Monday, November 16, 2015

Main Reason For RUDRAMADEVI Failure

'రుద్రమదేవి' ఫ్లాపవడానికి కారణం అదేనా?

గుణశేఖర్ డ్రీం ప్రాజెక్ట్ 'రుద్రమదేవి' వసూళ్లు రూ. 50 కోట్లకు చేరుకుంటున్నాయి. ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా ఈ స్థాయిలో వసూళ్లు చేయడం టాలీవుడ్‌లో ఇదే ప్రథమం. ఇంత చేసినా 'రుద్రమదేవి' ఫ్లాప్ ప్రాజెక్ట్‌గా మిగిలిపోనుండటం విచారకరం. రూ. 80 కోట్లు వసూలైతేనే కానీ ఆర్థిక ఇబ్బందుల నుంచి గుణశేఖర్ బయటపడే స్థితిలేదు. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం తెలుగు వెర్షన్ రూ. 42 కోట్లు, హిందీ, తమిళ, మలయాళ వెర్షన్లు కలిపి రూ. 6 కోట్లు వసూలు చేశాయి. ఫుల్ రన్‌తో ఇంకో రెండు కోట్లు వస్తాయని అంచనా. దీన్నిబట్టి థియేటర్ కలెక్షన్ పరంగా రూ. 30 కోట్లు డెఫిసిట్ వచ్చే అవకాశాలున్నాయి. శాటిలైట్ హక్కులు తీసేస్తే ఈ నష్టం కొత తగ్గుతుంది. దీంతో తెచ్చిన అప్పులను గుణశేఖర్ ఎలా తీరుస్తాడనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఆస్తులన్నీ అమ్ముకోవడంతో ఆయన తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
'రుద్రమదేవి' కథాంశంలో గుణశేఖర్ మరింత శ్రద్ధపెట్టి పనిచేసినట్లయితే వంద కోట్ల ప్రాజెక్ట్ అయ్యేందుకు అవకాశాలు ఉండేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 'రుద్రమదేవి' సినిమాలో రుద్రమదేవి పాత్ర హైలైట్ కాకుండా గోన గన్నారెడ్డి పాత్ర ఆకర్షణీయంగా కనిపించడంతోనే, ఈ సినిమా విషయంలో గుణశేఖర్ ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. రుద్రమదేవిని వీరనారిగా, మహా సామ్రాజ్ఞిగా చూపించడానికి బదులుగా ఎంతసేపూ ఆమె లైంగికతపైనే దృష్టి సారించడంతో ప్రేక్షకులను ఆ పాత్ర ఆశించిన రీతిలో ఆకట్టుకోలేదనేది నిజం. చిన్ననాటి నుంచి మగవాడిగా పెరిగిన రుద్రమదేవి యుక్తవయసు వచ్చాక తాను ఒక స్త్రీనని తెలుసుకోవడంతో మొదలైన ఈ లైంగిక కోణంపైనే చివరాఖరి వరకూ సినిమా నడవడం ప్రేక్షకుల్లో ఒకవిధమైన వ్యతిరేక భావన ఏర్పడటానికి దోహదం చేసింది. అలా కాకుండా రుద్రమదేవి ప్రదర్శించిన వీరత్వం, ఆమె రాజనీతిజ్ఞత, ప్రజల్ని పరిపాలించిన విధానంపై దృష్టి నిలిపినట్లయితే ఆమె పాత్రకు న్యాయం చేసినట్లయ్యేది.
సీనియర్ నటి విజయశాంతి గనుక ఈ సినిమా చేసినట్లయితే, ఆమె ఫోకస్ అంతా రుద్రమదేవి శక్తియుకుల మీదే ఉండేది. ఈ విషయాన్ని స్వయంగా ఆమే తెలిపారు. "ఇప్పుడొచ్చిన 'రుద్రమదేవి' లైన్ వేరు. మేము ఎంచుకున్న లైన్ వేరు. మా కథ రుద్రమదేవి పట్టాభిషేకంతో మదలై ఆమె 83వ యేట వరకూ నడుస్తుంది. ఆ వయసులోనూ శత్రువులపై పోరాడిన వీరనారి ఆమె" అని చెప్పారామె. తెలంగాణ ప్రత్యేక ఉద్యమంలో పాల్గొనడం వల్ల సినిమా చేయడానికి కుదరలేదనేది ఆమె మాట. లేనట్లయితే రుద్రమదేవిగా విజయశాంతి ఈ సరికే మనకు కనిపించి ఉండేవారు. ఆమె చెప్పినట్లుగా పట్టాభిషేకం తర్వాత నుంచే రుద్రమదేవి కథను చెప్పినట్లయితే ఈ సినిమా ఫలితం వేరుగా ఉండేదని విశ్లేషకులు నమ్ముతున్నారు. రుద్రమదేవికి సీక్వెల్‌గా 'ప్రతాపరుద్రుడు' తీయాలని గుణశేఖర్ భావిస్తున్నప్పటికీ, ఆయన కోరిక తీరే అవకాశాలు చాలా స్వల్పంగానే ఉన్నాయి.

No comments: