Thursday, November 4, 2010

ఫోకస్: 2010 ముగింపైనా సంతోషాన్నిస్తుందా? (మొదటి భాగం)

విజయాల కోసం మొహం వాచిపోతున్న తెలుగు చిత్ర పరిశ్రమ ఈ ఏడాది చివరినైనా సంతృప్తికరంగా ముగిస్తుందా? అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. పేలవమైన ఆరంభాన్నిచ్చిన 2010లో ఇప్పటివరకు 'సింహా', 'డార్లింగ్', 'మర్యాదరామన్న', 'ఏమాయ చేసావె', 'వేదం', 'బిందాస్' వంటి అతికొద్ది సినిమాలు మాత్రమే ప్రేక్షకాదరణ పొందాయి. తాజాగా పరిటాల రవి జీవితంపై రాంగోపాల్ వర్మ రూపొందించిన 'రక్త చరిత్ర' విడుదలైన ఐదు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా ఐదు కోట్ల రూపాయలకు మించి వసూలుచేసి, హిట్టుగా నిలిచింది. రజనీకాంత్ 'రోబో' సూపర్ డూపర్ హిట్టయినా అది మన సినిమా కాదు. ఈ పరిస్థితుల్లో నవంబర్, డిసెంబర్ నెలల్లో రానున్న కొన్ని సినిమాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. వీటిలో సగమైనా విజయాలను సాధిస్తే చిత్రసీమ కాస్తంతయినా సంతోషాన్ని పొందుతుంది. ఆ ఆసక్తికర సినిమాలేమిటో చర్చించడమే ఈ వ్యాసం ముఖ్యోద్దేశం.
'ఆరెంజ్' మీదే అందరి చూపు
సందేహం అవసరం లేదు. ఈ రెండు నెలల్లో రాబోతోన్న సినిమాలన్నింటిలోకీ అత్యధిక శాతం ప్రేక్షకుల్లో ఎక్కువ ఆసక్తిని రేకెత్తిస్తోన్న చిత్రం 'ఆరెంజ్'. సంచలనాల 'మగధీర' తర్వాత రాంచరణ్ హీరోగా నటించిన సినిమా కావడంతో సహజంగానే ఈ సినిమా విషయంలో అటు ట్రేడ్ వర్గాల్లో, ఇటు సాధారణ ప్రేక్షకుల్లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన విశేషాల్లో ముఖ్యమైనవి.. దీన్ని భాస్కర్ డైరెక్ట్ చేయడం, నాయికగా జెనీలియా నటించడం, తొలిసారి రాంచరణ్ లవర్ బాయ్ గా కనిపించబోవడం. పైగా ఈ చిత్రాన్ని నిర్మించింది చిరంజీవి సొంత బేనర్ అయిన అంజనా ప్రొడక్షన్స్. ఈ సినిమా హిట్టయితే భాస్కర్ కి హ్యాట్రిక్ లభించినట్లవుతుంది. అతని మునుపటి సినిమాలు రెండు.. 'బొమ్మరిల్లు', 'పరుగు' విజయాల్ని సాధించాయి. అయితే లవ్ స్టోరీతో తయారైన 'ఆరెంజ్'కి నిర్మాణ వ్యయం అదుపుతప్పి పోయిందని వినిపిస్తోంది. గ్రాఫిక్స్ ప్రధానంగా భారీతనంతో నిర్మాణమైన 'మగధీర' చిత్రానికే 38 కోట్ల రూపాయలు ఖర్చయితే, సాఫ్ట్ లవ్ స్టోరీతో తీసిన 'ఆరెంజ్'కి దాదాపు 35 కోట్ల రూపాయలు ఖర్చయ్యిందని సమాచారం. మలేషియా, ఆస్ట్రేలియాల్లో ఎక్కువ భాగం షూటింగ్ జరగడం, పలు సన్నివేశాల్ని రీ షూట్ చేయడం వ్యయం అదుపు తప్పడానికి కారణమని తెలుస్తోంది. హారిస్ జయరాజ్ సంగీతం సమకూర్చగా ఇటీవలే విడుదలైన ఈ సినిమా పాటలు ప్రజాదరణ పొందాయి. నవంబర్ ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ చిత్రం ద్వారా షాజన్ పదంసీ అనే మోడల్ సెకండ్ హీరోయినుగా పరిచయమవుతోంది.
'గగనం'లో 'రగడ'
డిసెంబర్ మాసమంటే సీనియర్ స్టార్ హీరో నాగార్జునకి ఎంతో ఇష్టం. ఎందుకంటే ఆ నెలలో విడుదలైన ఆయన సినిమాలు అధిక శాతం విజయాన్నే చవిచూశాయి. 'మన్మథుడు', 'మాస్', 'కింగ్' వంటి సినిమాలు వాటిలో కొన్ని. ఆ సెంటిమెంట్ తోటే ఆయన సినిమా 'రగడ' డిసెంబర్ ద్వితీయార్థంలో విడుదలయ్యేందుకు సన్నద్ధమవుతోంది. మంచు మనోజ్ కి 'బిందాస్' రూపంలో తొలి విజయాన్ని అందించిన వీరు పోట్ల ఈ చిత్రానికి దర్శకుడు. 'సూపర్', 'డాన్' సినిమాల తర్వాత నాగార్జున సరసన ముచ్చటగా మూడోసారి అనుష్క నాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో రెండో నాయిక పాత్రని ప్రియమణి చేస్తోంది. కామాక్షి కళామూవీస్ పతాకంపై డి. శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రంలో నాగార్జున ఇటు వినోదం, అటు యాక్షన్ మేళవించిన పాత్రని చేస్తున్నారు. మునుపటి సినిమా 'కేడి' అట్టర్ ఫ్లాపవడంతో ఈ సినిమాని ఆయన ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అయితే దీనికంటే ముందుగా ఆయన నటించిన మరో సినిమా నవంబరులోనే విడుదల కాబోతోంది. ఆ చిత్రం 'గగనం'. చెప్పాలంటే తెలుగులో ఇదో ప్రయోగాత్మక చిత్రం. 1999లో జరిగిన కాందహార్ హైజాక్ సంఘటన ఆధారంగా తయారుచేసిన కథతో ఈ సినిమాని డైరెక్టర్ రాధామోహన్ రూపొందించాడు. ఎయిర్ కమాండరుగా నాగార్జున నటించిన ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్రలు చేశారు. పాటలు లేని ఈ సినిమాలో నాగార్జున సరసన హీరోయిన్ కూడా కనిపించదు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రాబోతోంది. (ఇంకావుంది)                                                  

No comments: