Tuesday, December 20, 2011

బిగ్ స్టోరీ: ఆరు పదుల వెన్నెల సౌరభం మల్లీశ్వరి

మల్లీశ్వరి... తెలుగు సినీ జగత్తులో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ కళాఖండం. దర్శకుడిగా బి.ఎన్. రెడ్డినీ, గేయ రచయితగా కృష్ణశాస్త్రినీ, సంగీత దర్శకుడిగా సాలూరు రాజేశ్వరరావునీ చిరస్మరణీయం చేసిన అజరామర చిత్రం. అనేక అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై సెట్టింగులు, వస్త్రాలంకరణ పరంగా ప్రఖ్యాత 'మొఘల్-ఎ-ఆజమ్'కు ఏమాత్రం తీసిపోదని విమర్శకుల అభినందనల్ని అందుకున్న ఆణిముత్యం. అందుకే విడుదలై అరవై సంవత్సరాలైనా 'మల్లీశ్వరి' నిత్యనూతనం.
మిగతా దర్శకులతో పోలిస్తే బి.ఎన్. రెడ్డి భిన్నంగా కనిపిస్తారు. ఆయన తీసిన ప్రతి చిత్రమూ కళాఖండమన్న పేరు ఆర్జించింది. కేవలం పదకొండు చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచారు. అన్నిట్లోనూ 'మల్లీశ్వరి' పెద్ద ఖ్యాతిని తెచ్చుకుంది. భారతి మాసపత్రిక 1944 మే సంచికలో ప్రసిద్ధ రచయిత బుచ్చిబాబు రాసిన 'రాయల కరుణకృత్యం' అనే నాటిక ఆ తర్వాత రేడియోలో ప్రసారమైంది. దాన్ని విన్న బి.ఎన్. రెడ్డి దాని ఆధారంగా సినిమా తీయాలనుకున్నారు. అలాగే ఆ సమయంలోనే ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా ఆంగ్ల పత్రికలో దివాన్ షరార్ రాసిన 'ది ఎంపరర్ అండ్ ద స్లేవ్ గర్ల్' కథ కూడా ఆయనకు నచ్చింది. ఆ నాటికనూ, ఈ కథనూ మేళవించి ఆయన 'మల్లీశ్వరి' కథను తయారు చేయించారు. ఈ సినిమా కోసం బి.ఎన్. అహోరాత్రాలూ పడిన క్షోభ ఓ తపస్సు. అందుకే ఆయనతో పనిచేసిన వారంతా - ఈ మాట ఆయన 'రాయించు'కున్నారు, ఈ పాట ఆయన 'చేయించు'కున్నారు, 'పాడించు'కున్నారు - అనే అంటారు గౌరవ పురస్సరంగా.
కథాంశం
ఈ చిత్ర కథాంశాన్ని ఓసారి మననం చేసుకుందాం. హంపీ విజయనగర సామ్రాజ్యంలోని వీరాపుర గ్రామంలో బావామరదళ్లయిన నాగరాజు, మల్లీశ్వరికి ఒకరంటే ఒకరికి వల్లమాలిన ప్రేమ. ఆర్థికంగా కాస్త పైచేయి అయిన మల్లి తల్లి నాగమ్మకు వారి పెళ్లి ఇష్టంలేదు. దాంతో డబ్బు సంపాదించడానికి నగరానికి వెళ్తాడు నాగరాజు. ఒక వర్షపు రాత్రి సత్రంలో మల్లి నాట్యాన్ని మారువేషంలో తిలకించిన శ్రీకృష్ణదేవరాయలు ఆమె ఇంటికి పల్లకీ పంపించి రాణివాసానికి రప్పిస్తాడు. రాణివాసంలోని స్త్రీలను పరపురుషులెవరూ చూడరాదనేది నియమం. డబ్బు సంపాదించి వచ్చిన నాగరాజుకు మల్లి రాణివాసానికి వెళ్లిపోయిన సంగతి తెలిసి పిచ్చివాడైపోతాడు. ఆమె రూపాన్ని శిల్పాలుగా చెక్కుతాడు. నాగరాజు పనితనం చూసి ఆస్థాన శిల్పాచారి అతణ్ణి నందనోద్యానవనంలో శిల్పాల్ని చెక్కేందుకు నియమిస్తాడు. అనుకోకుండా ఒకరోజు తోటలో కలుసుకున్న నాగరాజు, మల్లి అక్కణ్ణించి పారిపోవాలనుకుంటారు. అదే సమయానికి ఉషా పరిణయం నృత్యగానంలో మల్లి పాల్గొనాల్సి వస్తుంది. సాహసంతో అంతఃపుర ప్రవేశం చేసిన నాగరాజును సైనికులు బంధించి ఖైదుచేస్తారు. విచారణ జరిపిన మహారాజు ప్రేమికులిద్దర్నీ ఒకటిచేసి, వారికి స్వేచ్ఛాజీవితం ప్రసాదిస్తాడు.
అందరూ అపురూప తారలే
నాగరాజు, మల్లీశ్వరి పాత్రల్లో ఎన్టీ రామారావు, భానుమతి అపూర్వ అభినయం ప్రదర్శించి ప్రేక్షక హృదయాల్లో చెరగని ముద్రవేశారు. వారి చిన్నప్పటి పాత్రలు వేసింది వెంకటరమణ, మల్లిక. ఈ వెంకటరమణ సుప్రసిద్ధ చిత్రకారుడు, దర్శకుడు బాపుకు స్వయాన బావమరిది. నిజానికి మల్లి పాత్రకు మొదట ఎవరైనా కొత్త తారను తీసుకుందామని రేవతి అనే అమ్మాయిని ఎంపిక చేసుకుని కూడా, బరువైన ఆ పాత్రకి ఆమె న్యాయం చేయలేదని భావించారు బి.ఎన్. అప్పటికే దక్షిణాదిలో అగ్రతారగా వెలుగొందుతున్న భానుమతి వైపు మొగ్గుచూపారు. ఆయన నమ్మకాన్ని భానుమతి ఈ స్థాయిలో నిలబెట్టారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదివరకు 'షావుకారు'లో జానకి తండ్రిగా వేసిన శ్రీవత్స ఇందులో శ్రీకృష్ణదేవరాయలు పాత్రలో గంభీరంగా నటించారు. మల్లి తండ్రి నారప్పగా దొరస్వామి, మల్లి మావయ్య హనుమంతప్పగా వంగర వెంకటసుబ్బయ్య, మల్లి తల్లి నాగమ్మగా ఋష్యేంద్రమణి, నాగరాజు తల్లి గోవిందమ్మగా వెంకుమాంబ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. రేడియోలో వచ్చిన 'రాయల కరుణకృత్యం' నాటికలో మల్లీశ్వరిగా నటించిన టి.జి. కమలాదేవి 'మల్లీశ్వరి'లో భానుమతి నెచ్చెలి జలజ పాత్ర చేయడం విశేషం. అప్పట్లో రేడియోలో బాగా పాపులర్ అయిన 'బాలానందం' కార్యక్రమాన్ని నిర్వహించే 'బాలన్నయ్య' న్యాపతి రాఘవరావు ఇందులో రాయల ఆస్థానకవి పాత్రలో నటించారు. అదివరకు వాహినీ సంస్థ తీసిన ప్రతి చిత్రంలోనూ నటించిన చిత్తూరు నాగయ్య ఇందులో కనిపించరు. ఈ సినిమా షూటింగయ్యాక ఇందులో తను నటించలేదనే బాధను నాగయ్య వ్యక్తం చేయడంతో బి.ఎన్. ఆయన్ను మరో రకంగా సంతృప్తిపరిచారు. సినిమా ఆరంభంలో వచ్చే నేపథ్య వ్యాఖ్యానం చెప్పింది నాగయ్యే.

పోటీపడ్డ సాహిత్యం, సంగీతం
తొలిసారిగా ఈ చిత్రానికి మాటలు, పాటలు రాశారు దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి. ఆయన సినీ జీవితంలో మాటలు రాసిన ఒకే ఒక చిత్రమిది. 'మల్లీశ్వరి' విడుదలైనప్పుడు ఆ చిత్రాన్ని ప్రజామిత్ర పత్రికలో సమీక్షిస్తూ "ఈ చిత్రంలో పాటలకు సాహిత్య గౌరవం లభించింది'' అని ప్రశంసించారు ప్రసిద్ధ రచయిత తాపీ ధర్మారావు. నిజమే. అప్పటిదాకా వచ్చిన సినిమా పాటలకంటే భిన్నంగా 'మల్లీశ్వరి' పాటల్ని సాహితీ సౌరభంతో ప్రబంధ శృంగార సారాన్ని సినీ సాహిత్యపరంగా మలిచిన విశిష్ట రచయిత దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి. ఇందులోని గీతాలు ప్రణయ భావపరంపరకు పట్టంగట్టిన నిత్యనూతన సౌరభాల్ని వెదజల్లిన మల్లెల మాలికలు. కృష్ణశాస్త్రి రాసిన పాటలకు సాలూరు రాజేశ్వరరావు బాణీలు కట్టారు. మ్యూజిక్ కంపోజింగ్‌కు ఆయన ఆరు నెలల సమయం తీసుకున్నారు. బాణీలు సాలూరువి అయితే, ఆర్కెస్ట్రా నిర్వహించింది అద్దేపల్లి రామారావు. అందుకే టైటిల్స్‌లో సంగీత దర్శకులుగా ఇద్దరి పేర్లూ ఉంటాయి. సాలూరు తన కెరీర్ మొత్తం మీద అపురూపంగా చెప్పుకున్న చిత్రాలు రెండే. ఒకటి 'చంద్రలేఖ', రెండు 'మల్లీశ్వరి'. హంపీ విజయనగర సామ్రాజ్య వైభవానికి అద్దంపట్టే ఈ చిత్రంలో అసలు కథానాయిక సంగీతమేనంటే అతిశయోక్తి కాదు. 'మనసున మల్లెల మాలలూగెనే', 'కోతీ బావకు పెళ్లంట', 'పరుగులు తీయాలి గిత్తలు ఉరకలు వేయాలి', 'ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు', 'నెల రాజా వెన్నెల రాజా', 'ఎందుకే నీకింత తొందర' వంటి పాటలన్నీ అపురూప రాగ హారాలే. కాఫీ రాగంలో భానుమతి ఆలపించిన 'పిలచిన బిగువటరా..' తెలుగు సినిమా పాటల్లో చిరస్థాయిని సాధించింది. మల్లీశ్వరిని రాణివాసానికి పంపే ఘట్టం తెలుగు సినిమా చరిత్రలోనే గుండెలు బరువెక్కించే అద్భుత కరుణ రసాత్మక భాష్పగంగా మణికర్ణికా ఘట్టం. దాన్ని అలా చిత్రించిన బి.ఎన్. రెడ్డినీ, ఆ ఘట్టంలో అభినయించిన దొరస్వామి, ఋష్యేంద్రమణి, భానుమతి, వెంకుమాంబనీ, ఆ సెట్‌ని రూపొందించిన ఎ.కె. శేఖర్‌నీ, అన్నింటికీ మించి హంపీ విజయనగర శిల్పవీణలు ఆ సన్నివేశాలకి నేపథ్యంగా మూర్ఛనలు చేస్తున్నాయా అనిపించే నేపథ్య సంగీతం, అందులో రాజేశ్వరరావు చూపిన ప్రతిభ, చరిత్ర జ్ఞానం తెలుగువారు మరవలేనివి. సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన ఆది ఎం. ఇరానీ పక్షవాతంతో కెమెరాని హ్యాండిల్ చేసే స్థితిలో లేకపోవడంతో ఆపరేటివ్ కెమెరామన్‌గా బి.ఎన్. సోదరుడు కొండారెడ్డి అద్భుత పనితీరు కనపర్చారు.
ఈ చిత్ర నిర్మాణానికి అయిన వ్యయం రూ. ఆరు లక్షలు. అప్పట్లో అది అత్యంత భారీ బడ్జెట్. 1951 డిసెంబర్ 20న తొలిసారి విడుదలై ఒక్క విజయవాడలో మాత్రమే వంద రోజులు ఆడిన ఈ సినిమా మూడేళ్ల తర్వాత రెండో విడుదలలో మరింత విజయం సాధించింది. ఆంధ్రదేశంలో కంటే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో 'మల్లీశ్వరి'కి ఎక్కువ ఆదరణ లభించింది. బీజింగ్‌లో జరిగిన తూర్పు ఆసియా చలనచిత్రోత్సవంలో ప్రదర్శితమై ప్రశంసలు పొందిన ఈ చిత్రం 1953 మార్చి 14న చైనీస్ సబ్ టైటిల్స్‌తో 15 ప్రింట్లతో చైనాలో విడుదలై ఆ ఘనత సాధించిన తొలి చిత్రంగా రికార్డు పుటల్లో నిలిచింది.
-ఆంధ్రజ్యోతి డైలీ, డిసెంబర్ 20, 2011

No comments: