Wednesday, June 30, 2010

'Komaram Bheem' is coming to cinema halls

ఆదిలాబాద్ ప్రాంతంలోని గిరిజనుల హక్కుల కోసం చావుకు తెగించి పోరాడిన గోండు యోధుడు కొమరం భీం కథ ఎంతో ఉత్తేజభరితం, మరెంతో ఉద్వేగభరితం. ఆయన కథతో సుమారు 20 యేళ్ల క్రితం రూపొందిన 'కొమరం భీం' సినిమా ఇన్నాళ్లకి జూలై 2న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. నవలా రచయితా అప్పుడప్పుడే పాపులర్ అవుతున్న అల్లాణి శ్రీధర్‌కి డైరెక్టర్‌గా ఇదే తొలి సినిమా. 'మాభూమి' చిత్రానికి ఉత్తమ రచయితగా నంది అవార్డు పొందిన సినీ నవలా రచయిత ఎస్.ఎం. ప్రాణ్‌రావు ఈ చిత్రానికి రచన చేసి, సంభాషణలు సమకూర్చారు. ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ఆయనా, శ్రీధర్ కలిసి ఆదిలాబాద్ అడవుల్లో మూడు నెలలు గోండులతో కలిసి గడిపి వారి ఆచారాలు, సంప్రదాయాలు, శుభ, అశుభ కార్యక్రమాలను అధ్యయనం చేశారు. "కొమరం భీం భార్య ఎక్కడ ఉన్నారో కనుగొని, ఆమెని కలిశాం. అప్పుడామె దయనీయ స్థితిలో ఉన్నారు. భీం గురించి ఆమె చాలా విషయాలు చెప్పారు" అని తెలిపారు ప్రాణ్‌రావు. కొమరం భీం పాత్రని రంగస్థల నటుడు, రచయిత అయిన భూపాల్‌రెడ్డి పోషించారు. "కొమరం భీం ఇలాగే ఉంటాడేమో అన్నట్లుగా ఆ పాత్ర పోషణ చేశారు భూపాల్" అని ప్రాణ్‌రావు, శ్రీధర్ ఇద్దరూ ప్రశంసించారు.
విశేషమేమంటే ఈ చిత్రంలోని పాటల్ని భూపల్ స్వయంగా రాశారు. అంతకంటే విశేషం, ఆ పాటలకి అవార్డు చిత్రాల దర్శకుడు గౌతం ఘోష్ సంగీతం సమకూర్చడం. అప్పట్లోనే నంది అవార్డుల్లో ఈ చిత్రానికి ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు, ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రం అవార్డులు లభించాయి. అయితే "దర్శకుడిగా నంది అవార్డును తీసుకున్నా నాకు తృప్తిలేదు. నాకు కావలసింది నంది కాదు, ఈ సినిమాకి వచ్చిన ప్రేక్షకుడి చేతిలోని టిక్కెట్టు. ఈ సినిమా ఇన్నాళ్లకి విడుదలవబోతోందంటే ఎంతో భావోద్వేగంగా ఉంది" అని సహజంగీనే స్పందించారు శ్రీధర్.
ఈ సినిమా షూటింగ్ అంతా ఆదిలాబాద్ అడవుల్లో జరిగింది. ఎండకి ఎండుతూ, వానకి తడుస్తూ ఈ సినిమా కోసం పనిచేశారు. "ఈ సినిమా రూపకల్పన విషయంలో ఆదిలాబాద్ గిరిజనుల సహకారం మరవలేనిది. ఇది తెలంగాణ కథ. ఇందులోనివి తెలంగాణ మాటలు, పాటలు. అడవిలోనే మొత్తం షూటింగ్. నాతో సహా అందరూ నేలమీదే పడుకుని, నదిలో స్నానం చేసేవాళ్లు షూటింగ్ జరుగుతున్నంత కాలం" అని అప్పటి రోజుల్ని భూపాల్ జ్ఞప్తి చేసుకున్నారు. ఆదివాసి చిత్ర (ఐటిడిఎ, ఉట్నూరు), ఫిల్మీడియా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో భీం భార్యగా మౌనిక నటించగా, శ్రీధర్ మిత్రుడు కె. భవానీశంకర్ సినిమాటోగ్రఫీని అందించారు. గిరిజన సంక్షేమశాఖ సహకారంతో ఎఫ్.డి.సి., కొమరం భీం ఫౌండేషన్ ద్వారా జూన్ తొలి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఒక అల్లూరి సీతారామరాజు లాగా, ఒక భగత్‌సింగ్ లాగా, జనం హృదయాల్లో నిలిచిన పోరాట యోధుడు 'కొమరం భీం' జీవితాన్ని తెరమీద చూసే అవకాశం ఇన్నాళ్లకైనా కలుగుతుండటం హర్షణీయం.

No comments: