Friday, November 6, 2015

Removing Of Fences

తెలుగు చిత్రసీమలో క్రిష్ ఒక విభిన్న దర్శకుడు. ఇవాళ్టి టాప్ డైరెక్టర్లలో అత్యధికులు మూస కథలు, భావావేశ సన్నివేశాలు, వినోదం, వందమందిని ఒక్కడే అలవోకగా చిత్తుచేసే యాక్షన్ ఎపిసోడ్స్‌తో నింపేసి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నవాళ్లే. వాళ్ళ సినిమాలు కేవలం కాలక్షేపం బఠాణీలే. అవి ప్రేక్షకుల అభిరుచుల్ని ఏమాత్రం పెంపొందించకపోగా, మరింత నష్టాన్ని కలగజేస్తున్నాయని చెప్పొచ్చు. ఆఖరుకి తెలుగు సినిమా సత్తాని ‘బాహుబలి’ విశ్వవ్యాప్తం చేసిందని ఎక్కువమంది గర్వపడుతున్నా, నా దృష్టిలో ఆ సినిమా కూడా ప్రేక్షకుల అభిరుచిని కాస్త కూడా పెంచే రకం కాదు. కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో ఆడియెన్స్‌ను అది మెస్మరైజ్ చేస్తే చేసుండవచ్చు. కానీ వస్తుపరంగా అది ఏమాత్రమూ ఉత్తమ స్థాయి సినిమా కానే కాదు.
రాజమౌళికి జనాన్ని ఎట్లా మెప్పించి, వాళ్ల డబ్బు కొల్లగొట్టాలనేదే ప్రధానం. దానివల్ల వాళ్ల ఆలోచనలు వికసిస్తాయా, వాళ్లలో మానసిక చైతన్యం కలుగుతుందా.. అనేది ఆయనకు పూర్తిగా అప్రధానం. ఆయన తీసిన ఏ సినిమా అయినా తీసుకోండి. అవన్నీ భావావేశాలు, ఉద్రిక్తతలు, ఉద్వేగాలు, భీబత్సాలతో నిండివుండేవే. సరిగ్గా క్రిష్ ఇందుకు పూర్తి విరుద్ధ దర్శకుడు. తొలి అడుగు ‘గమ్యం’ నుంచి, ఇప్పటి ‘కంచె’ దాకా అతడి సినిమాలు మానవ సంబంధాలపై అల్లినవే. వివిధ పరిస్థితుల్లో మనుషులు ఎట్లా ప్రవర్తిస్తుంటారు, ఎలా స్పందిస్తుంటారు అనే విషయాల్ని కమర్షియల్ పరిధిలోనే వీలైనంత వాస్తవికంగా చూపించే సినిమాలే. ‘కంచె’ ముందు ఆయన హిందీలో ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ సినిమాను తీస్తున్నప్పుడు నేను అసంతృప్తి చెందాను.
ఇప్పటికే రెండు భాషల్లో వచ్చిన సినిమాను హిందీలో తీయడంలో ఆయన ప్రతిభ ఏముంది? అసలు ఎందుకు ఆ ప్రాజెక్టుకు ఒప్పుకున్నాడా? అనేది ఆ అసంతృప్తికి కారణం. ఆ సినిమా సమాజంలోని.. ముఖ్యంగా బ్యూరోక్రసీలోని అవినీతిపై ఓ వ్యక్తి సాగించిన సమరం. కానీ అందులో వాస్తవికత కంటే, నాటకీయత పాలే ఎక్కువ. అంటే క్రిష్ స్కూల్‌కు భిన్నమైన అంశం. ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ ఆశించిన రీతిలో ఆడకపోవడంతో నేను సంతోషించాను. అవును నిజం. అది ఆడుంటే, క్రిష్ ఆ స్కూల్లోకి వెళ్లిపోయే అవకాశాలుంటాయి కదా. అలా జరగలేదు. ఫలితమే ‘కంచె’. ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో మొదటిరోజు ఉదయం మీడియాకు వేసిన 8.45 గంటల షోకు వెళ్లాను. ఇంటర్వెల్ పడింది. క్రిష్ చేసిన సాహసానికి ఆశ్చర్యపోయాను. యుద్ధ నేపథ్య చిత్రాలు తెలుగులో ఆడవనేది నాకున్న నమ్మకం.
మనవాళ్లు అట్లాంటి వాటికి కనెక్ట్ కారు. క్రిష్ ఈ సినిమాతో ఎంత పెద్ద సాహసం చేశాడంటే, తను తీసుకున్న నేపథ్యం కారణంగా విదేశీ పాత్రల్ని కీలక పాత్రలుగా చూపించాడు. జర్మన్, బ్రిటీష్ పాత్రలుగా అవి మనకు కనిపిస్తాయి. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో మినహా మిగతా సినిమా అంతా ఆ పాత్రలకు ప్రాధాన్యం ఉంది. వాటితో తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ కాలేరనేది అప్పటిదాకా నాకున్న అభిప్రాయం. చాలామంది సహచర మీడియా మిత్రులు ‘ఏందీ సినిమా? నాకైతే అర్థం కాలేదు. క్రిష్‌కు డబ్బులెక్కువయ్యాయా?’ అని కూడా అనడం విన్నాను. నలుగురైదుగురు నా వద్ద కూడా దాదాపు అలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. ‘సెకండాఫ్ కూడా చూసి మాట్లాడండి’ అన్నాను. సినిమా అంతా అయ్యాక నేనెవరి అభిప్రాయం కోసం ఆగలేదు. అప్పుడైనా వాళ్ల నుంచి భిన్నమైన అభిప్రాయం వస్తుందని అనుకోను. నా మనసు నిండుగా ఉన్నట్లనిపించింది.
మనుషుల మధ్య, వాళ్ల మనసుల మధ్య.. హోదాలు, అంతస్థులు, కులాలు ఎట్లా అడ్డు’కంచె’లవుతున్నాయో, అలాంటి ‘కంచె’ల కారణంగానే ఆధిపత్యం కోసం దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయని ప్రతీకాత్మకంగా చూపిస్తూ ఎంత బాగా తీశాడనుకున్నా. మనుషుల మధ్య ‘కంచె’ కారణంగా రెండు భిన్న నేపథ్యాలున్న ప్రేమికుల జీవితాలు ఎలా విషాదమయమయ్యాయో హృద్యంగా చూపించాడు దర్శకుడు. ఇక్కడ కూడా ఆయన ఫార్ములాకు భిన్నంగానే వెళ్లాడు. హీరో హీరోయిన్లు చనిపోతే.. ఆ సినిమాను తెలుగు ప్రేక్షకులు కన్నెత్తి చూస్తారా?.. అయినా క్రిష్ తెగించాడు. ‘కంచె’ల వల్ల జరుగుతున్న అనర్ధం తెలియాలంటే విషాదాంతమే సరైందనుకున్నాడు. అప్పుడే కదా.. అందులోని నొప్పి తెలిసేది. కథలో ఎవరైతే ప్రేమికులకు ప్రధాన అడ్డంకిగా నిలిచాడో, ఆ వ్యక్తి (హీరోయిన్ అన్న) చివరకు ఊళ్లమధ్య లేసిన ‘కంచె’లను తీసేయమనడం కథకు సరైన ముగింపు.
ఈ సినిమా ఆడితే.. ప్రేక్షకులు ఎదిగినట్లేననేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇవాళ వినోదం కోసమే సినిమాలు చూస్తున్నవాళ్లు ఎక్కువ. యువత కోరుకుంటోంది అదే. అలాంటప్పుడు ‘కంచె’లాంటి సీరియస్ సినిమా ఎవరికి కావాలి? వారాంతపు సెలవుల్ని ఎంజాయ్ చేసేవాళ్లకు ‘కంచె’ల గురించి ఆలోచించే తీరుబాటు ఉంటుందా? అందువల్ల ‘కంచె’ విషయంలో నాది అత్యాశ అవుతుందనే అనుకున్నా. కానీ.. సుమారు రూ. 20 కోట్లు ఖర్చుపెట్టి తీసిన ఈ సినిమాకు తొలి మూడు రోజుల్లోనే రూ. 8 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయని తెలిసి ఎంత ఆనందమేసిందో? మొత్తంగా ఆ సినిమాకు పెట్టిన డబ్బులు వస్తాయనే నమ్మకం కలుగుతోంది.
ఒకవేళ పోయినా అతి తక్కువ మొత్తంలోనే పోవచ్చు. ప్రేక్షకుల అభిరుచులు మారుతున్నాయనడానికి ఇది సంకేతమా? మూస ‘బ్రూస్‌లీ’కి పరాభవం ఎదురై, కొత్త ‘కంచె’కు ఊహించిన దానికంటే ఆదరణ లభించడం జనం మారుతున్నారనడానికి నిదర్శనమా? చెప్పలేం. కానీ ఒక ఆశ కలుగుతోంది. కొత్తకు మార్గాలు తెరుచుకుంటున్నాయని ఆశ కలుగుతోంది. ‘కంచె’ ఆడితే కొత్త భావాలు, కొత్త వస్తువులతో తెలుగు సినిమాలు వస్తాయనే ఆశ కలుగుతోంది. ‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుం’, ‘కంచె’ వంటి సినిమాలు తీసిన క్రిష్ వంటి దర్శకుల అవసరం ఇవాళ తెలుగు సినిమాకు ఎంతైనా ఉంది. ఫార్ములా కంచెలు దాటుకొని కొత్త ప్రయోగాలతో, కొత్త నిర్వచనాలతో తెలుగు సినిమాకు అర్థంచెప్పే క్రిష్‌కు తోడుగా అనేకమంది దర్శకులు రావాల్సిన అవసరం చాలా చాలా ఉంది.
– బుద్ధి యజ్ఞమూర్తి

- సారంగ వెబ్ వీక్లీ, 29 అక్టోబర్ 2015

No comments: