Tuesday, June 5, 2012

రాయచోటిలో వైకాపా, టిడిపి ఘర్షణ

వైఎస్‌ఆర్ కడప జిల్లా రాయచోటిలో సోమవారం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పాత రాయచోటిలో ఉదయం ప్రచారానికి వెళ్లిన వైకాపా అభ్యర్థి శ్రీకాంత్‌రెడ్డి, అతని అనుచరులను తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చేసుకుంది. ఇంతలో తెలుగుదేశం వర్గం వారు వైకాపా నాయకులపై రాళ్లు, ఇటుకపెళ్లలు విసిరారు. దీంతో వైకాపా నేతలు సైతం ప్రతిదాడికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో శ్రీకాంత్‌రెడ్డి గన్‌మెన్ జాకీర్ గాలిలోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జి జరిపి ఇరువర్గాలను చెదరగొట్టారు. వైకాపాకు చెందిన రఘునాథ, నిత్యానందరెడ్డికి గాయాలయ్యాయి. గన్‌మెన్ కాల్పుల్లో వీరనాగయ్య గాయపడినట్లు తెలుస్తోంది. ఇరువర్గాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదుచేశాయి. సంఘటనా స్థలాన్ని ఎస్‌పి మనీష్‌కుమార్ సిన్హా సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ముందుజాగ్రత్త చర్యగా రాయచోటికి అదనపు బలగాలను తరలించారు. ఈ సందర్భంగా వైకాపా అభ్యర్థి శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ పాత రాయచోటిలో ప్రచారానికి వెళ్లిన తమను టిడిపి వర్గీయులు ముందస్తు ప్రకాళికతో అడ్డుకుని దాడికి పాల్పడ్డారన్నారు. ఓడిపోతామన్న భయంతోనే దాడికి పాల్పడ్డారన్నారు. ఇదిలా ఉండగా ప్రచారానికి వచ్చిన శ్రీకాంత్‌రెడ్డిని స్థానిక ప్రజలు అడ్డుకుంటే తమపై నింద మోపడం విచారకరమని టిడిపి అభ్యర్థి సుగవాసి సుబ్రమణ్యం అన్నారు. పాత రాయచోటిలో అభివద్ధి జరగలేదనే ప్రజలు అడ్డుకున్నారన్నారు. వారే తొలుత దాడిచేశారని ఆయన ఆరోపించారు.

No comments: