Saturday, December 19, 2015

Synopsis of the movie KALASI UNTE KALADU SUKHAM (1961)

'కలసివుంటే కలదు సుఖం' (1961) చిత్ర కథాంశం


రామలక్ష్మణులకు ప్రతిరూపాలు అన్నదమ్ములైన పట్టాభిరామయ్య, సుందరరామయ్య. పట్టాభిరామయ్య భార్య సౌభాగ్యం. కానీ ఆమె తన పాలిట దౌర్భాగ్యమని పబ్లిగ్గాన్నే పిలుస్తుంటాడు. అంత గయ్యాళి సౌభాగ్యం. సుందరరామయ్య భార్య రమణమ్మ హృదయం వెన్నకన్నా మెత్తన. ఆమె ఎంత మంచిదంటే సంతలో కనిపించిన అనాథ యువతి రాధను తీసుకువచ్చి, తర్వాత తన పెద్ద కోడల్ని చేసుకుంటుంది.
రమణమ్మకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు కిష్టయ్యకు ఏడో యేట ఎలక్ట్రిక్ షాక్ తగిలి ఒక కాలు, ఒక చేయి వంకరతిరిగిపోతాయి. చిన్నవాడు రఘు పట్నంలో పాఠాలతో పాటు ప్రేమపాఠాలూ వల్లె వేస్తుంటాడు. అమ్మలాగే కిష్టయ్య హృదయం చాలా మంచిది. పదిమందికి పనికివచ్చే మంచి తనకు చెడు అయినా అతనికి సంతోషమే. రఘుకూడా మంచివాడే కానీ ఉడుకురక్తంతో మంచీ చెడూ తెలుసుకోలేని స్థితిలో కొట్టుకులాడుతుంటాడు.
ఇంట్లో తాను తప్ప అందరూ మంచివాళ్లయిపోవడంతో, ఆఖరికి కట్టుకున్న మొగుడు కూడా ఎగస్పార్టీ అవడంతో సౌభాగ్యానికి దిక్కు తోచదు. కానీ రోజులన్నీ ఒక్కలాగే ఉండవు కదా. ఆమెకీ రోజులొచ్చాయి. ఆమె మేనల్లుడు రంగూన్ రాజా, అతని చెల్లెలు జానకి వాళ్లింట్లో దిగారు. సిద్ధాంతి జోస్యం చెబుతూ 'శని ఇంట్లో అడుగు పెడ్తున్నాడయ్యా' అని అంటుంటే, 'పెట్టడమేం ఖర్మ.. పెట్టేశాడు' అని నిట్టూరుస్తాడు పట్టాభిరామయ్య. రంగూన్ రాజా దీపావళి టపాకాయలు టెన్ థౌశండ్ వాలా పేల్చినట్లు అదేపనిగా వాగేస్తుంటాడు. అతని నాలుకతో పాటు బుద్ధీ పదునైనదే. ఆ వాడి బుర్రలోంచి వేడివేడి ఐడియాలు వస్తుంటాయి. గిరీశానికి ఒక ఆకు ఎక్కువే.
వాడు ఆ ఇంటికి వస్తూనే ఆటబొమ్మలు తెచ్చాడు. వాటిని మించి మేనత్తను ఆడించేశాడు. పాచిక వేసి, విషం నూరి, ఆమె గొంతులో తియ్యగా పోశాడు. సౌభాగ్యం చిన్న బుర్ర పెద్ద పెద్ద ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరైపోయింది. చిందులు తొక్కింది. భర్తతో వేరు పడాల్సిందేనంది. ఆయన గోల పెట్టాడు. బతిమిలాడాడు. చివరకు అందరిముందే ఏడ్చాడు. అయినా సౌభాగ్యం తగ్గలేదు. మరింత బిగుసుకుపోయింది. ఫలితం.. అనందమ్ములు విడిపోయారు. రెండు వాటాల మధ్య గోడలేచింది.
మనుషులు వేరయ్యారు. కానీ మనసులు వేరవలేదు. రఘు మినహా సుందరరామయ్య కుంటుంబం పడరాని అవమానాలు పడింది. కృష్ణయ్య మరీనూ. అన్నింటినీ చాలా ఓర్పుతో భరించారు. ఈలోగా సెలవలకు ఇంటికి వచ్చిన రఘు, ఆ వెంటనే జానకిని ప్రేమించేసి ఆమెను అందుకోడానికి రాజాకు దగ్గరయ్యాడు. అటేపే వెళ్లిపోయాడు. తను కూడా యధాశక్తి అన్ననీ, అమ్మానాన్నల్నీ అవమానించి, అది చాలదన్నట్లుగా తండ్రి చావు బతుకుల్లో ఉంటే, అన్నకంటే ముందుగా జానకిని పెళ్లి చేసుకున్నాడు.
కృష్ణయ్య మనిషి అవుడైనా, మనసు చాలా మంచిదని గ్రహించిన రాధ అతను అడక్కుండానే తన మనసును అతనికిచ్చేసింది. సమయం చూసుకొని ఆ సంగతి తనే బయటపెట్టి, అతనితో మూడు ముళ్లూ వేయించుకుంటుంది. తొడికోడళ్లిద్దరూ పోటీలుపడి చెరో మగపిల్లాణ్ణీ కంటారు. ఆలస్యంగా పెళ్లయినా జానకి కంటే ముందే కంటుంది రాధ. ఓర్వలేనివాళ్లు అవిటివాడికి అవిటి పిల్లాడే పుడ్తాడని దీవించినా, మంచి పిల్లాడే పుడతాడు. హైదరాబాద్‌లో ఉద్యోగం రావడంతో అక్కడకు భార్యా పిల్లల్తో వెళ్లిపోతాడు రఘు.
ఈలోగా సౌభాగ్యం దగ్గరున్న భాగ్యాన్ని తన పరం చేసుకొని హైదరాబాద్ మకాం మారుస్తాడు రాజా. అక్కడ గతంలో బందర్ బజార్లో బజ్జీలు అమ్మే మంజువాణి కూతురు అనార్కలితో కలిసి నాట్యాలూ, సర్కసులూ నడుపుతుంటాడు. రఘుచేత ఆఫీసు డబ్బు ఇరవై వేలు కాజేయించి అనార్కలికి అర్పణం చేస్తాడు. అదే సమయంలో భర్త కాలూ చెయ్యీ బాగు చేయించడానికి రాధ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పిస్తుంది. సర్కస్‌లో ఏనుగు చేత ఫీట్లు చేయించడానికని ఆమె బిడ్డను ఎత్తుకుపోతాడు రాజా. అయితే రఘు బుద్ధి తెచ్చుకొని రాజాని నాలుగు వాయిస్తాడు. దాంతో మంజువాణి బృందం డబ్బుతో బొంబాయ్ పారిపోతుంది. ముసలాళ్లంతా పల్లె నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. కిష్టయ్య ఆస్పత్రి నుంచి పారిపోయి సర్కస్ డేరాలో కరంట్ షాక్ తిని బాగైపోయి ఏనుగు నుంచి పిల్లవాణ్ణి రక్షిస్తాడు.
పారిపోయిన మంజువాణినీ, అనార్కలినీ, పారిపోబోతున్న రాజానీ పోలీసులు పట్టుకుంటారు. కిష్టయ్య మంచితనంతో రాజా బయటపడతాడు. అత్తా చెల్లెళ్లతో పాటు తనూ బుద్ధి తెచ్చుకుంటాడు. ఇంట్లో కట్టిన అడ్డుగోడని నలుగురూ కలిసి పగులకొట్టి 'కలసి ఉంటే కలదు సుఖం' అని నిరూపిస్తారు.

తారాగణం:  ఎన్టీ రామారావు, సావిత్రి, ఎస్వీ రంగారావు, హరనాథ్, రేలంగి, సూర్యకాంతం, హేమలత, గిరిజ, పెరుమాళ్లు
సంగీతం: మాస్టర్ వేణు
నిర్మాతలు: సీవీఆర్ ప్రసాద్, వై. రామకృష్ణప్రసాద్
దర్శకత్వం: తాపీ చాణక్య
బేనర్: శ్రీ సారథీ స్టూడియోస్
విడుదల తేదీ: 8 సెప్టెంబర్

No comments: