Friday, October 28, 2011

సాహిత్యం: రచయితకీ, కథకీ సంబంధం ఉండొద్దా?

కొంతమంది రచయితలు రచనని అంచనా వేసేప్పుడు ఆ రచయిత జీవితాన్ని పరిగణనలోకి తీసుకోకూడదంటారు. రచనలో ఉన్న గొప్పతనాన్ని మాత్రమే అంచనా వెయ్యాలనీ, రచనకి రచయిత వ్యక్తిత్వంతో సంబంధం ఉండాల్సిన అవసరం లేదనీ అంటారు. ఈ దృక్పథాన్నే ప్రమాణంగా పెట్టుకుంటే జరిగేదేమిటి? ఒక సమాధిలాంటి స్థితిలోకి వెళ్లి రచయిత ఓ కథని సృష్టించి లోకం మీద వదులుతాడు. అది అతడి జీవితాన్ని ఏ విధంగానూ ప్రతిబింబించదు, ప్రతిబింబించాల్సిన అవసరం లేదు. ఆ రచయిత పిసినారి అయి దాతృత్వాన్ని ఆకాశానికెత్తవచ్చు. మతతత్వవాది అయి, మత సామరస్యాన్ని ఉపదేశించవచ్చు. దుర్మార్గుడయి, మంచితనాన్ని బోధించవచ్చు. స్త్రీలోలుడై ఉండి పాతివ్రత్యం గురించి ఘనంగా చిత్రించవచ్చు. అతని కథ గొప్పది కావచ్చు. అతను నీచుడు కావచ్చు. అందులో తప్పు ఎంచకూడదు - ఈ దృక్పథాన్ని మనం ఒప్పుకున్నట్లయితే, అప్పుడు ఇంకో సమస్య వచ్చి పడుతుంది. రచయితకి 'హక్కు' ఉంటే పాఠకుడికి కూడా హక్కు ఉండి తీరాలి. అతను కూడా ఓ 'సమాధి'లోకి వెళ్లి ఆ కథని ఆస్వాదించి తిరిగి తన నిత్య జీవితంలో అడుగుపెడతాడు. ఆ రచన తాలూకు ప్రభావం వాడిపైన ఏమాత్రం ఉండాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు ఆ కథ సాధించే ప్రయోజనం ఏమిటి? నిష్ప్రయోజనం!
కథకుడి జీవితానికీ, కథకూ ముడిపెట్టకూడదనడంలోనే అసలు పొరపాటున్నది. ఈ రెంటికీ కేవలం సంబంధం కాదు సన్నిహిత సంబంధం ఉంది. కథాసృజనకి ప్రేరణ ఇచ్చేది జీవితం. రచయిత జీవితానికైనా రూపం కల్పించేది అతని సామాజిక దృక్పథమే. రచయిత ఆత్మవంచన చేసుకోవడం అసాధ్యమేమీ కాదు. కులగజ్జి నుంచి బయటపడటానికి రవ్వంతైనా ప్రయత్నం చెయ్యనివాడు కులరహిత భావాల్ని తన కథలో ప్రవేశపెట్టవచ్చు. లౌకికవాదులు దాన్ని బేషని మెచ్చుకోవచ్చు. కాని ఇట్లాంటి రచయితలు ఏనాటికైనా ఉత్తమస్థాయిని అందుకోలేరు. వారి కథల్లో ఉండే 'వంచన'ని సమకాలికులు అర్థంచేసుకోకుండా ఉండరు. చిత్తశుద్ధితో సృజించిన కథలు జీవించే ఉంటాయి.

No comments: