Sunday, November 14, 2010

సినిమా: 'రెడీ' తర్వాత రాం ఎక్కడ?

'రెడీ' తర్వాత రాంకి ఇంతదాకా హిట్టులేదు. ఇప్పటివరకు ఆరు సినిమాలు చేసిన అతడికి దక్కింది రెండు హిట్లే. వాటిలో ఒకటి తొలి సినిమా 'దేవదాసు' అయితే, ఇంకోటి శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన 'రెడీ'. ఈ రెంటి మధ్యలో వచ్చిన 'జగడం'తో పాటు 'రెడీ' తర్వాత వచ్చిన 'మస్కా', 'గణేష్', 'రామరామ కృష్ణకృష్ణ' సినిమాలు ఫ్లాపయ్యాయి. ఈ ఫ్లాపయిన సినిమాలన్నీ పేరుపొందిన వాళ్లు తీసినవే కావడం గమనించాలి.
'జగడం'ని డైరెక్ట్ చేసింది 'ఆర్య' ఫేం సుకుమార్. 'మస్కా'ని నిర్మింది ఎమ్మెస్ రాజు అయితే, డైరెక్త్ చేసింది బి. గోపాల్. 'గణేష్' ప్రొడ్యూసర్ స్రవంతి రవికిశోర్ కాగా, 'రామరామ కృష్ణకృష్ణ' నిర్మాత దిల్ రాజు. ఈ క్రేజీ ప్రాజెక్టులన్నీ బోల్తా కొట్టడంతో 'రెడీ' టైంలో ఆకాశంలోకి చూసిన రాం నేలమీదికి దిగొచ్చాడు. సినీ రంగంలో జయాపజయాలకి ఎవరూ అతీతులు కాదనే సంగతి అనుభవంలోకి వచ్చాక అతని ప్రవర్తనలో కాస్త మార్పు వచ్చింది. 'రెడీ' మత్తులో ఉన్నంత కాలం ఎదుటివాళ్లతో అతడు ఎలా ప్రవర్తించిందీ చాలామందికి అనుభవమే. ఇప్పుడు అతడు కాస్త పరిణతితో వ్యవహరిస్తున్నాడని చెప్పుకుంటున్నారు. సబ్జెక్టుల విషయంలో అలాంటి పరిణతితో వ్యవహరిస్తే మళ్లీ అతడు హిట్ల బాటలోకి వస్తాడనేది చాలామంది అభిప్రాయం.
ప్రస్తుతం అతడు 'కందిరీగ' అనే సినిమా చేస్తున్నాడు. బెల్లంకొండ సురేశ్ నిర్మిస్తోన్న ఈ సినిమా ద్వారా సినిమాటోగ్రాఫర్ సంతోష్ శ్రీనివాస్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. అతను 'ఖతర్నాక్', 'రెయిన్‌బో', 'నీ నవ్వే చాలు' వంటి ఫ్లాప్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు. 'కందిరీగ'ని అతడెలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. ఇందులో హన్సిక హీరోయిన్. 'మస్కా' తర్వాత రాం, హన్సిక కలిసి చేస్తున్న సినిమా ఇది. 'కందిరీగ'తోనైనా రాం కెరీర్ గాడిన పడుతుందా?

No comments: