Thursday, November 11, 2010

సినిమా: ప్రమాదంలో వరుణ్ సందేశ్ కెరీర్!

'హ్యాపీడేస్'తో ఘనంగా తెరంగేట్రం చేసి, 'కొత్త బంగారులోకం'తో తెలుగు చిత్రసీమలో బంగారు సోపానం వేసుకున్నట్లు కనిపించిన బక్క కుర్రాడు వరుణ్ సందేశ్ కెరీర్ అప్పుడే ప్రమాదంలో పడిపోయింది. తొలి రెండు సినిమాల తర్వాత అతను చేసిన నాలుగు సినిమాలు బాక్సాఫీసు వద్ద ఫట్‌మనడమే దీనికి కారణం. ఆ నాలుగు.. 'ఎవరైనా ఎపుడైనా', 'కుర్రాడు', 'మరో చరిత్ర', 'హ్యాపీ హ్యాపీగా'.
వీటిలో 'ఎవరైనా ఎపుడైనా' సినిమాని నిర్మించింది ప్రతిష్టాత్మక సంస్థ ఏవీఎం ప్రొడక్షన్స్. 'కుర్రాడు' తీసింది హిట్ సినిమాల నిర్మాణ సంస్థగా పేరొందిన ఆనంది ఆర్ట్ క్రియేషన్స్. 'మరో చరిత్ర'ని నిర్మించింది తాను పట్టిందల్లా బంగారమనే పేరు తెచ్చుకున్న దిల్ రాజు. వీటిలో 'మరో చరిత్ర' సినిమా మరీ దారుణంగా ఫ్లాపయ్యింది. 'హ్యాపీ హ్యాపీగా' సినిమాతో కచ్చితంగా హిట్టు కొడతానని ఎంతో కాన్ఫిడెన్సుతో వరుణ్ చెప్పిన మాటలు నిజంకాలేదు. ఆ సినిమాని కూడా ప్రేక్షకులు మరో ఆలోచన లేకుండా తిప్పికొట్టారు.
'హ్యాపీడేస్'తో యువత ఆరాధ్య తారగా మారిన అతని కెరీరు అంతలోనే ఇలా ప్రమాదంలో పడటం చిత్రమే. కొండంత ఆశతో చదువుని కూడా పణంగా పెట్టి అమెరికానుంచి వచ్చేసిన అతనికి తోడుగా అతని తండ్రి సైతం మంచి ఉద్యోగాన్ని వదులుకుని కొడుకు కోసం హైదరాబాద్ వచ్చేశాడు. వరుణ్ చేసే సినిమాల విషయంలో ఆయనదే ప్రముఖ పాత్ర. కానీ తన కొడుకు కెరీరుకి ఎలాంటి సినిమాలు పనికొస్తాయనే విషయంలో ఆయన జడ్జిమెంట్ సరిగా ఉండటం లేదనీ, అందుకే వరుణ్ క్రేజ్ వేగంగా మసకబారుతున్నదనీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈనెల 12న వస్తున్న 'ఏమైంది ఈవేళ' సినిమా మీదే అతని భవితవ్యం ఆధారపడి ఉంది. కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ నాయికగా నటించిన ఈ సినిమా ద్వారా సంపత్ నంది దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా ఆడితేనే వరుణ్ మరికొంత కాలమైనా హీరోగా అవకాశాలు పొందుతాడు. లేదంటే.. చెప్పేదేముంది!

No comments: