Tuesday, December 20, 2011

చూడాల్సిన సినిమా: ద చిల్డ్రెన్ ఆఫ్ హెవెన్ (1997)

ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో అకాడమీ (ఆస్కార్) అవార్డుకు నామినేట్ అయిన తొలి ఇరానీ సినిమా 'ద చిల్డ్రెన్ ఆఫ్ హెవెన్'. ప్రఖ్యాత ఇరానీ దర్శకుడు మాజిద్ మాజిది రూపొందించిన ఈ సినిమాలో అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చూసి చలించని ప్రేక్షకులు ఉండరు. టెహ్రాన్‌లో నివసించే అలీ అనే చిన్న కుర్రాడు, అతని కుటుంబం చుట్టూ అల్లిన కథ ఈ సినిమా. కథ ప్రకారం అలీ అజాగ్రత్త వల్ల అతని చెల్లెలు జారా స్కూల్ షూస్ పోతాయి. పేదరికం కారణంగా ఈ సంగతి ఇంట్లో చెప్పడానికి భయపడతాడు అలీ. అతడి షూస్‌నే ఇద్దరూ మార్చి మార్చి వేసుకుంటుంటారు. దీనివల్ల అలీ స్కూలుకు చాలాసార్లు లేటుగా వెళ్లి ప్రిన్సిపాల్ చేత చివాట్లు తింటాడు. తన పింక్ షూస్ రోయా అనే మరో సహ విద్యార్థిని కాళ్లకు ఉండటం గమనిస్తుంది జారా. రోయా తండ్రి అంధుడనీ, చెత్త తీసుకెళ్లే వ్యక్తి అనీ తెలిసి ఆ షూస్‌ని రోయాకే వదిలేస్తారు అన్నాచెల్లెళ్లు. అయితే రోయా మంచి మార్కులు తెచ్చుకోవడంతో ఆమె తండ్రి ఆమెకి కొత్త పర్పుల్ షూస్ కొనిచ్చి జారా షూస్‌ని బయట పారేస్తాడు. 
తన చెల్లెలికి ఎలాగైనా కొత్త షూస్ కొనాలని తపించిన అలీ అనేక స్కూళ్ల విద్యార్థులు పాల్గొనే నడకపందెంలో పాల్గొంటాడు. అందులో మూడో స్థానం వచ్చిన వాళ్లకి జిం షూస్ బహుమానంగా వస్తాయని తెలిసి తాను మూడో స్థానంలో రావాలనుకుంటాడు. కానీ అనుకోకుండా ఫస్ట్ ప్లేస్‌లో నిలుస్తాడు. మరి అతను చెల్లెలికి కొత్త షూస్ కొనిచ్చాడా? లేదా? అనేది చివరి సన్నివేశం.
ఈ కథతో బాలల ప్రపంచం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చిత్రీకరించాడు దర్శకుడు మాజిద్ మాజిది. అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమాభిమానాలు ఎంతగా పెనవేసుకుని ఉంటాయో, ఒకరి బాధని మరొకరు ఎలా పంచుకుంటారో, చెల్లెలి కళ్లల్లో సంతోషం చూడ్డానికి పిల్లవాడైన ఓ అన్న ఎంతగా తపిస్తాడో ఈ సినిమా కళ్లముందు ఆవిష్కరిస్తుంది. ఈ సినిమా చూస్తుంటే మనం బాల్యంలోకి వెళ్లకుండా ఉండలేం. అలీ, జారా పాత్రలతో సహానుభూతి చెందకుండా ఉండలేం. అంత బాగా ఆ పాత్రల్ని పోషించారు అమీర్ ఫరూఖ్ హషేమియన్, బహరే సిద్దిఖి.
1999 నుంచి మూడేళ్ల కాలంలో 'ద చిల్డ్రెన్ ఆఫ్ హెవెన్' అనేక ఐరోపా, దక్షిణమెరికా, ఆసియా చిత్రోత్సవాల్లో పాల్గొని ఆవార్డులతో పాటు విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసల్ని పొందింది.

No comments: