Sunday, July 11, 2010

Women's Special: No fatigue, go a head!


"సాయంత్రం ఆరయ్యేసరికల్లా ఇంట్లో ఉంటాను" చెప్పి వెళ్లిపోయాడు సుమన్. ఒంగోలులో అతడికి ఆరోజు అత్యవసర మీటింగ్ ఉంది. భర్త వెళ్లాక వాహిని ఇంట్లోకి నడిచింది. పిల్లలిద్దరూ ఏదో వస్తువు కోసం గొడవ పడుతున్నారు. వాళ్లిద్దర్నీ విడదీసి నచ్చచెప్పేసరికి నీరసం వచ్చినట్లు ఫీలయ్యింది వాహిని. ఇద్దరికీ స్నానాలు చేయించి టిఫిన్ పెట్టి, స్కూలుకి పంపించినాక కాస్త తెరపిచ్చినట్లయ్యింది. వంట చేద్దామని చూస్తే ఇంట్లో కూరగాయలు అయిపోయాయి. ఎక్కడలేని నిస్సత్తువ ఆవహించింది వాహినిని. వాటి కోసం బజారుకి వెళ్లాల్సిందే. అసలే అలసటగా ఉన్నట్లు అనిపిస్తున్న ఆమెకి మళ్లీ ఈ పని గోరుచుట్టుపై రోకలి పోటు టైపులా అనిపించింది. 'మగవాళ్లకి ఆఫీసు పనితప్ప మరోటి ఉంటుందని ఎప్పుడూ అనుకోరు. ఆడవాళ్లు చెబితే తప్ప తెలుసుకోరు' అని విసుక్కున్నది. చివరికి బజారుకి బయలుదేరింది వాహిని.
ఆమెలాగానే చాలామంది ఆడవాళ్లు అలసటను ఫీలవుతూ ఉంటారు. బయటకు చూస్తే చిన్న విషయాలుగా కనిపించే వాటికే వారు నీరసపడిపోతూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇలా నిస్సత్తువుగా ఫీలవకుండా ఏం చేయాలి? ఇప్పటి మహిళల్ని వేధిస్తున్న ప్రశ్నలివి. నాకు తెలిసినంతలో వీటికి జవాబివ్వడానికి ప్రయత్నిస్తా. నేను చెప్పిన వాటిని అంగీకరించాలని కానీ, తు.చ. తప్పకుండా పాటించాలని కానీ చెప్పను. ఎవరికి వాళ్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందే. కనీసం ఆ ఆలోచన కలిగించడానికే ఈ రాతలు.
ఓసారి వాహినినే అడిగా. "ఏమిటంత నీరసంగా కనిపిస్తున్నావు?" అని. "నిద్ర చాలడం లేదు" అని జవాబు.
నిజమే. రోజంతా అనేక పనులతో సతమతమయ్యే మనకి రాత్రి పూట ప్రశాంతంగా నిద్ర ఎలా పడ్తుంది? అయితే ఓ విషయం గుర్తించాలి. ఏడెనిమిది గంటలు పడుకుంటేనే మంచి నిద్ర అయినట్లు, ఏదో నాలుగు గంటలు పడుకుంటే మంచి నిద్ర కానట్టు అనుకోకూడదు. రోజంతా చలాకీగా ఉండేందుకు నాలుగు గంటల నిద్ర సరిపోతుంది. అయితే ఆ నాలుగు గంటలూ ప్రశాంతంగా నిద్రపోగలగాలి. అంతే! ఈ ప్రశాంతత రమ్మంటే వస్తుందా? ప్రయత్నిస్తే సాధ్యం కానిదేదీ లేదు అని లోకోక్తి. పెద్ద పెద్ద విషయాలకే అది వర్తించినప్పుడు ఈ స్వల్ప విషయానికి మాత్రం వర్తించదా!
సాధారణంగా చికాకు, ఆందోళన పడటం అనేవి అలసటను కలుగజేస్తాయని మానసిక శాస్త్రవేత్తలు చెబుతుంటారు. అన్ని పనులనీ తేలికగా తీసుకుంటూ చిరునవ్వుతో చేసుకుపోయేవారికి నీరసం ఆమడ దూరాన ఉంటుంది. ఇందుకు మంచి ఉదాహరణ నా ఫ్రెండ్ శాంత. ఎప్పుడు చూసినా చలాకీగా, నవ్వుతూ ఉంటుంది. "పగలు పనంతా అయ్యాక భోజనం చేసి ఓ అరగంట నడుం వాలిస్తే నీరసం, గీరసం మొత్తం ఎగిరిపోతుంది" అని చెప్తుంది. నా వరకు అయితే అది నిజమే అంటా. పగలు ఇలా అరగంట పడుకోవడం రాత్రివేళ మూడు గంటల నిద్రతో సమానం అని పరిశోధకుల ఉవాచ. అదీగాక నిస్సత్తువ అనేది మానసిక స్థితిని కూడా తెలియజేస్తుంది. సరిగ్గా ఆలోచించగలిగేవాళ్లని ఎట్లాంటి రుగ్మతలూ బాధించవని ఒకప్పుడు 'బ్రిటీష్ జర్నల్ ఆఫ్ సైకాలజీ' పత్రికకి ఎడిటరుగా పనిచేసిన సర్ ఫ్రెడరిక్ బార్టులెట్ పేర్కొనాడు.
* * *
అతి స్వల్ప విషయాలే అయినప్పటికీ కొన్నింటికి ఎక్కువగా కలత చెందటం మన ఆడవాళ్లకి సాధారణమైపోయింది. వాటిని సక్రమంగా అంచనా వేసి తొలగించుకోడానికి ప్రయత్నిస్తే సమస్య అంటూ ఏమీ మిగలదు. ప్రతిదానికీ పిల్లలమీదనో, మొగుడి మీదనో విసుక్కుంటూ వారిని సాదిస్తూ ఉంటే తప్పనిసరిగా మిమ్మల్ని 'అలసట' అనే భూతం పట్టుకుంటుంది. వాస్తవంలో తీవ్ర సమస్యలు ఎదురైనప్పుడు ఎంతగా నిస్సత్తువ ఆవహిస్తుందో, అదేవిధంగా చిన్న విషయాలకు కూడా అంతే స్థాయిలో అలసిపోవడం ఇలాంటి వారికి జరుగుతూ వుంటుంది.
హాయిగా, ప్రశాంతంగా వుండాలని మీకు అనిపిస్తూనే ఉంటుంది. కానీ అదే రకంగా సాధ్యపడుతుందో మీకు తోచదు. మీకు పూర్తి ప్రశాంతత కావాలని అనిపించినప్పుడే మీ శరీరానికీ, మనసుకీ కూడా పని కల్పించాలి. విసుగ్గా ఉన్నప్పుడు సినిమాకి వెళ్లాలనుకుంటారు మీరు. కానీ సినిమాకి బదులు ఏదైనా మంచి వాతావరణం ఉండే ప్రాంతానికి షికారుగా వెళ్తే ప్రయోజనం ఎక్కువ. మీకు ఇష్టమైన సంగీతాన్ని వింటూ కూడా ఈరకం ప్రయోజనాన్నే పొందవచ్చు. వీటికంటే మీ పెరట్లోనే గార్డెనింగ్ చేపట్టడం మరింత ఉత్తమ పని.
పగలంతా ఏదో పనితో సతమతమయి సాయంత్రానికి మీకు అలసటగా అనిపించవచ్చు. ఆ సమయంలో ఏ నిర్ణయమూ తీసుకోకుండా మరుసటి రోజు ఉదయానికి ఆ పనిని వాయిదా వేసుకోండి. ఎందుకంటే అలసటలో వున్నప్పుఢు చేయడానికి యత్నించిన పనిలో వైఫల్యం చెందడానికి అవకాశం ఎక్కువ. దీనివలన మీలో చికాకు మరింత పెరుగుతుందే తప్ప ఉపయోగం ఉండదు. ఇక భర్త మీదా, పిల్లల మీదా మీ ప్రతాపం చూపించి వారిని హడలగొట్టేసే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల గట్టిగా నిశ్చయించుకోకుండా ఏ పనినీ మీరు చేపట్టవద్దు.

No comments: