Thursday, November 11, 2010

సినిమా: మసకబారుతున్న అనుష్క క్రేజ్

'విక్రమార్కుడు', 'అస్త్రం', 'డాన్', 'శౌర్యం', 'చింతకాయల రవి' వంటి సినిమాలతో టాప్ హీరోయిన్ రేంజిని సాధించిన యోగా టీచర్ అనుష్క 'అరుంధతి'తో సూపర్ హీరోయిన్ ఇమేజ్‌ని పొందిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమాతో వచ్చిన పేరుని నిలబెట్టుకోవడంలో ఆమె తప్పటడుగులు వేస్తూ వస్తోంది. ఫలితంగా ఆమెకి వచ్చిన అమితమైన క్రేజ్ క్రమంగా మసకబారుతోంది.
'అరుంధతి' తర్వాత ఆమెకి విమర్శకుల్లో పేరు తెచ్చిన సినిమా క్రిష్ డైరెక్ట్ చేసిన 'వేదం'. ఈ సినిమాలో అమలాపురం సరోజ అనే సెక్స్ వర్కర్ క్యారెక్టర్లో ఆమె బాగా రాణించింది. అందుకే అదే సినిమా తమిళ వెర్షన్ 'వానం'లోనూ ఆమె అదే పాత్రని చేజిక్కించుకుంది. అయితే ఈ మధ్యలో 'బిల్లా', 'పంచాక్షరి', 'ఖలేజా' సినిమాలు ఆమెకి ఏమాత్రం ప్రయోజనం చేకూర్చలేక పోయాయి.
'బిల్లా'లో ప్రభాస్ సరసన కేవలం గ్లామర్ డాల్‌గా మిగిలిన ఆమె 'అరుంధతి' ప్రభావంలో పడి చేసిన 'పంచాక్షరి' సినిమా ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది. 'ఖలేజా'లో అయితే మహేశ్ సరసన ఆమె నప్పలేదనే చెడ్డపేరు వచ్చింది. ఇలా వరుసగా ఆమె చేసిన పాత్రలు ప్రేక్షకుల్ని ఆకర్షించక పోతుండటం ప్రమాద ఘంటికలు మోగుతున్నాయనడానికి సంకేతమే.
రానున్న కొద్ది రోజుల్లో ఆమె సినిమాలు రెండు విడుదలవుతున్నాయి. ఒకటి నాగార్జునకి జోడీగా చేస్తోన్న 'రగడ' కాగా, మరొకటి వెంకటేశ్ ప్రధాన పాత్ర చేస్తోన్న 'నాగవల్లి'. ఈ రెండో దానిలో ఆమెదే టైటిల్ రోల్. ఈ సినిమాలు హిట్టయితే ఆమె ఇమేజ్ మరికొంత కాలం సేఫ్‌గా ఉంటుంది. లేదంటే చాలామంది తారల మల్లే ఆమె కూడా డబ్బుల కోసమే ఏదో ఓ సినిమా చేయాల్సిన స్థితిలో పడిపోతుంది.  

No comments: