Thursday, October 13, 2011

జ్ఞాపకాలు: షావుకారు జానకి

మూడు నెలల పసిపాపను ఎత్తుకుని 17 ఏళ్ల వయసులో ఉన్న అమ్మాయి సినిమా ఛాన్సుల కోసం తిరగడాన్ని ఎలా ఊహించాలి? ఇదేదో ఇప్పటి సంఘటన కాదు. 1940ల కాలంలో జరిగింది. ఆ 17 ఏళ్ల యువతి ఎవరో కాదు, షావుకారు జానకి! అంతే కాదు, సినిమాలు చూడ్డమే తప్పనుకునే కుటుంబం నుంచి వచ్చిన ఆమె ఏకంగా 385 సినిమాల్లో నటించడం కూడా అసాధారణం. తన కెరీర్‌లో ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, రాజ్‌కుమార్, శివాజీ గణేశన్ వంటి గొప్ప నటులతో నటించిన జానకి సినిమాల్లో చేరడం అంత ఈజీగా జరగలేదు.
జానకి తండ్రి ఓ పేపర్ తయారీదారుడు. వ్యాపారం కారణంగా తరచూ ఊళ్లు మారుతుండే ఆయన వల్ల ఆమె చదువు సరిగా సాగలేదు. 15 ఏళ్ల వయసులో ఆల్ ఇండియా రేడియోలో తెలుగు నాటకాలు ఆడుతున్నప్పుడు ఆమె గొంతు విని, ఆమెని చూడాలనుకున్నారు ప్రఖ్యాత దర్శకుడు బి.ఎన్. రెడ్డి. ఆమెని చూసి సినిమా ఆఫర్ ఇచ్చారు. సంతోషంతో ఈ సంగతిని చెప్పడానికి ఇంటికెళ్లిన జానకికి నిరాశ ఎదురైంది. ఆమె తల్లి, సోదరులు మరో మాటలేకుండా ఆ అవకాశాన్ని తిరస్కరించారు. ఆల్ ఇండియా రేడియోకే ఆమెని పంపడం పెద్ద తప్పయ్యిందని భావించిన వాళ్లు అప్పటికప్పుడు సంబంధం చూసి 1947లో పెళ్లి చేసేశారు. పెళ్లయిన రెండేళ్లకి మరో ఉద్యోగం కోసం ఉన్న ఉద్యోగాన్ని వదిలేశాడు ఆమె భర్త. అప్పుడు జానకి గర్భవతి. అప్పుడామె గతంలో తనకొచ్చిన సినిమా అవకాశం గురించి చెప్పి, సినిమాల్లో నటించడానికి అనుమతి కోరింది. భర్త వెంటనే ఒప్పుకున్నాడు. బిడ్డని కన్నాక ఆ పాపతో పాటే వెళ్లి బి.ఎన్. రెడ్డిని కలిసింది జానకి. ఆ సమయంలో ఆయన చేతిలో సినిమాలేవీ లేవు. తన ఆర్థిక పరిస్థితి వివరించి సినిమాలే తనకి దిక్కని ఆయనకు చెప్పింది జానకి. దాంతో ఆయన ఆడిషన్ కోసం తన తమ్ముడు నాగిరెడ్డి వద్దకు పంపాడు. నెల రోజుల మానసిక వేదన తర్వాత 'షావుకారు'లో హీరోయిన్‌గా తీసుకుంటున్నట్లు ఆమెకి కబురొచ్చింది. అంతే! ఇటు విమర్శకుల, అటు ప్రేక్షకుల ప్రశంసలు పొందిన ఆ సినిమాతో 'షావుకారు' ఆమె ఇంటిపేరుగా మారిపోయింది.
అయితే వ్యక్తిగత జీవితంలో ఆమె కష్టాలు తీరలేదు. ఆ సినిమా షూటింగ్ జరిగేప్పుడు ఇంటికొచ్చి ఎన్టీఆర్‌తో తను చేసిన సీన్లు చెప్పినప్పుడు ఆమె భర్త అసూయతో రగిలిపోయేవాడు. మాటలతో వేధించాడు కూడా. కానీ తనని నమ్మమని ఆమె అతన్ని అర్థించింది. ఎలాగైతేనేం... నటిగా ఆమె అందరి హృదయాల్ని చూరగొంది. మొహంలో గ్లామర్ లేకపోయినా తన డైలాగ్ డెలివరీ, హావభావాలతోటే ఆమె తెరపై రాణించింది. 1950, 60లలో చక్కటి పాత్రలతో తనదైన ముద్రని వేసిందామె. ఆమె తెలుగులోకంటే తమిళంలో మరింత పేరు తెచ్చుకోవడం విశేషం. బి.ఎస్. రంగా, బి.ఆర్. పంతులు వంటి డైరెక్టర్ల కారణంగా కన్నడంలోనూ ఆమె రాణించింది. రాజ్‌కుమార్‌తో ఆమె చేసిన సినిమాలు హిట్టయి, అక్కడా ఆమెకి పేరు తెచ్చాయి.
కెరీర్‌లో ఉచ్ఛ స్థితిలో ఉండగా 1965 ప్రాంతంలో కె. బాలచందర్‌కి చెందిన నాటక సంస్థలో చేరి రంగస్థలంపైనా అడుగుపెట్టింది. అయితే వెండితెర జీవితంలో ఆమె సాధించిన విజయాలు వ్యక్తిగత జీవితంలోని ఆటుపోట్ల కారణంగా వెలుగుతగ్గాయి. ఆమె వైవాహిక జీవితం ఒడిదుడుకులకు గురయ్యింది. పిల్లల భవిష్యత్తు కోసం సగటు భారతీయ స్త్రీకు మల్లే కష్టాల్ని భరించింది. ఆమె ఓ భార్యగా విఫలమయి ఉండోచ్చు కానీ, ఓ తల్లిగా ఎప్పుడూ ఆమె విఫలం కాలేదు. 80 ఏళ్ల వయసులో బెంగళూరు శివార్లలో ప్రశాంత జీవితం గడుపుతున్న ఆమె ముని మనవలు, మనవరాండ్ర కోసం తరచూ చెన్నై వెళ్తుంటుంది.

No comments: