Sunday, November 13, 2011

బిగ్ స్టోరీ: హిందీలో మాట్లాడుతున్న మన స్టార్ హీరోలు

హిందీలో తెలుగు సినిమాల రీమేక్‌ల కాలం నడుస్తున్న సంగతి తెలిసిందే. దానికి అదనంగా అక్కడ తెలుగు సినిమాల డబ్బింగూ ఓ వెల్లువలా మారడం నడుస్తున్న చరిత్ర. మన మెగా, సూపర్ స్టార్ల సినిమాల్ని కొనుగోలు చేసుకుని హిందీలోకి డబ్బింగ్ చేసుకుంటోంది బాలీవుడ్. ఇది థియేటర్లలో ప్రదర్శన కోసం కాదు. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఏదో ఓ హిందీ ఎంటర్‌టైన్‌మెంట్ చానల్లో ఏదో ఒక తెలుగు డబ్బింగ్ సినిమా ప్రసారమవుతూ కనిపిస్తోంది. 
చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, మహేశ్, ఎన్టీఆర్ వంటి టాప్ హీరోల సినిమాల డబ్బింగులతో ముంబైలోని అంధేరీ, గుర్గావ్ వంటి ప్రాంతాలు డబ్బింగుల వాడలుగా మారిపోయాయి. ఈ ప్రాంతాల్లో తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ ఒక పరిశ్రమలా నెలకొంది. కేవలం గంటకు రూ. 200 నుంచి రూ. 1500 వరకు అద్దె ఉండే ఈ డబ్బింగ్ థియేటర్లలో అనువాద క్రతువు నిరంతరాయంగా నడుస్తోంది. తెలుగు సినిమాల్ని సాధ్యమైనంత హిందీ నేటివిటీకి దగ్గరగా తీసుకువచ్చే డబ్బింగ్ ఆర్టిస్టులతో అహోరాత్రులు కృషి జరుగుతోంది. ఈ క్రమంలో వందకు పైగా తెలుగు సినిమాలు హిందీలోకి డబ్బింగ్ అయ్యాయి. ఇంకా అవుతున్నాయి. 
కలర్స్, సోనీ మాక్స్ చానళ్లకే కాదు, మధ్యాహ్నం పూట మరి కొన్ని మూవీ చానళ్ల ముడిసరుకు తెలుగు డబ్బింగులే. ఈ సినిమాల్లో మన స్టార్లు మరొక వాయిస్‌తో అచ్చమైన హిందీ మాట్లాడటం మనకి నవ్వు తెప్పిస్తుంటుంది కూడా. ఈ ట్రెండు ఎందుకు నడుస్తున్నదంటే - హిందీ సినిమాలు రోజురోజుకూ సూటిగా సాఫీగా కథ చెప్పే పద్ధతికి దూరమవుతుండటం. తెలుగు సినిమాల కథలు డైరెక్టుగా నడుస్తుండటం. తెలుగు సినిమాల్లో ఎమోషన్లు, డ్రామా ఇప్పుడొస్తున్న హిందీ సినిమాలకి మాదిరిగా కాక కుటుంబ ప్రేక్షకులకి నచ్చే మోతాదులో స్ట్రాంగ్‌గా ఉండటం.
అయితే బాలీవుడ్ సినిమాలతో పోల్చుకుంటే మన తెలుగు డబ్బింగులు ప్రాంతీయ భోజ్‌పురి సినిమాలతో సమానం. అంతకంటే వాటికి స్థాయీ, విలువా లేవు. కాకపోతే టెక్నికల్‌గా, మేకింగ్ పరంగా ఇవి భోజ్‌పురి సినిమా నిర్మాతలు కలలో కూడా ఊహించని భారీతనంతో ఉంటాయి. ఇంకా ఈ హిందీ చానళ్ల వీక్షకులకి బోనస్ ఏమిటంటే ఈ తెలుగు డబ్బింగుల్లో విలన్లు హిందీవాళ్లే కావడం. ముఖేశ్ రుషి, సాయాజీ షిండే నుంచి ప్రదీప్ రావత్, సోనూ సూద్ దాకా హిందీ ప్రేక్షకులకి తెలిసిన ముఖాలే ఉండటంతో అదొక ప్లస్ పాయింట్ అవుతోంది.
కొన్ని పాత్రల నేటివిటీ మార్పు పేరు మార్పుతో సులభంగా జరిగిపోతోంది. కమెడియన్ నల్లగా ఉంటే కాలూ (నల్లటివాడు) అని పేరు పెట్టేస్తారు. తెల్లగా ఉంటే సమస్య ఉండదు. అలా కొన్ని హిందీ నేటివిటీకి అతకని దృశ్యాలుంటే, అవి కథాగమనాన్ని దెబ్బతీయకపోతే తీసేస్తారు. గమనించదగ్గ సంగతేమంటే ఈ సినిమా టైటిల్స్‌లో టైగర్ అనే పదం ఎక్కువగా కనిపించడం. భవానీ ద టైగర్ (పలనాటి బ్రహ్మనాయుడు), ఇంద్ర ద టైగర్ (ఇంద్ర), టైగర్ ఎ ఒన్‌మేన్ ఆర్మీ (సుబ్బు) వంటివి అందుకు ఉదాహరణలు. మరికొన్ని టైటిల్స్ హిందీ హిట్ సినిమాల టైటిల్స్ గుర్తొచ్చేలా పెడతారు. ద రియల్ ఇండియన్ (ఒక్క మగాడు), డాన్ నెం.1 (డాన్), ఏక్ ఔర్ హిమ్మత్‌వాలా (అందరివాడు), అతిథి ఇంటర్నేషనల్ ఖిలాడీ (అతిథి), మేరీ జంగ్ (మాస్), విశ్వ (నేనున్నాను), రాబరీ (సూపర్), పెహలీ నజర్ కా పెహలా ప్యార్ (సంతోషం) వంటివి వాటిలో కొన్ని. 
ప్రతినిత్యం మధ్యాహ్నం వేళ హిందీ చానళ్ల ప్రేక్షకులకి మంచి వినోద కాలక్షేపం అందిస్తున్న మన తెలుగు సినిమాలకి మరో ప్లస్ పాయింట్ కూడా ఉంది. వీటిలో హీరోయిన్లు హిందీవాళ్లే! ఏదేమైనా తెలుగు సినిమాల హిందీ డబ్బింగులతో మన స్టార్ల టాలెంట్ హిందీ ప్రేక్షకులకి - అదీ వాళ్ల ఇంటిల్లిపాదికీ పరిచయం కావడమంటే మామూలు విషయం కాదు.

No comments: