Thursday, November 12, 2015

Synopsis of the movie UNDAMMA BOTTU PEDATHA (1968)

'ఉండమ్మా బొట్టుపెడతా' కథాంశం:

భూమిని నమ్ముకుని కాయకష్టం చేసి శ్రమించే దశరథరామయ్య (నాగయ్య) కుటుంబం ఒక సంవత్సరం పంటలు పుష్కలంగా పండించింది. అది గుర్తించిన ప్రభుత్వం ఆయనను 'కృషి పండిట్' బిదురుతో సత్కరించాలనుకుంది. ఆ బిరుదుకు తను అర్హుణ్ణి కాననీ, తన మనవరాలు లక్ష్మి అని చెబుతూ ఆయన తన కుటుంబ గాథను వివరిస్తాడు. ఆ కథ ప్రకారం...
దశరథరామయ్యకు నలుగురు కొడుకులు. పెద్ద కొడుకు శ్రీనివాసులు (నాగభూషణం) పేకాట మినహా మరో వ్యాపకంలేని వ్యక్తి. అతని భార్య తులశమ్మ (జానకి) మూఢభక్తి శిఖామణి. పత్రీ పుష్పాలతో దేవుణ్ణి కొలవడం తప్ప ఇల్లూ వాకిలీ చక్కదిద్దుకోవడం ఎరుగని ఇల్లాలు. రెండో కొడుకు వెంకటేశ్వర్లు (అర్జా జనార్దనరావు) కండబలంతో రౌడీగా బతుకుతూ, నిత్యం సారా మైకంతో భార్య శేషు (సూర్యకళ)పై పిడిగుద్దులు కురిపిస్తుంటాడు. పగలంతా మొగుడితో కీచులాటలాడి, తన్నులుతిని అదే ఊళ్లోని పుట్టింటికి పోవడం, రాత్రయ్యేసరికల్లా సింగారించుకుని మొగుడి పక్కలో చేరడం శేషు దినచర్య.
మూడో కొడుకు ఆంజనేయులు (చలం) మోజుపడి ఇంగ్లీష్ చదివిన అమ్మాయిని భార్యగా చేసుకొని, ఆమెకు బెడ్ కాఫీ అందిస్తూ వంటవాడిగా తయారైన మనిషి. ఆ భార్య సుమతి (మీనాకుమారి) అచ్చంగా కుమతి. మొగుణ్ణి వాజమ్మను చేసి దర్జా, దర్పం వెలిగిస్తూ ఉంటుంది. ఇక నాలుగో కొడుకు కృష్ణ (కృష్ణ) అవివాహితుడు. తన భాగానికొచ్చిన పొలాన్ని నమ్ముకొని తండ్రికి అండగా ఉన్న మంచివాడు.
బాధ్యత తెలీని కొడుకులూ, కోడళ్లతో అరాచకత్వం తాండవిస్తున్న ఇంటిని చూసి దశరథరామయ్య కుమిలిపోతుంటాడు. ఆ ఊళ్లోనే ఓ హరిదాసు (ధూళిపాళ) కుటుంబం ఉంటోంది. ఆయనకు ఒకే ఒక్క కూతురు లక్ష్మి (జమున). 'అడుగడుగున గుడివుంది, అందరిలో గుడివుంది' అని నమ్మిన యువతి. శుచి, శుభ్రం ఉన్న ఇంట్లోనే శ్రీ మహాలక్ష్మి కొలువుంటుందని ఆమె నమ్మకం.
హరిదాసు రోజూ ఊళ్లో భిక్షాటన చేసి, ఆ వచ్చిన బియ్యాన్ని పాపాయమ్మకు అమ్ముకుని, ఆ డబ్బు ఆమె వద్దే కూడబెడుతుంటాడు. ఆ డబ్బుతో కూతురికి మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేయాలనేది ఆయన సంకల్పం. పాపాయమ్మ (సూర్యకాంతం) పేరుకు తగినట్లే పాపాలపుట్ట. కాఫీ ఇడ్లీల దగ్గర్నుంచి 'రూపాయి సోడా' (సారా) దాకా ఆమె దగ్గర దొరుకుతాయి. ఎవరింట్లోనన్నా ఏ వస్తువైనా కనిపించలేదంటే అది పాపాయమ్మ ఇంట్లో తాకట్టుకు చేరివుంటుందని చెప్పుకుంటారు. లక్ష్మికి సంబంధం ఖాయం చేసుకున్న హరిదాసు తన డబ్బు కోసం పాపాయమ్మ దగ్గరకు వచ్చి అడుగుతాడు. ఆ డబ్బు ఇవ్వకపోగా హరిదాసే తన డబ్బు కాజేయడానికి తనను కొట్టాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి, ఆయనను అరెస్ట్ చేయిస్తుంది పాపాయమ్మ.
పీటలమీద పెళ్లి చెదిరిపోవడం, తన తండ్రి అపనిందకు గురికావడం భరించలేని లక్ష్మి ఆత్మహత్యకు పూనుకుంటుంది. ఆమెను కృష్ణ కాపాడతాడు. అదే ముహూర్తానికి లక్ష్మిని తనయింటి కోడలిగా చేసుకుంటాడు దశరథరామయ్య. ముష్టివాడి కూతుర్ని ఆ ఇంటి కోడల్ని చేసినందుకు పెద్ద కోడళ్లు ఈసడిస్తారు. అడుగడుగునా అవమానిస్తారు. తోడికోడళ్లు ఎలా ప్రవర్తించినా, ఆ ఇంటికి దీపంగా, భర్తకు నీడగా ఉంటూ వస్తుంది లక్ష్మి.
అరాచకత్వం, అపరిశుభ్రం తాండవిస్తున్న ఆ ఇంటినుండి శ్రీ మహాలక్ష్మి వెళ్లిపోతుండగా, ఆమెను అక్కడ నిలిపేందుకు ఆత్మత్యాగం చేసిన లక్ష్మి పేరంటాలై వెలుస్తుంది. ఆమె ఆత్మత్యాగంతో కళ్లు తెరిచిన ఆ కుటుంబం ఏకమై, అందరూ కష్టించి పనిచేసి, ఆ ఇంటిని సిరులతో కళకళలాడిస్తారు.

తారాగణం: కృష్ణ, జమున, గుమ్మడి, షావుకారు జానకి, ధూళిపాళ, సూర్యకాంతం, అంజలీదేవి, చలం, నాగభూషణం, నాగయ్య, అర్జా జనార్దనరావు, మీనాకుమారి, సూర్యకళ
సంగీతం: కె.వి. మహదేవన్
సమర్పణ: ఆదుర్తి సుబ్బారావు
నిర్మాత: సి. సుందరం
దర్శకత్వం: కె. విశ్వనాథ్
బేనర్: బాబూ మూవీస్
విడుదల తేది: 28 సెప్టెంబర్ 1968

No comments: