Thursday, November 19, 2015

Synopsis of the movie AGGI MEEDA GUGGILAM (1968)

'అగ్గిమీద గుగ్గిలం' చిత్ర కథాంశం:


క్షుద్రవిద్యల్ని సొంతం చేసుకున్న మాయాపురం మాంత్రికుడు (రాజనాల) శ్రీపుర మహారాణి భట్టిణి (జూనియర్ శ్రీరంజని)ని అపహరించుకుపోయి, తన మాయా మందిరంలో బంధించి, ఆమెను వశపరచుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ అవమాన భారంతో మహారాజు (గుమ్మడి) కుంగిపోతాడు. రాణి ప్రమాదవశాత్తూ జలపాతంలో పడి మరణించిందని ప్రకటిస్తాడు. అయితే తన రహస్య మందిరంలో అహోరాత్రులూ కఠోర దీక్షలో మునిగిపోయి యక్షిణిని ప్రసన్నం చేసుకుంటాడు. అపూర్వ మంత్రశక్తుల్ని సాధిస్తాడు. ఈ శక్తులతో మాంత్రికుడి పీచమణచి, రాణిని బంధవిముక్తి చేయడానికి ఎదురు చూస్తుంటాడు.
రాజు వైమనస్యాన్ని అవకాశంగా తీసుకొని మంత్రి చండవర్మ (ధూళిపాళ) రహస్యంగా సైన్యాధిపతిని హతమార్చి తన కుమారుడు శకటాలు (సత్యనారాయణ)కు ఆ పదవిని కట్టపెట్టాలని పన్నాగం పన్నుతాడు. ఈ ప్రమాదాన్ని శంకించిన రాజు అందుకు అంగీకరించక పోటీలు ఏర్పాటుచేసి, వాటిలో నెగ్గిన వీరునికే ఆ పదవి ఇవ్వాలని ఆదేశిస్తాడు.
ఆ పోటీల్లో వీరేంద్ర (కాంతారావు) నెగ్గుతాడు. అయితే సైన్యాధిపతి పదవిని నిరాకరిస్తాడు. అతని శౌర్యపరాక్రమాలకు ముగ్ధురాలైన రాకుమారి చంద్రప్రభాదేవి (రాజశ్రీ) అతనికి తన హృదయాన్ని అర్పిస్తుంది. వీరేంద్రుడు అరణ్యంలో తన చెల్లి అరుణ (విజయలలిత), తాత (కాశీనాథ్ తాత)తో నివసిస్తూ ఉంటాడు. రాకుమారి మారువేషంతో అక్కడకు వెళ్లి సైన్యాధిపత్యానికి అతణ్ణి ఒప్పిస్తుంది. వీరేంద్రుని చెల్లి అరుణ ఒకరోజు విచిత్ర పరిస్థితుల్లో కామపురి యువరాజు అరిందముడి (రామకృష్ణ)ని కలుసుకొని ప్రేమలో పడుతుంది.
ఈ కథలో ఇంకో ఉపకథ వస్తుంది. నిజానికి వీరేంద్రుడు కామపురి యువరాజనీ, అరిందముడి తండ్రి కామపాలుడు వీరేంద్రుని తండ్రి అయిన రాజును హతమార్చి, పిల్లల్ని కూడా చంపాలనుకుంటుండగా, పసికందుల్ని తాను రక్షించి అరణ్యానికి తెచ్చినట్లు తాత చెబుతాడు. శ్రీపురంలో వీరేంద్రుని భక్తి విశ్వాసాల్ని పరీక్షించిన మహారాజు అతడ్ని రహస్య మందిరానికి తీసుకెళ్లి, తన వృత్తాంతమంతా అతనికి వివరిస్తాడు. మాంత్రికునిపై పోరాటానికి బయల్దేరి, అతనికి బందీ అవుతాడు. అడవిలో వెళ్తున్న అరిందముడిపై శకటాలు బలగం దాడిచేస్తుంది. వీరేంద్రుడు అతనికి సాయపడతాడు. ఆ పోరులో స్పృహతప్పిన అరిందముడిని తన ఇంటికి తీసుకుపోతాడు. తాత ద్వారా తన తండ్రి చేసిన రాజద్రోహాన్ని తెలుసుకుంటాడు అరిందముడు. తండ్రి అక్రమాల్ని వ్యతిరేకిస్తాడు. దాంతో కొడుకుని బంధించమంటాడు కామపాలుడు. భటుల నుంచి తప్పించుకొని పారిపోతాడు అరిందముడు.
మహారాజును వీరేంద్రుడు హత్యచేశాడని చండవర్మ ప్రచారం చేస్తాడు. ఫలితంగా ప్రియుణ్ణి అనుమానించి కారాగారంలో వేయిస్తుంది రాకుమారి. అక్కణ్ణించి వీరేంద్రుడు తప్పించుకొని మహారాజు కోసం మాంత్రికుని వద్దకు బయలుదేరుతాడు. కామపాలునితో కలిసి కుట్ర పన్నిన చండవర్మ శ్రీపుర రాజ్యాపహరణకు ప్రయత్నిస్తాడు. రాకుమారి, అరుణ పారిపోతుండగా పట్టుకొని బంధిస్తారు. మాంత్రికుని స్థావరం చేరిన వీరేంద్రుడు, అక్కడ ఆకాశ బేతాళుడికి సాయపడి, అతని సాయంతో మాంత్రికుడి ప్రాణాలుండే కప్పను చేజిక్కించుకుంటాడు. దాంతో కథ సుఖాంతం.
తారాగణం: కాంతారావు, రాజశ్రీ, రామకృష్ణ, విజయలలిత, రాజనాల, గుమ్మడి, ధూళిపాళ, సత్యనారాయణ, రాజబాబు, జ్యోతిలక్ష్మి
సంగీతం: సత్యం
నిర్మాతలు: పి.యస్. ప్రకాశరావు, ఎ. పూర్ణచంద్రరావు
దర్శకుడు: జి. విశ్వనాథం
బేనర్: నవభారత్ ఫిలిమ్స్
విడుదల తేదీ: 26 సెప్టెంబర్

No comments: