Thursday, December 3, 2015

Need for Artistic Vision in Film Makers

కూసింత కళాత్మక దృష్టి కావాలి!

నేటి నిర్మాతలు, దర్శకుల్లో ఎక్కువమందికి సినిమా అంటే కేవలం వ్యాపారమే. అందులో కళకు చోటులేదనేది వాళ్ల నిశ్చితాభిప్రాయం. ఒకళ్లతో ఒకళ్లు పోటీపడుతూ ఏడాదికి 150 సినిమాల దాకా తీస్తున్నారు. వాటిలో విజయాన్ని సాధించే సినిమాలు పది, పన్నెండుకంటే మించవు. అవైనా ఎందుకు ఆడుతున్నాయని పరిశీలిస్తే కథా కథనాల విషయంలో అవి మిగతా వాటికంటే మెరుగ్గా ఉండటం, తెలిసో తెలియకో వాటిల్లో ఎంతోకొంత కళాదృష్టి కనిపించడం.
ఉదాహరణకు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధించిన 'బాహుబలి', 'శ్రీమంతుడు', 'భలే భలే మగాడివోయ్' చిత్రాల్ని తీసుకుందాం. 'బాహుబలి' సాంఘిక సినిమా కాదు. అది జానపదం. అందులోనిది బలమైన కథ కాదు. కథనం, కంటికి 'అబ్బో' అనిపించే విజువల్స్, భారీ యుద్ధ సన్నివేశాలు, ఉద్వేగభరితమైన సన్నివేశాల కారణంగా అది జనానికి నచ్చేసింది.
'శ్రీమంతుడు' సినిమా కథ గొప్పదేమీ కాదు. కానీ అందులోని అంశం ప్రజలకు బాగా పట్టేసింది. రాబందుల వంటి భూ బకాసురులు పీక్కుతింటున్న తన సొంత ఊరిని దత్తత తీసుకొని, దాన్ని బాగు చేసుకున్న యువకుడి విశాల హృదయాన్ని జనం మెచ్చారు. అందులో కథానాయకుడు కోట్లకు వారసుడైనా, కార్లలో తిరగడానికంటే, సైకిల్‌పై ప్రయాణానికే ఇష్టపడతాడు. అందుకే ఆ సినిమా వచ్చాక తెలుగు రాష్ట్రాల్లో సైకిళ్ల అమ్మకాలు పెరిగాయి. సంపన్నవంతులు వెనుకబడిన గ్రామాల్ని దత్తత తీసుకోవడం మొదలుపెట్టారు. అంతటి ప్రభావాన్ని కలిగించిన సినిమా ఇటీవలి కాలంలో మరొకటి లేదు. ఇక 'భలే భలే మగాడివోయ్' సినిమా విషయానికొస్తే, అది తక్కువ బడ్జెట్‌తో తయారైనా, ప్రజల మనసుల్ని భారీ స్థాయిలో గెలుచుకుంది. చిన్నతనం నుండే తీవ్ర మతిమరుపు రుగ్మతను కలిగి ఉండే ఓ యువకుడు ప్రేమలోపడి, తన మతిమరుపు కారణంగా ఎలాంటి సమస్యల్ని ఎదుర్కొని, చివరకు ఎలా అందరి హృదయాల్ని దోచుకున్నాడనే అంశాన్ని దర్శకుడు ఆసక్తికరంగా మలిచాడు. కథానాయకుడి అమాయకత్వం, తన మతిమరుపును కప్పిపుచ్చుకోడానికి ఒకదాని తర్వాత ఒకటిగా ఆడే అబద్ధాలు ప్రేక్షకుల్లో సానుభూతినే కలిగించాయి కానీ, విముఖతని కలిగించలేదు. ఈ రకంగా ఈ మూడు సినిమాల్లో ఎంతోకొంత కళాత్మకత కనిపిస్తుంది.
అలాగే శేఖర్ కమ్ముల, క్రిష్ వంటి దర్శకులు కేవలం వ్యాపార దృష్టితోనే కాకుండా, వాస్తవిక దృష్టితో సినిమాలు తీస్తున్నారు. శేఖర్ కమ్ముల 'ఆనంద్', 'గోదావరి', 'హ్యాపీడేస్', 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాల్లో జీవితంలోని భిన్న కోణాలు మనకు దర్శనమిస్తాయి. కాకపోతే వాటిలో జీవన సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు. ఆయనకు కాస్త భిన్నంగా క్రిష్ దర్శనమిస్తాడు. జీవితంలోని ఆనంద ఘడియల వెనుకే విషాదం కూడా ఉంటుందని ఆయన సినిమాలు చూపిస్తాయి. 'గమ్యం', 'వేదం', 'కంచె' సినిమాల్లో అటు ఆనందమూ, ఇటు విషాదమూ రెండూ కనిపించడం మనం చూడవచ్చు. 'కృష్ణం వందే జగద్గురుం'లో విషాదం బదులు తెలుగువాళ్లకు ఒకప్పుడు ఎంతో ప్రీతిపాత్రమైన రంగస్థల నాటకాన్ని బతికించుకోవాలనే తపన, మైనింగ్ మాఫియాపై పోరాడాల్సిన ఆవశ్యకత మనకు కనిపిస్తాయి. అంటే రెగ్యులర్ సినిమాల్లో కనిపించే నాలుగు ఫైట్లు, ఆరు పాటలు, అనవసర భావోద్రేక సన్నివేశాలు, కథకు సంబంధంలేని రోత కామెడీ ట్రాకుల ఫార్ములా వీళ్ల సినిమాల్లో కనిపించని సంగతి గ్రహించాలి.
ఇదివరకు దర్శకులు సెల్ఫ్ సెన్సారింగ్ పాటించి ప్రేమ సన్నివేశాలను హద్దుల్లో ఉంచేవాళ్లు. వాటివల్ల ప్రజలకు అవి ఎలాంటి హానీ కలుగచేయని రీతిలో ఉండేవి. అందరి ఆదరణ పొందేవి. కానీ రాను రాను విదేశీ మోజుకు, కృత్రిమ నాగరికతకూ అలవాటుపడిన దర్శకులు ప్రణయ ఘట్టాల్ని విచ్చలవిడిగా తీయడం మొదలుపెట్టారు. టీనేజ్ లవ్‌స్టోరీల పేరుతో, కాలేజీ ప్రేమకథల పేరుతో బూతు చిత్రాలు తీస్తూ వస్తున్నారు. తెలిసీ తెలియని వయసులో ఉండే, ఉడుకు రక్తం ఉరకలు వేసే పిల్లల్లో అవి కలిగించే మానసిక వికారాలు అన్నీ ఇన్నీ కావు. ఇలాంటి సినిమాల్ని పిల్లలతో కలిసి చూడాలంటే పెద్దలు సిగ్గుతో చచ్చిపోవాల్సిందే. కాలేజీలు ఎగ్గొట్టి ఇలాంటి సినిమాలు చూస్తూ అవే నిజమైన ప్రేమలుగా భ్రమించి, అమ్మాయిలను ప్రేమ పేరుతో వేధించే సంఘటనలు ఇవాళ సమాజంలో నిత్యకృత్యమైపోయాయి. 'నిర్భయ' వంటి సంఘటనలు పెచ్చుమీరిపోవడానికి బూతు సినిమాల ప్రభావమే ప్రధాన కారణం. ఇలాంటి సినిమాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ, మంచి సినిమాల సంఖ్య తరుగుతూ రావడానికి కారణం ఎవరో దర్శక నిర్మాతలతో పాటు ప్రేక్షకులూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇవాళ మంచి సినిమా తీస్తే దాన్ని ఆస్వాదించే హృదయాలు ఎన్ని? నిర్మాతలు ఇలాంటి మూస కమర్షియల్ సినిమాల్నే ఎక్కువగా నిర్మించడానికి కారణం.. వాళ్లకు డబ్బే ప్రధానం. ఎలాంటి సన్నివేశం తర్వాత ఎలాంటి సన్నివేశం వస్తే జనం ఈలలు వేస్తారు, లాభాలు ఎలా వస్తాయి, ఏ హీరోతో తీస్తే జనం ఎక్కువగా వస్తారు, ఏ డైరెక్టర్‌కు స్టార్ వాల్యూ బాగా ఉంది.. అనే బాక్సాఫీస్ సూత్రాలకు లోబడిపోయి తమ సినిమాల్ని కేవలం వ్యాపారం కోసమే తీస్తున్నారు.
వర్తమానం కంటే గతమెంతో ఘనం అనేది పాత చింతకాయ పచ్చడి లాంటి నానుడి కావచ్చేమో గానీ, తెలుగు సినిమాకు సంబంధించి అది అక్షరాలా నిజం. గతంలోని సినిమాల్లో నటీనటుల నటన ఇప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోయి ఉంది. ఇప్పటి ఏ నటుడి అభినయం గురించి గొప్పగా మనం చెప్పుకోగలం? కారణం మునుపటి తారలు నటనను ఓ కళగా భావించి, పాత్రను, దాని స్వభావాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకొని ఆ పాత్రల్ని సొంతం చేసుకొనేవాళ్లు. ఇప్పటి ఏ నటుడు కానీ, నటి కానీ నటనను కళగా భావించి పాత్ర పోషణ చేస్తున్నారు? ఓ సినిమా చేస్తే ఎంత పారితోషికం అందుతుందనే ధ్యాస తప్పితే, నటనపై అంకితభావం చూపించేవాళ్లు కనిపిస్తారా? ఇవాళ హీరో కావాలంటే నటనకంటే డాన్సులు బాగా వచ్చుండాలి. ఫలానా హీరో బాగా నటించాడని చెప్పుకోవడం కంటే బాగా డాన్సులు, ఫైట్లు చేశాడని చెప్పుకోవడమే గొప్పయింది.
ఇక దర్శకుడి విషయానికి వస్తే పూర్వం తన శక్తివంచన లేకుండా చిత్రాన్ని ఆద్యంతం నవరసాలతో కళాత్మకంగా రూపొందించేవాడు. దర్శకునికి తగినట్లు నటీనటులు అభినయాన్ని ప్రదర్శించి పూర్తి సహకారం అందించేవాళ్లు. అంటే సమష్టి కృషివల్ల సినిమా విజయవంతమై నిర్మాతకు ఇంకో సినిమా తియ్యడానికి ముందడుగు వేసే ధైర్యం వచ్చేది. కానీ ఇవాళ్ల దర్శకునికే దర్శకులుగా మారిపోయారు తారలు. దాంతో దర్శకుడు మనసుకి ఎంత కష్టంగా ఉన్నా రాజీపడి సినిమాని పూర్తిచేశాననిపిస్తున్నాడు.
స్వర్ణయుగ సినిమాల విజయాల పరంపరకూ, ఇప్పటి సినిమాల విజయానికీ తేడాని పోలిస్తే ఎంతో కనిపిస్తుంది. అప్పుడు తయారయ్యే సినిమాల సంఖ్య తక్కువ. అవి కళాత్మకంగా ఉండేవి. ప్రజాదరణ అమితం. ఇప్పుడు సినిమాల సంఖ్య చాలా ఎక్కువ. అంతా వ్యాపార దృష్టే. కళాదృష్టి అసలు లేదు. అందువల్ల ఇప్పటి సినిమాలు అభిరుచి కలిగిన సినీ ప్రియుల్ని ఆకర్షించలేకపోతున్నాయి. కళకూ, ప్రజాదరణకూ సంఘర్షణ రావాల్సిన అవసరం లేదు. సమర్థుడైన దర్శకుడు కళను కించపరచకుండానే ప్రజారంజకమైన చిత్రాలు తీయగలడని అలనాటి కేవీరెడ్డి నుంచి, నిన్నటి కె. విశ్వనాథ్ నుంచి, ఇవాళ్టి క్రిష్, క్రాంతిమాధవ్ దాకా నిరూపిస్తూనే ఉన్నారు. మనకు జాతీయంగా పేరు వచ్చేది ఇలాంటి దర్శకులవల్లే. అందువల్ల మన నిర్మాతలు, దర్శకులు సినిమాలో వ్యాపారానికే తప్ప కళకు  చోటు లేదన్న భ్రమలోనే ఉంటూ కళను విస్మరించకుండా కళాఖండాలను, దృశ్యకావాలనూ తీయవచ్చని గుర్తించాలి. దానికి కావాల్సిందల్లా కూసింత ఆత్మవిశ్వాసం.

No comments: