Saturday, December 3, 2011

నిన్న హీరో, నేడు డైరెక్టర్!

'అలెక్స్', 'చంద్రహాస్' సినిమాల్లో హీరోగా నటించిన డాక్టర్ హరినాథ్ పొలిచర్ల గుర్తున్నాడా? 'ప్రేమాయనమః', 'హోప్' సినిమాల నిర్మాత కూడా అయిన ఆయన ఇప్పుడు డైరెక్టర్‌గా మారాడు. తనే హీరోగా నటిస్తూ 'రాజేంద్ర' అనే సినిమాని తొలిసారిగా డైరెక్ట్ చేస్తున్నాడు. అమెరికాలో డాక్టరుగా సంపాదించిన డబ్బుని ఇప్పుడు సినిమాల్లో పెడుతూ ప్రతి సినిమాకీ పోగొట్టుకుంటూ వస్తున్న ఆయన 'రాజేంద్ర'ని కూడా స్వీయ నిర్మాణంలోనే తీస్తున్నాడు. అంతేకాదు. ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లేని కూడా ఆయనే సమకూరుస్తున్నాడు. ఈ లిస్టు ఇంకా పూర్తికాలేదు. సినిమాలోని ఆరు పాటలు, నాలుగు బిట్ సాంగ్స్‌లో నాలుగింటిని ఆయనే రాశాడు. అంటే ఒకే సినిమాకి ఆయన ఆరు అవతారాలెత్తాడన్న మాట. చాలా నెలల క్రితమే ప్రారంభమైన ఈ సినిమాలో టైటిల్ పాత్ర పోషిస్తున్న హరినాథ్ సరసన హీరోయిన్లుగా గౌరీపండిట్, జయతి నటిస్తున్నారు. "రెండున్నరేళ్ల నుంచీ ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నాం. మాస్ అంశాలున్న కమర్షియల్ ఫిల్మ్. ఎవరూ పట్టించుకోని, చెత్తకుప్పలో పుట్టిన పిల్లల్ని ఓ బౌద్ధ బిక్షువు ఆదరిస్తాడు. ఆయన బోధనలకి అనుగుణంగా వారు 'తోటకూర బస్తీ' అనే ఆదర్శ గ్రామాన్ని నిర్మించుకుంటారు. ఆ బస్తీకి చెందిన ఏమీలేని రాజేంద్ర అనే యువకుడు సమాజంలో ఎలా ఉన్నత స్థాయికి ఎదిగాడన్నదే ఈ సినిమా" అని ఆయన చెప్పాడు. కోటి సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకి రాం లక్ష్మణ్ ఫైట్ మాస్టర్లుగా పనిచేస్తున్నారు.

No comments: