Thursday, November 26, 2015

Government Role for Telangana Cinema

తెలంగాణ సినిమా రావాలంటే...?

"చిత్ర పరిశ్రమ అవసరాలు ప్రభుత్వానికి తెలుసు. ఈ పరిశ్రమలోని అన్ని శాఖలూ అభివృద్ధి చెందడానికి సలహాలు ఇచ్చినట్లయితే ప్రభుత్వం సహాయం చేస్తుందని హామీ ఇస్తున్నాం. ప్రభుత్వమూ, సినీ పరిశ్రమ చేయీ చేయీ కలిపి పనిచేస్తే ఎంతో సాధించగలుగుతాం."
"ప్రజల అభిప్రాయాలపై సినిమాల ప్రభావం చాలా ఉండటం వల్ల మంచి సినిమాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోట్ల మంది జనం సినిమాలకు వినోదం కోసమే వెళ్తున్నారనే విషయం గుర్తుంచుకొనే, ఆ వినోదాన్నిస్తూనే ప్రేక్షకుల నైతిక, సాంఘిక అభివృద్ధికి తోడ్పడే సినిమాలు తియ్యాలి."
ఇలాంటి మాటలు ప్రభుత్వాధినేతల నుంచి  ఇటీవల తరచూ వింటున్నాం. అయితే ఆ మాటలన్నీ కంటితుడుపువి అనేది నిజం. కొన్నేళ్లుగా మనం చూస్తూ ఉన్న తెలుగు సినిమాలు ఎంత దుర్బలంగా, అవినీతికరంగా, అసభ్యకరంగా ఉంటున్నాయో తెలిసిందే. వినోదం, వ్యాపార స్వేచ్ఛ అనే వాటిని అడ్డం పెట్టుకొని నిర్మాతలు, దర్శకులు తీస్తున్న అసహ్య, అసభ్య సినిమాలు సమాజ ఉన్నతిని ఎంతగా దిగజార్చుతున్నాయో అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇరుకు మనసులు కలిగినవాళ్ల సినిమాలు అభ్యుదయ నిరోధకంగా ఉంటున్నందున, అలాంటి సినిమాలపై కత్తి ఝళిపించాల్సిందే. కానీ ఆ పని చేయాల్సిన సెన్సార్ బోర్డులు ఉత్సవ విగ్రహాలుగా మారిపోవడమే విచారకరం.
సమష్టి ప్రయోజనం కోసం సమష్టి పరిశ్రమ అనే ప్రాతిపదికమీదే ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంటుంది. సమష్టి పరిశ్రమలో వ్యష్టి త్యాగం అనేది అంతర్భాగం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అధిక లాభాల కోసం వ్యాపారం చేసే వ్యక్తులు చూస్తూ చూస్తూ ఎలా త్యాగం చేస్తారు? అందువల్ల సమష్టి శ్రేయస్సు కోసం ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. సినీ పరిశ్రమ క్షేమం కోసం కొంతమంది వ్యక్తుల్లో పెచ్చుమీరిపోతున్న అవినీతిని అరికట్టేందుకైనా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంది. ఇండస్ట్రీలో నెలకొని ఉన్న అక్రమ వ్యాపారాన్ని నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని కోసం శాసనాలు చేయడానికైనా ప్రభుత్వం వెనుకాడకూడదు. థియేటర్ల లీజు విషయంలో ఇంతవరకు సర్కార్లు ఎలాంటి జోక్యం చేసుకోకుండా చూస్తూ ఊరుకుంటున్నాయంటే లోపం ఎక్కడ ఉందో ఊహించుకోవాల్సిందే.
ఇప్పటికీ కాలం మించిపోలేదు. అవకాశాలు చెయ్యిదాటిపోలేదు. ప్రజల జీవితాల్లో ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ సినీ పరిశ్రమను ప్రభుత్వపు అజమాయిషీ కింద ఉంచుకొని కళను పోషించాల్సిన అవసరం చాలా ఉంది. చలన చిత్రాలకు సంబంధించి ప్రత్యేకంగా కేంద్రంలో ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చెయ్యాల్సిందిగా దేశానికి స్వతంత్రం వచ్చిన కొద్ది కాలానికే విఖ్యాత దర్శకుడు వి. శాంతారాం ప్రభుత్వానికి సూచించారు. అయితే నేటికీ అది సాఫల్యం కాకపోవడం శోచనీయం. సినిమాలు ఇప్పటికీ కేంద్రంలో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలో భాగంగానే ఉంటున్నాయి. హైదరాబద్‌లో తెలుగు సినీ పరిశ్రమ వేళ్లూనుకున్నాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఓ భాగంగా ఉంటూ వచ్చిన ఆ శాఖ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో భాగమైంది.
సినీ పరిశ్రమలోని సమస్యల్ని, అక్కడి పరిస్థితుల్ని అర్థంచేసుకొని పరిశ్రమను నడిపిస్తూ, అవసరమైన సహాయం చేయడం ఈ మంత్రిత్వ శాఖ ఉద్దేశంగా ఉండాలి. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక అనేకసార్లు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌తో తెలుగు నిర్మాతల మండలి వాళ్లు, తెలంగాణ నిర్మాతల మండలి వాళ్లు తమ సాధక బాధకాలు చెప్పుకున్నా, ఇంతవరకు పరిశ్రమకు మేలు చేసే దిశగా ఒక్క చర్యా తీసుకోలేదు. తెలంగాణ సినిమా రావాలంటే ప్రభుత్వ ప్రోత్సాహకాలు అవసరమని ఒకటిన్నరేళ్లుగా తెలంగాణ సినిమా రూపకర్తలు ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నా ఆ వైపుగా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. తెలంగాణ సినిమా వృద్ధి చెందకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చి ప్రయోజనం ఏమిటని ఇక్కడి నిర్మాతలు, దర్శకులు ప్రశ్నిస్తున్నారు.  ప్రభుత్వం ఉదారంగా ముందుకు వచ్చి పనిచెయ్యకపోతే తెలంగాణ సినీ పరిశ్రమ అనేది వేళ్లూనుకోవడంలో చాలా జాప్యం జరిగే అవకాశం ఉంది. దీని విషయమై తెలంగాణ సినిమావాళ్లతో పాటు తెలంగాణ ప్రజా సమూహమంతా ఆందోళన చెయ్యాల్సి ఉంది.

No comments: