Monday, June 21, 2010

Kota Srinivasa Rao's son Prasad dead in road accident







కోట శ్రీనివాసరావుకు విషాదం మిగిల్చిన ఫాదర్స్‌డే
విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావుకు ఫాదర్స్‌డే తీరని విషాదాన్ని మిగిల్చింది. ప్రపంచవ్యాప్తంగా అందరు కొడుకులు ఫాదర్స్‌డే జరుపుకుంటుంటే కోట మాత్రం పుట్టెడు పుత్రశొకంలో మునిగిపొయ్యారు. ఆయన కుమారుడు ప్రసాద్ ఆదివారం (జూన్ 20) హైదరాబాద్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. భార్యాపిల్లల్ని కారులో రమ్మని చెప్పి ఇటీవలే కొనుగోలు చేసిన కొత్త స్పోర్ట్స్ బైక్‌పై శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోని నోవాటెల్‌కు లంచ్ చేసే నిమిత్తం వెళ్తున్న ఆయనను లారీ ఢీకొనడంతో రోడ్డుపై పడిపోయారు. తలకు, కాళ్లకు తీవ్రగాయాలైన ఆయనను స్థానికులు సమీపంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. కోటకు ప్రసాద్ ఒక్కరే కొడుకు కాగా ఇద్దరు కుమార్తెలున్నారు. ప్రసాద్ ఇప్పటివరకు రెండు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం మూడొ చిత్రం 'గాయం-2'లో నటిస్తున్నారు. జగపతిబాబు హీరోగా జె.డి. చక్రవర్తి డైరెక్ట్ చేసిన 'సిద్ధం' సినిమాలో సలీం అనే నెగటివ్ పాత్రతో తొలిసారి ప్రేక్షకులకు పరిచయమయ్యారు ప్రసాది. ఆ పాత్ర పోషణతో ఆయన ప్రేక్షకుల అభినందనలే కాక విమర్శకుల ప్రశంసలూ చూరగొన్నారు. నిజానికి ఆయన మొదట ముఖానికి రంగేసుకున్నది 'వీడు వాడు ఇంకొకడు' అనే సినిమాకి. సీనియర్ రచయిత దివాకర్‌బాబు కుమారుడు శ్రీకర్‌బాబు నటించి, రూపొందించిన ఈ సినిమా ఇప్పటివరకు వెలుగు చూడలేదు.
'గాయం-2'లో నిజ జీవిత పాత్రల్నే కోట శ్రీనివసరావు, ప్రసాద్ పోషిస్తుండటం గమనార్హం. ఇందులోనూ హీరో జగపతిబాబే. అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కొడుకు పాత్ర చనిపోతుంది. ఆ సందర్భంగా వచ్చే కొడుకు భౌతికకాయానికి తలకొరివి పెట్టే సన్నివేశాన్ని చేయడానికి కోట నిరాకరించారు. దాంతో ఆయన డూప్‌తో ఆ సన్నివేశాన్ని తీసినట్లు తెలిసింది. అయితే సినిమాలో ఆ సన్నివేశాన్ని అభినయించడాన్ని తప్పించుకున్న కోట నిజ జీవితంలో మాత్రం ఆ సన్నివేసం నుంచి తప్పించుకోలేకపోవడం విషాదంలో విషాదం. దుర్ఘటన జరిగినప్పుడు ఆయన బెంగళూరులో ఉన్నారు. వార్త తెలియగానే హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకున్న ఆయన ఆస్పత్రిలో కుమారుడి పార్థివ శరీరాన్ని చూసి కుప్పకూలిపోయారు. ఇక ఫిలింనగర్‌లోని ఆయన ఇల్లయితే శోకసంద్రంగా మారింది. మూడు దశాబ్దాలకు పైగా చిత్రసీమతో కోటకు ఉన్న అనుబంధం వల్ల ఆయనకు హితులు, స్నేహితులు, సన్నిహితులు లెక్కకు మించి ఉన్నారు. వారంతా కోట కుమారుడి మరణ వార్తతో దిగ్భ్రాంతికి గురయ్యారు. అనేక సినిమాల్లో కోటకు అసిస్టెంట్‌గా నటించిన కమెడియన్ బాబూమోహన్ సాయంత్రం నుంచి రాత్రివరకు కోటని ఓదారుస్తూ ఆయనని అంటిపెట్టుకునే ఉన్నారు. కోటను పరామర్శించి, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపినవారిలో ఎం. వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, సిహెచ్. విద్యాసాగరరావు, జె. కిషన్‌రెడ్డి వంటి బీజీపీ నాయకులు; చిరంజీవి, రామానాయుడు, అల్లు అరవింద్, సురేశ్‌బాబు, వెంకటేశ్, పవన్ కల్యాణ్, త్రిపురనేని మహారథి, పరుచూరి బ్రదర్స్, జగపతిబాబు, శ్రీహరి, శాంతి, కవిత, ఇ.వి.వి. సత్యనారాయన, రేలంగి నరసిమ్హారావు, చలపతిరావు, శివకృష్ణ, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవీయస్, వివి వినాయక్, వీరశంకర్, చక్రపాణి, రోజారమణి, తరుణ్, రాజీవ్ కనకాల, ఆర్యన్ రాజేశ్, నరేశ్, రోహిత్, వరుణ్ సందేశ్ తదితర చిత్రసీమ ప్రముఖులున్నారు. ప్రసాద్, తను దాదాపు సోదరుల్లాగా మెలగుతుంటామనీ, 'సిద్ధం'తోనే తామిద్దరికీ బ్రేక్ వచ్చిందనీ, ఆయన మరణాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నాననీ ప్రసాద్‌తో సన్నిహితంగా మెలగే నటుడు, అపోలో ఆస్పత్రిలో కార్డియాలజిస్ట్ అయిన డాక్టర్ భరత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రాసాద్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. భర్త మరణవార్త తెలియగానే భార్య మోనా స్పృహతప్పి పడిపోయారు. రాత్రివరకు ఆమె ఆ స్థిలోనే ఉన్నారు. ప్రసాద్ మృతదేహాన్ని రాత్రి నింస్ ఆస్పత్రిలో ఉంచారు. సోమవారం ఉదయాన్నే భౌతికకాయాన్ని స్వగృహానికి తరలించి, ఆ తర్వాత అంత్యక్రియలు జరుపనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

No comments: