Tuesday, November 10, 2015

Synopsis of the movie BHALE MASTARU (1969)

'భలే మాస్టారు' కథాంశం:

డిగ్రీ అర్హతలు అన్నీ ఉన్న నిరుద్యోగి మధు. చదువు పూర్తయ్యేసరికి ఉన్న ఇల్లు కూడా తాకట్టు పాలవుతుంది. కన్నతల్లి క్షయవ్యాధికి గురవడంతో ఆమెను రక్షించుకునే దారి తెలీక విలవిలలాడిపోతాడు. ఆ సమయంలో ఒక పత్రికా ప్రకటన ఎడారిలో ఒయాసిస్సులాగా కనిపించింది. ఆ ప్రకటన సారాంశం.. జమీందార్ గారింట్లో ప్రైవేట్ మాస్టార్ ఉద్యోగం. నెలకు రూ. 700 జీతం. ఎమ్మే డిగ్రీ ఉండాలి. అన్నింటికీ మించి వయసు 50 సంవత్సరాలు దాటి ఉండాలి.. ఈ వయసొక్కటే అతడికి ప్రతిబంధకమైంది. ఏదేమైనా తల్లికి వైద్యం చేయించాలంటే డబ్బు కావాలి. కాలేజీలో ఆడిన నాటకాలు గుర్తుకొస్తాయి. ధైర్యే సాహసే లక్ష్మీ అనుకొని 25 యేళ్ల యువకుడు కాస్తా 50 యేళ్ల మధ్యవయస్కుడిగా జమీందార్ గారింట్లో అడుగుపెడతాడు.
ఇక్కణ్ణించి మధు జీవితం కొత్తగా మొదలవుతుంది. జమీందారిణి తమ్ముని పిల్లలు విజయ (బీయస్సీ), విమల (పీయూసీ), మెట్రిక్‌ను నాలుగేళ్లుగా చదువుతున్న బుచ్చిబాబు, మరో నలుగురు చిన్నపిల్లలు - వీళ్లకు చదువు చెప్పాలి. ఈ వయసుమీరిన మాస్టారి పీడ ఎలాగైనా వదిలించుకోవాలని వాళ్లూ, ఈ గడుగ్గాయిల్ని దారికి తెచ్చి ఉద్యోగం నిలబెట్టుకోవాలని మధూ - ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ఉంటారు.
మధు, విజయ సినిమాటిక్‌గా కలుసుకుని, కాస్త కరుకుగా, మరికాస్త ఘాటుగా ఊసులాడుకుని చివరకు సినిమాటిక్‌గానే ప్రేమలో పడతారు. ఆ సమయంలో అనుకోని ఉపద్రవం వచ్చి పడుతుంది. వయసుమళ్లిన జమిందారిణి హృదయంలో ప్రేమ బీజాలు మొలకెత్తుతాయి. ఎవడో ఓ మగాడు తన అక్కను మోసగించిన దాని ఫలితంగా ఆమె ఆత్మాహుతి చేసుకోవడంతో మొత్తం మగజాతి మీదనే ద్వేషం పెంచుకున్న జమిందారిణి సీతాదేవి మాస్టారుపై మనసు పారేసుకుంటుంది. అతణ్ణి పెళ్లిచేసుకోవాలని భావిస్తుంది. ఈలోగా మాస్టారు మేనల్లుడిగా పరిచయమైన మధుకు విజయనిచ్చి, ఆ తర్వాత తమ పెళ్లి జరుపుకోవాలని ఆమె ఉవ్విళ్లూరుతున్న సమయంలో కథ అడ్డం తిరుగుతుంది.
వయసొచ్చిన మరో అమ్మాయి విమల పైలా పచ్చీసుగా తిరిగే గిరి అనేవాడి వలలోపడి గర్భవతవుతుంది. గిరి ఆమెను చేపట్టేందుకు నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకోడానికి నదిలో దూకుతుంది. మాస్టారు ఆమెను కాపాడటంతో మధు నిజ స్వరూపం వెళ్లడవుతుంది. విమల జీవితాన్ని నాశనం చేసి, విజయను సైతం వల్లో వేసుకుని తనలో ప్రేమను రగిలించింది మధేననే కక్షతో అతణ్ణి కాల్చి చంపబోతుంది జమిందారిణి. ఆ సమయానికి అక్కడికి వచ్చిన మధు తల్లి ఆ తుపాకీ గుండుకు అడ్డువెళ్లి కొడుకును రక్షిస్తుంది.
కథ ఇక్కడితో ఆగక ఇంకొంత దూరం నడిచి బోల్డన్ని ఫైట్లూ ఫీట్లూ చేసి గిరిని మధు పట్టుకొని వచ్చి విమలకు అప్పగించి, జమిందారిణికి కనువిప్పు కలిగించి, విజయను సొంతం చేసుకోవడంతో కంచి వెళుతుంది.

తారాగణం: ఎన్టీ రామారావు, కాంచన, షీలా, అంజలీదేవి, కృష్ణంరాజు, రాజబాబు, అల్లు రామలింగయ్య, రమాప్రభ
సంగీతం: టి.వి. రాజు
నిర్మాత: సి.యస్. రాజు
దర్శకత్వం: ఎస్.డి. లాల్
బేనర్: విజయగిరి ధ్వజ

No comments: