No comments: