Sunday, December 20, 2015

History of Telugu People - 1

మన చరిత్ర - 1

వర్తకం పేరుతో మన దేశానికి వచ్చిన ఈస్టిండియా కంపెనీ క్రమేణా తన రాజ్య విస్తరణకు పూనుకుంది. స్వదేశీ సంస్థానాధీశుల రక్షణ పేరుతో, తమ సైన్యాల్ని ఉంచి, వాటికయ్యే ఖర్చునంతట్నీ ఆయా ప్రాంతాల రాజుల నుంచి రాబట్టే పద్ధతిని అమల్లోకి తెచ్చారు. ఈ విధానంతో స్వదేశీ రాజులు బ్రిటీష్‌వాళ్లకు కీలుబొమ్మలుగా మారారు. ఆఖరుకు భారతదేశం మొత్తంమీద బ్రిటీష్ సామ్రాజ్యవాదులకు సార్వభౌమాధికారం లభించింది. సైన్య సహకార పద్ధతిని అంగీకరించిన నిజాం రాజు, కోస్తాంధ్ర జిల్లాల్ని బ్రిటీష్ ప్రతినిథి క్లైవ్‌కు 1766లో జాగీరుగా ఇచ్చాడు. ఇదేరకంగా 1788లో గుంటూరు జిల్లాను ఇచ్చేశాడు. బ్రిటీష్ సైన్య పోషణ ఖర్చుల నిమిత్తం బళ్లారి, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్ని 1800లో బ్రిటీష్ వాళ్లకు దఖలుపరిచాడు. ఇక నెల్లూరు జిల్లాను ఆర్కాట్ నవాబు నుండి 1801లో బ్రిటీషర్లు కాజేశారు. అప్పట్లో వీటిని దత్త మండలాలని పిలుస్తుండేవాళ్లు. రాయలేలిన సీమ కాబట్టి తర్వాత కాలంలో అవి రాయలసీమగా వాడుకలోకి వచ్చాయి.
ఇలా స్వాధీనం చేసుకున్న తెలుగు ప్రాంతాన్ని మద్రాసు రాజధానిలో కలిపి తమ పరిపాలన కిందకు తెచ్చుకున్నారు బ్రిటీష్‌వాళ్లు. హైదరాబాద్, దక్కన్ ప్రాంతం స్వదేశీ సంస్థానంగా ఉండిపోయింది. దీన్నిబట్టి శతాబ్దాలుగా ఒకటిగా కలిసివున్న తెలుగుజాతిని విచ్ఛిన్నం చేసింది నిజానికి అసఫ్‌జాహీ నవాబులేనని మరచిపోకూడదు. వాళ్లు ఇక్కడ తెలుగు భాషను, సంస్కృతిని అణచివేశారు. వాక్ స్వతంత్రం వంటి పౌరహక్కుల్ని కాలరాశారు. నిజాం రాజ్య పాలనలో ఇతర భాషల్ని తొక్కిపెట్టి ఉర్దూకు పట్టంగట్టారు. మతతత్వాన్ని రేకెత్తించి, ప్రజలపై నిరంకుశ పాలన సాగించారు.

No comments: