Tuesday, July 20, 2010

Geetha Krishna 'Coffe Bar'


డైరెక్టర్ గీతాకృష్ణ అనగానే మనకు 'కోకిల', 'కీచురాళ్లు', 'సంకీర్తన' వంటి చిత్రాలు జ్ఞాపకం వస్తాయి. అలాంటి చక్కని చిత్రాలు తీసిన ఆయన చాలా కాలం నుంచీ యాడ్ ఫిలిమ్స్ తీస్తూ ఇన్నాళ్టికి 'కాఫీబార్' అనే సినిమా రూపొందించాడు. బ్లూ ఫాక్స్ సినిమా బ్యానర్‌పై ఆయనే స్వయంగా ఈ సినిమా నిర్మించాడు. 'ఐతే', 'సై', 'అనుకోకుండా ఒకరోజు' చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న శశాంక్ హీరోగా నటించిన ఈ చిత్రంలో బెంగాలీ అమ్మాయి బియాంక దేశాయ్ నాయిక. వాస్తవానికి ఆమె నటించిన తొలి సినిమా ఇదే అయినా విడుదలైన తొలి చిత్రం ఇటీవలే వచ్చిన 'చలాకీ'. బాలీవుడ్ నటుడు, తెలుగులో ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించిన అతుల్ కులకర్ణి ఓ ప్రధాన పాత్ర చేసిన ఈ చిత్రంలో బేబి శివాని కథకు కీలకమైన పాత్రని చేసింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. "విభిన్న మనస్తత్వాలు, ఆలోచనలు కలిగిన యువతీ యువకుల మధ్య ప్రధానంగా ఈ చిత్ర కథ నడుస్తుంది. కాఫీబార్‌లో కూర్చున్న కొంతమంది యువకుల ఆలోచనలే టేకాఫ్‌గా ఈ సినిమా జరుగుతుంది. ఇందులో మైండ్‌గేం ప్రధానం. విశ్వజనీన అంశంతో సినిమా ఆద్యంతం సరదాగా, ఆసక్తికరంగా ఉంటుంది. టెర్రరిజం కూడా ఇందులో అంతర్లీన అంశం" అని దర్శకుడు గీతాకృష్ణ చెప్పారు. ఈ సినిమా చిత్రీకరణకు ఆయన అధునాతన 'రెడ్‌వన్' కెమెరాని ఉపయోగించారు. 'కళ్లు' దర్శకుడిగా ఖ్యాతినార్జించిన ఎం.వి. రఘు ఈ సినిమాకి చాయాగ్రాహకుడు. షూటింగ్ పూర్తయి చాలా రోజులైనా విడుదలలో జాప్యమైన 'కాఫీబార్' త్వరలోనే ప్రేక్షకుల అందుబాటులోకి రానున్నది.

No comments: