Wednesday, December 2, 2015

Synopsis of the movie Varalakshmi Vratam (1961)

'వరలక్ష్మీ వ్రతం' (1961) చిత్ర కథాంశం


అనగనగా ఓక రాజు. ఆ రాజుకు ఇద్దరు భార్యలు. సహజంగానే పెద్ద భార్య ఉత్తమురాలు. రెండో భార్య చూపులకు మొద్దుగా ఉన్నప్పటికీ రాజుగారికి మాత్రం ముద్దుగానే ఉంటుంది. అంతటి మనిషి అక్కకంటే ముందుగానే కొడుకును కని తన ప్రతిభను చాటుకుంది. ఆ పుత్రరత్నమే కాబోయే రాజు అని ఉవ్విళ్లూరుతోంది. అది జరిగితే కథేముంది? పెద్దరాణి ఉన్నన్నాళ్లూ ఊరుకొని లేటు వయసులో గర్భం దాల్చింది. ఆమె కడుపులో పెరుగుతున్న పిండం చిన్నరాణి ఆశలకు గండం అయింది. ఆమెకు జోస్యం తెలుసో లేక స్కానింగ్ కళ్లు ఉన్నాయో కానీ, పెద్దరాణికి కొడుకే పుడ్తాడని తమ్ముడితో గట్టిగా అరిచి మరీ చెప్పింది. అందుకని ఆమెను అంతం చేయమని తమ్ముడికి నూరిపోసింది. ఒక మాంత్రికుడి సహాయంతో చేసిన ఆ ప్రయత్నం విఫలమైంది. ఆ మాంత్రికుడికీ, అతని ఇద్దరు శిష్యులకూ బోడిగుళ్లు దక్కాయి. ఆపైన గాడిదపై ఊరేగే భాగ్యమూ లభించింది.
పెద్దరాణి కొడుకుని కనేసింది. ఆ పసికందును తమ్ముడిచేత హత్యచేయించడానికి ప్రయత్నించింది చిన్నరాణి. కాని ముసలి మంత్రి తెలివితేటల వల్ల రాకుమారుడు తప్పించుకొని ఒక స్వామిభక్తి పరాయణుడి ఇంట పెరుగుతాడు. అతనికి బదులు ఆ భక్తుడి కొడుకు హత్యకు గురవుతాడు. ఆ పిల్లల తల్లులు ఎంతటి సత్తెకాలపు వాళ్లంటే పిల్లలు మారిపోయినా వాళ్లకు తెలీదు.
పనిలో పనిగా రాజుగారిని ఫినిష్ చేసి లైన్ క్లియర్ చేస్తాడు. ఆపైన రాణీని, ఎక్కడ తనకు ద్రోహం చేస్తుందోనని తన అక్కని జైలులో పెట్టేస్తాడు. తానే రాజ్యం చేపడతాడు.
సినిమా కథలో విధి బలీయంగా ఉంటుంది కాబట్టి అతని కూతురు మణిమంజరి, అజ్ఞాత రాకుమారుడు తొలిచూపులోనే ప్రేమించేసుకుంటారు. ప్రేమకు ఫలం దక్కాలంటే ఎన్నో కష్టాలు పడాలి. అందుకు తగ్గట్లే ఆ కష్టాలన్నీ దుష్టుల రూపంలో వచ్చి ఉక్కిరిబిక్కిరి చేసేసి నాయికను వరలక్ష్మీదేవి భక్తురాలిగా చేస్తాయి. ఈలోగా రాజకుమారిని దుష్టులు చెరబట్టబోగా, ఒక యక్షిణి రాకుమారుని చెరబట్టి, తన లోకానికి తీసుకుపోయి షికార్లకు వెళ్లేప్పుడల్లా కాగితం పువ్వుగా మారుస్తుంటుంది.
గుండు కొట్టించుకున్న ఒక మాంత్రికుడు మాయలూ మంత్రాలతో హంగామా చేస్తుంటాడు. ఏదైతేనేం, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ జరిగి విడిపోయిన దంపతులను ఏకంచేసి తన మహత్యం నిరూపించుకుంటుంది వరలక్ష్మి.

తారాగణం: కాంతారావు, కృష్ణకుమారి, రాజనాల, సత్యనారాయణ, బాలకృష్ణ (అంజి), ముక్కామల, మిక్కిలినేని, స్వర్ణలత, మీనాకుమారి, జగ్గారావు, అల్లు రామలింగయ్య, కాకరాల, ఆదోని లక్ష్మి
సంగీతం: రాజన్ - నాగేంద్ర
నిర్మాత, దర్శకుడు: బి. విఠలాచార్య
బేనర్: విఠల్ ప్రొడక్షన్స్

No comments: