Tuesday, December 15, 2015

Poetry: Where is my village?

ఏదీ నా పల్లె?

దేశ సౌభాగ్యానికే మూలమనే 
నా పల్లె అందమేమైపోయింది?

తొలికోడి కూతతో తెలతెలవారుతుంటే
పొలాల్లో రైతులు కనిపించరేమి?
పడుచుపిల్లలు కడవలు చేతబట్టి
పాకాల బావిని చేరే దృశ్యమేదీ?

బర్రెల మందలు గొర్రెల మందలు
మేతకు పోవడం కనిపించదేమి?
ఆవుల అంబాలు  మేకల మేమేలు
మేళవించెడి పాట వినపడదేమి?

జలజలా పారే సెలయేటి నీళ్లలో
ఆడేపాడే పిల్లలేరీ?
లోతు నూతుల్లో ఏతాము తోడే
రైతు కుర్రాళ్ల రీతి ఏదీ?

మర్రె ఊడల్ని పట్టుకొని విర్రవీగుతూ
ఉయ్యాలలూగే పిల్లలెక్కడ?
బర్రెల వీపుపై గర్వంతో ఎక్కి
కుర్రకారు చేసే స్వారి కనిపించదేమి?

కంచాలు చేసి గెంతుతూ గోళీలాట ఆడే
చిట్టితండ్రుల సంబరమేదీ?
కొమ్మ కొమ్మలు దాటి కోతికొమ్మచ్చులాడే
వేడుక కనిపించదేమి?

కొండ కిందకుపోయి నిండుగా
కట్టెలని కొట్టే సన్నివేశమెక్కడ?
పొన్నచెట్టుపైన పొందుగా పాడే
చిన్నిగొల్ల మురళి వినిపించదేమి?

No comments: