Wednesday, November 25, 2015

Synopsis of the movie BHALE ABBAYILU (1969)

'భలే అబ్బాయిలు' చిత్ర కథాంశం


స్వశక్తిని తప్ప విధిని పట్టించుకోని కోటయ్య (గుమ్మడి) కండలు కరిగించి, చెమటోడ్చి డబ్బు కూడబెట్టి కోటేశ్వరరావుగా మారతాడు. ఆయనకు ముగ్గురు కొడుకులు. వాళ్ల సుఖాల్ని చూడలేని విధి శీతకన్ను వేసింది. భూకంపంలో సర్వస్వమూ కోల్పోయి బికారి అవుతాడు కోటయ్య. కుటుంబం చెల్లాచెదురవుతుంది.
పెద్ద కొడుకు బాబ్జీ (కృష్ణంరాజు) ఓ అనాథాశ్రమంలో చేరి, అక్కడి మేనేజర్ పెట్టే బాధలు పడలేక పారిపోయి హైదరాబాద్ చేరి ప్రతాప్ (సత్యనారాయణ) అనే ఘరానా దొంగకు తోడుదొంగగా రాజాలా బతుకుతుంటాడు. రెండోవాడు రవి (కృష్ణ) విశాఖలో ఒక లాయర్ ఇంట పెంపుడు కొడుకై తాను కూడా లాయరవుతాడు.
తన కుటుంబాన్ని వెదుక్కుంటూ అనాథశరణాలయానికి వచ్చి తన కుమారుని చావుదెబ్బలు కొట్టాడన్న కసితో మేనేజర్‌ను హత్యచేసి జైలుపాలవుతాడు కోటయ్య.
హైదరాబాద్ జడ్జిగారింట్లో వజ్రాల హారం దొంగిలించిన రాజా, ఆ హారం ఆయన కూతురు మీనా (కె.ఆర్. విజయ) పుట్టినరోజుకు తెప్పించిందని తెలుసుకొని ఆ హారాన్ని తానే తిరిగి ఇచ్చేస్తాడు. ఆమె ఆకర్షణకు లోనై ఆమె కటాక్షం కోసం పడిగాపులు కాస్తుంటాడు.
అప్రెంటిస్ లాయర్‌గా పనిచేయడానికి హైదరాబాద్ వచ్చి జడ్జి ఇంట్లో దిగుతాడు రవి. అతను, మీనా ప్రేమించుకుంటారు. పెద్దల ఆకాంక్ష కూడా అదే కావడంతో పెళ్లికి ఎదురు చూస్తుంటారు. ఇది తెలిసి రవిని అంతంచేసి మీనాను దక్కించుకోవాలనుకుంటాడు రాజా. అయితే రవి తన తమ్ముడనే నిజం తెలిసి, తన ప్రేమను త్యాగంచేసి, రవికి బాసటగా నిలుస్తాడు.
అన్నదమ్ముల్లో మూడోవాడైన రాము (రామ్మోహన్)ను తల్లి కష్టించి పనిచేస్తూ డిగ్రీ వరకూ చదివిస్తుంది. ఆమె అనారోగ్యం పాలవడంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకొస్తాడు రాము. ఎక్కడా ఉద్యోగం దొరక్కపోవడంతో ప్రతాప్ వద్ద డ్రైవర్‌గా చేరతాడు. జైలునుండి విడుదలైన కోటయ్య సైతం భార్యాపిల్లల్ని వెతుక్కుంటూ హైదరాబాద్ చేరతాడు.
రామును రవి చెల్లెలు రాధ (గీతాంజలి) ప్రేమిస్తుంది. దానికి రవి వ్యతిరేకించడంతో రాము అనాథ అనే సంగతి బయటపెడ్తుంది రాధ. కథ మలుపు తిరిగి మీనా, రవి పెళ్లికి జడ్జి నిరాకరిస్తాడు. దాంతో రవి పెళ్లి బాధ్యతను రాజా స్వీకరిస్తాడు. అదే సమయంలో ప్రతాప్ తన అనుచరుణ్ణి చంపి, ఆ నేరాన్ని రాజాపై మోపుతాడు. డబ్బు కోసం తప్పుడు సాక్ష్యానికి సిద్ధమైన రాము చివరి నిమిషంలో నిజం చెప్పడం, లాయర్ రవి చాకచక్యంతో రాజాకు శిక్ష తప్పుతుంది. విధివశూత్తూ తప్పిపోయిన ఆ కుటుంబం తిరిగి విధివిలాసంతోనే కలవడంతో కథ సుఖాంతం.

తారాగణం: కృష్ణ, కేఆర్‌విజయ, కృష్ణంరాజు, గుమ్మడి, రామ్మోహన్, రాజనాల, శాంతకుమారి, ధూళిపాళ, గీతాంజలి, శైలశ్రీ, రేలంగి, రాజబాబు, అల్లు రామలింగయ్య, సత్యనారాయణ (గెస్ట్)
సంగీతం: ఘంటసాల
నిర్మాత: తోట సుబ్బారావు
దర్శకుడు: పేకేటి శివరాం
బేనర్: శ్రీదేవి కంబైన్స్
విడుదల తేదీ: 19 మార్చి

No comments: