Monday, December 12, 2011

రాలిపోయిన మల్లెమాల

విధికి శిరసు వొంచి విధిలేని స్థితిలోన
పదునొకండు యేండ్ల ప్రాయమందె
చదువు మానివేసి సంసార భారమ్ము
మూపు నందు దాల్చి మోయ వలసె!

..అని చెప్పుకొన్నా ఇష్టంగా సంసార సాగరాన్ని ఈదుతూనే సాహితీ లోకానికీ, తెలుగు భాషకూ అపార సేవచేసిన సుందరరామిరెడ్డి ఇకలేరు. 11 ఏళ్ల వయసులోనే చదువు మానివేసానని చెప్పి.. ఎంతో చదువుకున్న వారికంటే గొప్పగా.. 'ఎంత కమ్మని భాష మనది.. ఎదను కదిపే భాష మనది' .. అంటూ కమ్మని తేటతెలుగు వినిపించిన సహజ కవి అస్తమించారు. 
ఐదువేలకు పైగా పాటలు, పద్యాలతో తుది శ్వాస వరకూ సాహితీ సేద్యం చేసిన చలన చిత్ర శ్రామికుడు శాశ్వతంగా విశ్రమించారు. తెలుగు చిత్రసీమకు ఆణిముత్యాల్లాంటి సినిమాల్నీ, పాటల్నీ అందించిన మేటి నిర్మాత.. 'మల్లె-మాల' సాహితీ సౌరభాలు ఇక గుబాళించవు. మల్లెమాలగా సుప్రసిద్ధుడైన ఎమ్మెస్‌రెడ్డి (87) ఆదివారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన అస్వస్థతతో ఉన్నారు. ఆయనకు భార్య సౌభాగ్యమ్మ, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు శ్యాంప్రసాద్‌రెడ్డి ఉన్నారు. ఎమ్మెస్ రెడ్డి భౌతిక కాయానికి సోమవారం ఉదయం పంజాగుట్ట శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. 
మల్లెమాల సుందరరామిరెడ్డి నెల్లూరు జిల్లా వెంకటగిరి తాలూకాలోని అలిమిలి అనే మారుమూల గ్రామంలో 1924 ఆగస్టు 15న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు రంగమ్మ, రామస్వామిరెడ్డి. ఆయనకు నలుగురు తమ్ముళ్లు, ఒక చెల్లెలు. ఎమ్మెస్ రెడ్డి ఇంటిపేరు.. 'మన్నెమాల'. అయితే అందులో అర్థం కనిపించక 'మల్లెమాల'గా మార్చుకున్నారు. మాస్టారు చెప్పిన పద్యాల్ని ఒకసారి విని వెంటనే వాటిని ఒక్క తప్పు పోకుండా పఠించి చిన్నతనంలోనే ఏకసంథాగ్రాహిగా పేరొందారు. 
అయితే.. ఆర్థిక కారణాల వల్ల ఆయన చదువు ఆగిపోవడంతో నాగలిపట్టి దుక్కి దున్నారు. ఆ తర్వాత వ్యవసాయం అర్ధంతరంగా ఆగిపోవడంతో ఉన్న ఊళ్లో నెలకు ఎనిమిది రూపాయల జీతం మీద మైకా డిపోలో ఉద్యోగిగా చేరాడు. కొన్ని రోజులకు జీతం వద్ద యజమానితో విభేదం తలెత్తి ఇంకెవరి వద్దా పనిచేయకూడదని నిర్ణయించుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేశారు. అలా సంపాదించిన డబ్బుతో.. అప్పుల కోసం తండ్రి అమ్ముకున్న భూముల్ని రెట్టింపు ధరకు తిరిగి కొని, తండ్రికి ఆనందం చేకూర్చారు. 
కొద్ది రోజులపాటు రేషన్ దుకాణాన్ని కూడా నిర్వహించిన ఆయన మైకా వ్యాపారంలో అడుగుపెట్టి అందులోనూ రాణించారు. ఆయన రాసిన 'మాకొద్దీ జమీందారి పెత్తనం. అది రద్దు కావాలి తప్పకుండ తక్షణం' అన్న గేయాన్ని విన్న ప్రకాశం పంతులు మల్లెమాలను 'సహజకవి'గా సంబోధించారు. ఆ నాటి నుంచీ సాహితీలోకం ఆయన్ను సహజకవి మల్లెమాలగా పిలుస్తోంది. 1951 అక్టోబర్‌లో సౌభాగ్యమ్మను జీవిత భాగస్వామిగా స్వీకరించిన ఆయన రాజకీయాల్లోనూ కొద్దికాలం ఉన్నారు. 
1957లో వెంకటగిరి పంచాయతీ ఎన్నికల్లో మెంబర్‌గా గెలిచి, అధ్యక్షుడిగా మూడు ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పట్నుంచీ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఏర్పాటుచేసే సమయంలో.. ఎమ్మెస్‌రెడ్డిని తమ పార్టీలో చేరమని ఆహ్వానించినా రాజకీయాలు తన తత్వానికి సరిపడవని చెప్పి సున్నితంగా తిరస్కరించారు. 
ఎగ్జిబిటర్‌గా సినీ రంగంలోకి అడుగుపెట్టి గూడూరులో సుందరమహల్ అనే థియేటర్‌ను నిర్మించి, 1963 డిసెంబర్‌లో ప్రారంభించారు. 1964లో వ్యాపార నిమిత్తం మద్రాసు వెళ్లినప్పుడు అనుకోకుండా 'కుమరిప్పెణ్' అనే తమిళ సినిమా చూశారు. ఆ సినిమా నచ్చి, రూ.60 వేలకు డబ్బింగ్ హక్కులు కొన్నారు. కౌముది ఆర్ట్ పిక్చర్స్‌ను స్థాపించి, 'కుమరిప్పెణ్'ను 'కన్నెపిల్ల'గా డబ్‌చేసి, 1966 డిసెంబర్ 26న తన బ్యానర్‌పై విడుదల చేశారు. ఆ తర్వాత 'కొంటెపిల్ల', 'కాలచక్రం' అనే డబ్బింగ్ చిత్రాలు విడుదల చేసిన ఆయన 1968లో శోభన్‌బాబు, వాణిశ్రీ జంటగా 'భార్య' చిత్రాన్ని నిర్మించి, స్ట్రయిట్ సినిమాల నిర్మాతగా మారారు. ఆ సినిమా బాగా ఆడింది. 
ఆ తర్వాత లాభనష్టాలకు అతీతంగా ఎమ్మెస్ రెడ్డి అనేక చిత్రాల్ని నిర్మించారు. వాటిలో.. 'శ్రీకృష్ణ విజయం', 'ఊరికి ఉపకారి', 'కోడెనాగు', 'ఏకలవ్య', 'పల్నాటి సింహం', తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, అమ్మోరు, జూనియర్ ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేస్తూ తీసిన 'రామాయణం' చిత్రాలు ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టాయి. 'అంకుశం'లో ముఖ్యమంత్రిగా నటించి, నటుడిగానూ తన సత్తా చాటారు. చిత్రసీమకు చెందిన అనేక సంఘాలకు ఎమ్మెస్‌రెడ్డి తన సేవల్ని అందించారు. తెలుగు సినిమాకు చేసిన సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్నారు. 
సామాజిక సేవ
ఎమ్మెస్ రెడ్డి యువకుడిగా ఉన్న కాలంలో బెంగాల్ కరువుకు 30 లక్షల మంది బలయ్యారు. దాని గురించి సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు రాసిన 'బుర్రకథ'కి ప్రభావితులై తంబుర చేతబట్టి ఆ బుర్రకథ చెప్పి రూ.10 వేలు సేకరించి కలకత్తాకు పంపారు. దివిసీమ ఉప్పెన కారణంగా వేలాది మరణించినప్పుడు.. 'కన్నీటి కెరటాలు' అనే డాక్యుమెంటరీని నిర్మించారు. 1993 సెప్టెంబర్‌లో మహారాష్ట్రలోని లాతూర్‌లో సంభవించిన భూకంపంలో అసువులు బాసిన వేలాది అభాగ్యుల మృతదేహాల్ని చూసి చలించిపోయిన ఆయన మరో తొమ్మిదిమంది కవులతో కలిసి 'బాష్పాంజలి' పేరుతో పుస్తకాన్ని ప్రచురించి, దాని ద్వారా రూ.లక్ష సేకరించి, భూకంప బాధితుల సహాయనిధికి పంపారు. 
అభినవ వాల్మీకి
రచయితగా ఎమ్మెస్‌రెడ్డి తెలుగు భాషకు చేసిన సేవ అపారం. 'మల్లెమాల రామాయణం', 'వృషభ పురాణం', 'నిత్య సత్యాలు', 'తేనెటీగలు', 'మంచు ముత్యాలు', 'అక్షర శిల్పాలు', 'ఎందరో మహానుభావులు', 'వాడని మల్లెలు' వంటి పద్య, గద్య పుస్తకాలు వెలువరించారు. వీటిలో 'మహిత వినయశీల మల్లెమాల' మకుటంతో రాసిన 'నిత్యసత్యాలు' ఆంధ్రజ్యోతి దినపత్రికలో నూరు వారాల పాటు ధారావాహికంగా వచ్చాయి. 
నాగభైరవ కోటేశ్వరరావు ఆయనకు 'అభినవ వేమన' బిరుదును ప్రదానం చేశారు. ఎమ్మెస్‌రెడ్డి రాసిన 'మల్లెమాల రామాయణం' చదివిన గుంటూరు శేషేంద్ర శర్మ 'మళ్లీ పుట్టాడు వాల్మీకి మల్లెమాలగా' అని ప్రశంసించారంటే కవిగా ఆయనది ఎంతటి ఉన్నత స్థాయో అర్థమవుతుంది. ఇటీవల ఆయన రాసిన స్వీయ చరిత్ర 'ఇదీ నా కథ' సినీ రంగంలో ఎంతగా కలకలం సృష్టించిందీ తెలిసిందే. 

-ఆంధ్రజ్యోతి డైలీ (మెయిన్), డిసెంబర్ 12, 2011

No comments: