Thursday, November 12, 2015

BENGAL TIGER Fulfilling The Hopes?

'బెంగాల్ టైగర్'పై ఆశలెన్నో!

రెండు వరుస హిట్లు - 'బలుపు', 'పవర్'తో రవితేజ మళ్లీ రిథంలోకి వచ్చాడు. అయితే మునుపటి సినిమా 'కిక్ 2' డిజాస్టర్ కావడంతో పరిస్థితి మొదటికి వస్తుందేమోనని అతని అభిమానులు, శ్రేయోభిలాషులు కాస్త ఆందోళన చెందుతున్నారు. సురేందర్‌రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా 'కిక్' కంటే కూడా పెద్ద హిట్టవుతుందని రవితేజ చాలా గట్టిగా నమ్మాడు. అదే విషయాన్ని అంత నమ్మకంతోనూ అందరితోనూ చెప్పాడు. కానీ ఫలితం దానికి భిన్నంగా వచ్చింది. ఆ సినిమా నిర్మించిన నందమూరి కల్యాణ్‌రాంకు భారీగా నష్టం వాటిల్లింది. వాస్తవానికి ఆ సినిమా విడుదలకే అతను కష్టాలు ఎదుర్కొన్నాడు. ఖర్చుకు తగ్గట్లు బిజినెస్ కాకపోవడంతో ఎన్టీఆర్ చేసిన ఆర్థిక సాయంతో ఎట్లాగో విడుదల చేశాడు. ఆ సినిమాలో రవితేజ లుక్స్ చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. సన్నపడ్డం సరేకానీ, మొహంలో గ్రేస్‌లేకపోవడం కొట్టొచ్చినట్లు కనిపించింది. వయసు పెరుగుతున్న ఛాయలు ప్రస్ఫుటమయ్యాయి. ఈ నేపథ్యంలో త్వరలో 'బెంగాల్ టైగర్'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రవితేజ. సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నాయికగా తమన్నా చేస్తోంది. వయసు ముదురుతున్న రవితేజ పక్కన మిల్కీ బ్యూటీనా అని కొంతమంది పెదవి విరుస్తున్నారు. ఆ జంట తెరపై ఆకట్టుకుంటుందా?.. అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 'బలుపు' రాకముందు రవి కెరీర్‌లో ఎంత బ్యాడ్ ఫేజ్ నడిచిందీ తెలిసిందే. 'దొంగల ముఠా', 'వీర', 'నిప్పు', 'దరువు', 'దేవుడు చేసిన మనుషులు', 'సారొచ్చారు' సినిమాలతో అతని ఇమేజ్ క్రమంగా దిగజారుతూ వచ్చింది. 'కిక్ 2' ఫ్లాపవడం, అందులో అతను  కనిపించిన తీరుతో, ఇప్పుడందరి దృష్టీ 'బెంగాల్ టైగర్' మీదే ఉంది. పైగా పవన్ కల్యాణ్ కోసం తయారు చేసుకున్న స్క్రిప్టులో కొద్దిపాటి మార్పులు చేసుకొని సంపత్ తీస్తున్న సినిమా కావడం వల్ల, ఇది రవితేజకు ఏ మేరకు ఉపకరిస్తుందనే ఆసక్తి వ్యక్తమవుతోంది.

No comments: