Sunday, November 15, 2015

Need Change of Attitude of Film Makers

సినీ నిర్మాతల దృక్పథం మారాలి

సినిమాలు చాలావరకు ప్రజల మానసిక తత్వాల్లో, ప్రవర్తనలో మార్పు కలుగజేస్తాయి. ప్రతి సినిమా ఏదోవిధంగా ప్రజల మనస్సులలో హత్తుకుపోతుంది. సాధారణంగా జనం సినిమాల్లోని మంచికంటే, చెడునే ఎక్కువగా గ్రహిస్తుంటారు. 'చిడుము అబ్బుతుంది గానీ, సిరి అబ్బదు' అని పెద్దలు ఊరకే అన్నారా! సినిమా విలువని ఇతర దేశాలవాళ్లు గుర్తించినట్లు మనవాళ్లు గుర్తించలేదు. వాళ్లు ఉపయోగించుకుంటున్నట్లు, మనవాళ్లు వాటిని ఉపయోగించుకోవడం లేదు.
అయితే ఇటీవల మహేశ్ కథానాయకుడిగా దర్శకుడు కొరటాల శివ రూపొందించిన 'శ్రీమంతుడు' చిత్రం ప్రజలపై మంచి ప్రభావాన్ని చూపడం ఆనందించదగ్గ విషయం. అందులో కథానాయకుడు కోటీశ్వరుడైనప్పటికీ, ఎక్కువగా సైకిల్ మీదనే ప్రయాణం చేస్తుంటాడు. ఇది యువతని బాగా ఆకర్షించడంతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సైకిల్ వినియోగం పెరిగింది. అలాగే అతను ఒక ఊరిని దత్తత తీసుకొని, దాన్ని బాగు చేయడమనే అంశం బాగా ప్రచారంలోకి వచ్చి, సంపన్నవంతులు ఏదో ఒక ఊరిని దత్తత తీసుకోవడం మొదలుపెట్టారు. సినిమా కలిగించే మేలు ఎలా ఉంటుందో దీన్నిబట్టి అర్థమవుతుంది. అయితే ఇలాంటి మేలు కలిగించే సినిమాల కంటే ప్రజల నడతపై చెడు ప్రభావాన్ని కలిగించే సినిమాలే ఎక్కువగా వస్తుండటమే బాధాకరం.
రాంగోపాల్‌వర్మ తీసిన 'ఐస్‌క్రీం' లాంటి సినిమాల్లోని శృంగార, హింసాత్మక సన్నివేశాలు శ్రుతిమించి రాగాన పడ్డాయి. అవన్నీ యవ్వనంలోని లేత హృదయాల్ని ఎంత సునాయాసంగా కల్మష పరుస్తాయో ఇట్టే గ్రహించవచ్చు. వీటి వల్ల సమాజ జీవితం బలహీనమవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
సమాజంలోని చెడు ఏవిధంగా ఉందో చూపిస్తూ, దానివల్ల ఎన్ని ఉపద్రవాలు జరుగుతున్నాయో తెలియజేస్తూ, దానికి పరిష్కారాల్ని కమర్షియల్ ఫార్మట్‌లోనే చూపించవచ్చు. రాజకీయ, అధికార అవినీతిపై పోరాటం ప్రధానంగా కథాంశాలు తయారుచేసి సినిమాలు తీయవచ్చు. అయితే ఇలాంటి సినిమాల్ని యథాతథంగా తీస్తే ప్రభుత్వ అధీనంలోని సెన్సార్ బోర్డులు అడ్డు తగులుతుండటం శోచనీయం. ప్రభుత్వాన్నీ, దాని వ్యవస్థల్నీ, అధికార మదాంధుల్నీ ప్రశ్నించే సినిమాలు సెన్సార్ కత్తెరకు గురవుతుంటాయి. రాజ్యంపై తిరుగుబాటు నేపథ్యంలో సినిమాలు తీసే ఆర్. నారాయణమూర్తి సినిమాలకు అలాంటి కత్తిరింపులు ప్రతిసారీ జరుగుతూనే ఉన్నాయి. అయినా అలుపెరుగని యోధునిలా ఆయన ఆ తరహా సినిమాల్నే తీస్తూ రావడం సామాన్య విషయం కాదు. ఆయనను ఆదర్శంగా తీసుకొని మరింతమంది నిర్మాతలు, దర్శకులు సమాజానికి ఉపకరించే కథలతో సినిమాలు తీయాలి.
ప్రజలకు ఉపయోగపడే, వాళ్ల అభిరుచుల్ని పెంచే సినిమాలు విరివిగా రాకపోవడానికి మూడు కారణాలు కనిపిస్తాయి. మొదటిది - ప్రభుత్వ అధీనంలోని సెన్సార్ బోర్డులు అడ్డు తగలడం, రెండోది - ప్రభుత్వ సహకారం లేకపోవడం, మూడోది - ప్రజల నుంచి మంచి సినిమాల కోసం డిమాండ్ రాకపోవడం. ఈ ప్రతికూలతలు లేనట్లయితే తెలుగులో మంచి సినిమాలు క్రమం తప్పకుండా వస్తాయని చెప్పొచ్చు.

No comments: