Saturday, July 31, 2010

'Dubbing' Stroke To Tollywood


తెలుగు సినిమాకి ప్రధాన శత్రువులేమిటి? వీడియో పైరసీ, డబ్బింగ్ సినిమాలు. అవును. తామరతంపరగా వస్తున్న అనువాద చిత్రాలు నేడు స్ట్రయిట్ తెలుగు సినిమాల పాలిట విలన్లు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు దాదాపు పారలల్ గా అనువాద చిత్ర పరిశ్రమ 'వర్థిల్లుతోంది'. 2009లో విడుదలైన స్ట్రయిట్ సినిమాలకు కాస్త అటుఇటుగా అంతే సంఖ్యలో డబ్బింగ్ ఫిలిమ్స్ రిలీజయ్యాయి. దానికి రిజల్ట్.. స్ట్రయిట్ సినిమాల కలెక్షన్లకు భారీ గండి. ఈ ఏడాది పరిస్థితిలోనూ పెద్ద మార్పు లేదు. కాకపోతే పోయిన సంవత్సరం స్థాయిలో డబ్బింగ్ సినిమాలు విడుదల కాకపోవచ్చు. ఆ రకంగా చూస్తే ఈ ఏడు నేరుగా తెలుగులో నిర్మాణమై, విడుదలైన సినిమాలు కూడా తక్కువయ్యాయి. ఫిల్మ్ ఛాంబర్ అందించిన సమాచారం ప్రకారం జనవరి నుంచి జూన్ వరకు ఆరు నెలల్లో రిలీజైన స్ట్రయిట్ సినిమాలు 58 అయితే, డబ్బింగ్ సినిమాలు సరిగ్గా 50. వాటిలో బాగా కలెక్షన్లు రాబట్టిన సినిమాలు స్ట్రయిట్ సినిమాల మాదిరే బాగా తక్కువ. 'యుగానికి ఒక్కడు', 'ది ఉల్ఫ్ మ్యాన్', 'మదనుడు.. మృగమైతే', 'ఐరన్ మ్యాన్-2', 'ఆవారా', 'ప్రిన్స్ ఆఫ్ పర్షియా', 'యముడు', 'ద కరాటే కిడ్' వంటివి కొద్దో గొప్పో కలెక్షన్లు రాబట్టాయి. మిగతావేవీ ఆడలేదు. వాటిలో 'విలన్', 'క్లాష్ ఆఫ్ ద టైటాన్స్', 'ఆవహం', 'సూపర్ కౌబాయ్', 'కైట్స్', 'ప్రిన్స్' వంటి డిజాస్టర్స్ వున్నాయి.
తక్కువ కష్టం, నష్టం
అసలు నిర్మాతలు స్ట్రయిట్ సినిమాల కంటే డబ్బింగ్ సినిమాల మీదే ఎందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు? సమాధానం సులువైనదే. స్ట్రయిట్ సినిమాల ప్రొడక్షన్లో సవాలక్ష కష్టాలు వుంటాయి. ఇండస్ట్రీలోని 24 క్రాఫ్టులతో పని వుంటుంది. రోజువారీ షూటింగంటే ఒక యుద్ధం చేసినంత పని. ఎన్ని రోజులు షూటింగుంటే అన్ని రోజులూ నిర్మాతలకి ఊపిరి సలపనంత పని. ఏదైనా అవాంతరంతో ఒక్క రోజు షూటింగ్ కాన్సిలయినా, ఆ రోజు కాల్షీట్లు ఇచ్చిన యాక్టర్ల కాంబినేషన్లో తిరిగి షూటింగ్ చేయడానికి నానా పాట్లూ పడాలి. టైమ్ వేస్ట్, మనీ లాస్. 24 క్రాఫ్టులవారినీ సమన్వయంతో పనిచేయించుకోడం అంత ఈజీ కాదు. ఇన్ని బాధలు పడి సినిమా తీసినా ఆ సినిమా హిట్టవుతుందనే గ్యారంటీ ఏ కోశానా వుండదు. పెట్టిన డబ్బు వస్తుందనే నమ్మకం కనిపించదు. ఆ బాధలన్నీ ఎందుకనే ఉద్దేశంతోటే చాలామంది డబ్బింగ్ సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ సినిమాలకైతే కొత్తగా షూటింగ్ చేయాల్సిన పనిలేదు. 24 క్రాఫ్టుల్లో రెండు, మూడు క్రాఫ్టులు మినహా మిగతా వారితో పనివుండదు. డబ్బింగ్ స్పెషలిస్టులైన రచయితలతో మాటలు, పాటలు రాయించి, డబ్బింగ్ కళాకారులతో వాయిస్ ఇప్పిస్తే సరిపోతుంది. అవసరమైతే ఎడిటింగ్ మార్పులు వుంటాయి. అంతకుమించి మిగతా డిపార్టుమెంట్ల వారితో అవసరం వుండదు. ల్యాబులో డైలాగ్స్, సాంగ్స్ మిక్సింగ్ చేయిస్తే చాలు.. సినిమా రెడీ! అందుకే అతి తక్కువ కష్టం, నష్టం వుండే డబ్బింగ్ సినిమాలకి నిర్మాతలు ఓటు వేయడం.
పెద్ద సంస్థలదీ అదే బాట
మనదేశంలో బాలీవుడ్ తర్వాత అతిపెద్ద సినీ పరిశ్రమ టాలీవుడ్డే. అందువల్లే ఇక్కడి డబ్బు కొల్లగొట్టుకు పోవడానికి తమిళ, హిందీ, ఇంగ్లీషు సినిమాల డబ్బింగ్ రూపాలు వెల్లువలా వస్తున్నాయి. తెలుగులో అవి భారీ విజయాలు సాధించకపోవచ్చు. కానీ ఏడాది మొత్తం మీద డబ్బింగ్ సినిమాల మీద తెలుగు ప్రేక్షకులు వెచ్చిస్తున్న డబ్బు యాభై కోట్ల రూపాయల పైమాటే. అంటే ఆమేరకు మన తెలుగు సినిమాలు నష్టపోతున్నాయన్నమాట. ఇంగ్లీషు భాషలో వుండే హాలీవుడ్ సినిమాలు నగరాలకే పరిమితమవుతున్నందున, విలేజ్ మార్కెట్టుని కూడా అందుకోవాలంటే తెలుగులో వాటిని డబ్ చేయడమొక్కటే మార్గం. కాబట్టే.. వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్, పారామౌంట్ ఫిలిమ్స్, ఇండో ఓవర్సీస్ ఫిలిమ్స్, వాల్ట్ డిస్నీ పిక్చర్స్, కొలంబియా పిక్చర్స్ వంటి గొప్ప గొప్ప హాలీవుడ్ నిర్మాణ సంస్థలు తమ సినిమాల్ని తెలుగు వంటి ప్రాంతీయ భాషల్లో డబ్ చేయడానికి ఉత్సాహం చూపుతున్నాయి.
ఈ ఏడాది వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ సినిమాలు 'ఫైనల్ డెస్టినేషన్', 'క్లాష్ ఆఫ్ ద టైటాన్స్', పారామౌంట్ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేసిన 'ది ఉల్ఫ్ మ్యాన్', 'ఐరన్ మ్యాన్-2', ఇండో ఓవర్సీస్ ఫిలిమ్స్ 'లేడీ టెర్మినేటర్', వాల్ట్ డిస్నీ పిక్చర్స్ నిర్మించిన 'ప్రిన్స్ ఆఫ్ పర్షియా' సినిమాలు తెలుగులో రిలీజయ్యాయి. అలాగే బాలీవుడ్డులో భారీ వ్యయంతో తయారైన వివేక్ ఓబరాయ్ సినిమా 'ప్రిన్స్', సాజిద్ నదియడ్ వాలా సినిమా 'హౌస్ ఫుల్', హృతిక్ రోషన్ మూవీ 'కైట్స్' సినిమాలు తెలుగులో విడుదలయ్యాయి. రాంగోపాల్ వర్మ బాలీవుడ్డులో నిర్మించిన 'ఫూంక్-2' చిత్రం 'ఆవహం' పేరుతో వచ్చింది. వీటిలో బాలీవుడ్ నుంచి వచ్చిన సినిమాలన్నీ ఫెయిలవడం గమనార్హం.
థియేటర్ల కొరత
స్ట్రయిట్ సినిమాలతో సమాన సంఖ్యలో డబ్బింగ్ సినిమాలు విడుదలవడం వల్ల తెలుగు నిర్మాతలకు తమ సినిమాల్ని విడుదల చేసుకోడానికి థియేటర్ల కొరత ఏర్పడుతోంది. తమిళ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్, విక్రమ్, సూర్య, కార్తీ వంటివాళ్ల సినిమాలకు మన రాష్ట్రంలో మంచి మార్కెట్ వుంది. వాళ్ల సినిమాలు తెలుగులోని పెద్ద హీరోల సినిమాల స్థాయిలో ఎక్కువ ప్రింట్లతో విడుదలవుతున్నాయి. ఈ ఏడాది కొత్తగా సూర్య తమ్ముడు కార్తీ తెలుగులోనూ చెప్పుకోదగ్గ మార్కెట్ సంపాదించాడు. 'యుగానికి ఒక్కడు'తో అతను తెలుగువాళ్లకి పరిచయమయ్యాడు. పబ్లిసిటీ వల్లనైతేనేమి, సినిమాలోని విషయం వల్లనైతేనేమి అది పెద్ద హిట్టయ్యింది. తమిళ వెర్షన్ కంటే తెలుగు డబ్బింగ్ వెర్షనుకే ఆ సినిమా నిర్మాతకి ఎక్కువ లాభాలు రావడం ఇక్కడ గమనించదగ్గ అంశం. ఈ ఒక్క సినిమాతో కార్తీ తెలుగువాళ్లకి సన్నిహితమైపోయాడు. అది హిట్టవడంతో అతని మరో సినిమా 'ఆవారా'కు ఎక్కడలేని డిమాండూ వొచ్చింది. అందుకు తగ్గట్లే సుమారు 125 ప్రింట్లతో విడుదలైన ఆ సినిమాకి తెలుగులోని పెద్ద హీరో సినిమాల స్థాయిలో ఓపెనింగ్స్ వొచ్చాయి. ఇలా అతని రెండు సినిమాలూ తెలుగులో విజయాన్ని సాధించడం వల్ల కార్తీ మినిమం గ్యారంటీ డబ్బింగ్ సినిమాల హీరోగా మారాడు. భవిష్యత్తులో రిలీజవబోయే అతని సినిమా కోనేందుకు బయ్యర్లు పోటీపడడం ఖాయం. ఇక 'గజిని' సినిమాతో సూర్యకి తెలుగులో వొచ్చిన మార్కెట్ ఏ స్థాయిదో మనకు తెలిసిందే. అతని మునుపటి సినిమా 'ఘటికుడు' చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడకపోయినా ఇటీవల వొచ్చిన 'యముడు' సినిమాకి మంచి ఓపెనింగ్స్ వొచ్చాయి. ఆ సినిమాలో హీరోయిన్ అనుష్క కావడం ప్లస్సయింది. అది వంద ప్రింట్లతో రాష్ట్రవ్యాప్తంగా విడుదలైంది. ఇక విక్రమ్, ఐశ్వర్యారాయ్ కాంబినేషనుతో మణిరత్నం తమిళంలో రూపొందించిన 'రావణన్' తెలుగు డబ్బింగ్ వెర్షన్ 'విలన్' భారీ స్థాయిలో 125 ప్రింట్లతో 215 థియేటర్లలో విడుదలైంది. అంటే అవి ఆడుతున్న సమయాల్లో థియేటర్లు లభించక స్ట్రయిట్ తెలుగు సినిమాల నిర్మాతలు కొంతమంది ఇబ్బందులు పడ్డారు.
నిఘా నిల్
ఒకవైపు తెలుగులోని క్రేజీ సినిమాల వల్ల థియేటర్ల కొరతని ఎదుర్కొంటున్న తెలుగులోని చిన్న (తక్కువ బడ్జెట్) సినిమాల నిర్మాతలు ఇప్పుడు ఈ బడా డబ్బింగ్ సినిమాల వల్ల మరింత అగచాట్లకు గురవుతున్నారు. థియేటర్లు సకాలంలో లభ్యంకాక విడుదల వాయిదా వేసుకుంటున్న సినిమాలెన్నో. ఆ తర్వాత విడుదల చేద్దామంటే వాటిని కొనేందుకు ఏ బయ్యరూ, ఏ డిస్ట్రిబ్యూటరూ ముందుకురాడు. అప్పటికే ఫైనాన్సుతో సినిమాని పూర్తి చేసిన నిర్మాతకు సొంతంగా రిలీజ్ చేసుకునే స్థోమత వుండదు. పబ్లిసిటీకీ, విడుదలకీ మళ్లా అప్పుచేసే ధైర్యం లేక చాలామంది నిర్మాతలు తమ సినిమాల్ని ల్యాబుల్లోనే మగ్గనిస్తున్నారు. అవెప్పుడు థియేటర్ల మొహం చూస్తాయో ఎవరూ చెప్పలేని స్థితి. ఈమధ్య కొంతమంది నిర్మాతలు తెలివిమీరి డబ్బింగ్ సినిమాలకి నాలుగైదు తెలుగు సీన్లు జోడించి, స్ట్రయిట్ సినిమాలంటూ విడుదల చేస్తున్నారు. తద్వారా డబ్బింగ్ సినిమాల మీద ప్రభుత్వం వేస్తున్న పన్నుని తప్పించుకుంటున్నారు. వీటిమీద సరైన నిఘా లేకపోవడంతో ఇలాంటి సినిమాలు తరచూ వస్తూనే ఉన్నాయి. ఈరకంగా డబ్బింగ్ సినిమాలు తెలుగు మార్కెట్ మీద దురాక్రమణ చేస్తున్నాయి. అష్టకష్టాలు పడి తెలుగులో సినిమాలు తీస్తున్న నిర్మాతల నడ్డి విరుస్తున్నాయి. కర్నాటక తరహాలో ఇక్కడ కూడా డబ్బింగ్ సినిమాల మీద ఆంక్షలు పెట్టుకుంటే తప్ప 'మన' నిర్మాతల కష్టాలు కొంతమేరకైనా తీరవు.

No comments: