Thursday, July 8, 2010

2010 Half Year Tollywood Review




మొదటిభాగం
తెలుగు సినీ పరిశ్రమకి 2009 సంవత్సరం చేదు జ్ఞాపకంగా మిగిలిన సంగతి మనకు తెలుసు. భారీ అంచనాలతో రిలీజయిన పలు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో ఇటు ప్రొడ్యూసర్లు, అటు డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయారు. ఫలితంగా 2010లో కొత్త సినిమాల క్లాపులు బాగా తగ్గాయి. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఈ ఏడాది తొలి అర్థభాగం లాభ నష్టాల నిష్పత్తి 1:5గా నమోదయ్యింది. బాలకృష్ణ, ఎన్టీఆర్, ప్రభాస్, గోపీచంద్, నాగచైతన్య, మంచు మనోజ్ వంటి హీరోలు హిట్లని సాధించగా; వెంకటేశ్, రవితేజ, జగపతిబాబు వంటి హీరోలు ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయారు.
అల్లు అర్జున్ ఒక అట్టర్ ఫ్లాప్, ఒక ఎబోవ్ యావరేజితో సమతూకం సాధించగలిగాడు. ఈ అర్ధభాగంలో ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాల్లో తొలి రెండు బాబాయ్, అబ్బాయ్ నటించినవి కావడం గమనార్హం. కెరీర్ చరమ దశకు వస్తున్నదనుకుంటున్న తరుణంలో నందమూరి బాలకృష్ణ పూర్వ వైభవాన్ని జ్ఞప్తిచేసే రీతిలో 'సింహా' అఖండ విజయాన్ని నమోదు చేసి, దాదాపు 40 కోట్ల రూపాయల షేరుని వసూలుచేసి, ఈ ఏడాది ఇప్పటివరకు అతి పెద్ద హిట్టుగా నిలిచింది. నైజాంలో పెద్ద ప్రభావాన్ని కనపరచని ఈ సినిమా ఆంధ్ర, సీడెడ్ ప్రాంతాల్లో పంపిణీదారులకు భారీ లాభాల్ని అందించింది. తండ్రీకొడుకులు నరసింహ, లక్ష్మీనారాయణ పాత్రల్లో బాలకృష్ణ నటనా వైదుష్యం ప్రేక్షకుల్ని విశేషంగా అలరించగా, బోయపాటి శ్రీను దర్శకత్వ ప్రతిభ సినిమాని ఆకర్షణీయంగా మలిచింది. ఆ సినిమా తర్వాత ఎక్కువ కలెక్షన్లు సాధించిన చిత్రం నందమూరి తారకరామ్ (జూనియర్ ఎన్టీఆర్) ద్విపాత్రాభినయం చేసిన 'అదుర్స్'. వి.వి. వినాయక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో విలక్షణ నటనను ప్రదర్శించి ఎన్టీఆర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. అయితే తెలంగాణ విషయంలో నిర్మాతల్లో ఒకరైన నాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో నైజాం ఏరియాలో మూడు వారాల తర్వాత అర్థంతరంగా చిత్రాన్ని నిలిపేయాల్సి వచ్చింది. దీనివల్ల నిర్మాతలు ఈ ఏరియాలో నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. మిగతా ప్రాంతాల్లో కలెక్షన్లు 'అదుర్స్' అనిపించాయి.

రెండవ భాగం
మొదట డివైడ్ టాక్ వచ్చినా, నిలదొక్కుకొని లాభాలు ఆర్జించిన సినిమా 'డార్లింగ్'. ప్రభాస్, కాజల్ అగర్వాల్ జోడీ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇటు యువతనీ, అటు ఫ్యామిలీ ఆడియెన్సునీ సమంగా మెప్పించి, చాలా రోజుల తర్వాత ప్రభాస్ కి ఓ తృప్తికర విజయాన్ని సమకూర్చింది. అన్ని చిత్రాల్లో కంటే కాలేజీ యువతని బాగా ఆకర్షించిన సినిమా 'ఏమాయ చేసావె'. నాగచైతన్య, నూతన తార సమంత జంటకి కాలేజీ కుర్రకారు దాసోహమన్నారు. గౌతమ్ మీనన్ దర్శకత్వ ప్రతిభకి తోడు ఎ.ఆర్. రెహమాన్ సంగీతం ఎస్సెట్ కావడం ఈ సినిమా విజయానికి దోహదం చేసింది. మోహన్ బాబు కుమారుడు మన్చు మనోజ్ కెరీరులోనే బెటర్ అనదగ్గ 'బిందాస్' వచ్చింది ఈ ఫిబ్రవరిలోనే. వీరు పోట్ల దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాలో మనోజ్ తన నటన, తన తండ్రిలాగే విలక్షణ డైలాగ్ డిక్షనుతో ఆకట్టుకున్నాడు. ఫలితంగా ఈ సినిమా ఎబోవ్ యావరేజిగా నిలిచింది. మినిమమ్ గ్యారంటీ కామెడీ హీరోగా మార్కెట్లో పేరు తెచ్చుకున్న అల్లరి నరేశ్ సినిమా 'బెట్టింగ్ బంగార్రాజు' చిత్రం హాస్యప్రియుల్ని ఆకట్టుకుని ఉషాకిరణ్ మూవీస్ సంస్థకి పెట్టుబడిని తిరిగి తీసుకొచ్చింది. డీన్ని కూడా ట్రేడ్ వర్గాలు ఎబోవ్ యావరేజిగా పేర్కొన్నాయి. వీటి మాదిరే నిర్మాతకు టేబుల్ ప్రాఫిటునీ, పంపిణీదారులు పెట్టిన డబ్బునీ తెచ్చి బ్రేక్ ఈవెనుగా నిలిచిన సినిమా 'గోలీమార్'. డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో గోపీచంద్ కాంబినేషనులో వచ్చిన ఈ పోలీసు సినిమా యాక్షన్ ప్రియుల్ని బాగా ఆకట్టుకుంది. క్రిష్ డైరెక్ట్ చేయగా, అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క కాంబినేషనుతో మల్టీస్టారర్ సినిమాగా ప్రాచుర్యం పొందిన 'వేదం' సినిమా 'ఎ' సెంటర్లలో ఇప్పటికీ చెప్పుకోదగ్గ కలెక్షన్లు వసూలు చేస్తోంది. అయితే బి, సి సెంటర్లలో ఈ సినిమా కలెక్షన్లు అసంతృప్తికరంగా ఉన్నాయి. అంటే ఈ సినిమా పంపిణీదారులకి మిశ్రమ ఫలితాన్ని అందించింది. బాక్శాఫీసు ఫలితాన్ని అలా ఉంచితే ఈ ఏడాది విమర్శకుల ప్రశంసల్ని బాగా పొందిన సినిమా ఇదే.
డి. రామానాయుడు మనవడు రానా హీరోగా తెరంగేట్రం చేసిన 'లీడర్' ప్రేక్షకుల్ని ఓ మోస్తరుగా మాత్రమే ఆకట్టుకోగలిగింది. అయితే రానా తన నటనతో మెప్పించగా, శేఖర్ కమ్ముల దర్శకత్వం మరోసారి విమర్శకుల ప్రశంసల్ని చూరగొంది. వెంకటేశ్, త్రిష జంటగా నటించిన 'నమో వెంకటేశ' చిత్రం జస్ట్ యావరేజ్ కలెక్షన్లని మాత్రమే సాధించగలిగింది. శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన ఈ సినిమా గతంలో వెంకటేశ్ హీరోగా నటించిన అనేక సినిమాలకు నకలుగా ఉండటంతో, ఏమాత్రం కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకుల్ని అసంతృప్తికి గురిచేసింది. నిర్మాతకి లాభాన్నీ, డిస్ట్రిబ్యూటర్లకి నష్టాన్నీ తెచ్చిన చిత్రం రవితేజ, నరేశ్, శివబాలాజీ కాంబినేషనులో వచ్చిన 'శంభో శివ శంభో'. తమిళ సినిమాకి రీమేక్ అయిన ఈ సినిమాలోని 'రియాలిటీ' తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. రామ్ హీరోగా దిల్ రాజు నిర్మించిన 'రామరామ కృష్ణకృష్ణ' సినిమా కూడా బిలో యావరేజ్ స్టేజిని దాటలేకపోయింది. రామ్ క్యారెక్టరైజేషన్, స్క్రీన్-ప్లేలోని కన్ఫ్యూజనుతో పాటు హీరోయిన్లు ప్రియా ఆనంద్, బిందుమాధవి.. ఇద్దరూ ఆకట్టుకోలేకపోవడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి.

చివరిభాగం
భారీ అంచనాలు, క్రేజీ కాంబినేషన్లతో వచ్చి బాగా డిజప్పాయింట్ చేసిన సినిమాలు.. నాగార్జున హీరోగా నటించిన 'కేడి', అల్లు అర్జున్, గుణశేఖర్ కాంబినేషన్ ఫిల్మ్ 'వరుడు', వరుణ్ సందేశ్ తో దిల్ రాజు నిర్మించిన కొత్త 'మరో చరిత్ర', దాసరి నారాయణరావు 149వ చిత్రం 'యంగ్ ఇండియా', అనుష్క టైటిల్ రోల్ పోషించిన 'పంచాక్షరి', జగపతిబాబు, ప్రియమణిల 'సాధ్యం', నిఖిల్, శ్వేతాబసుప్రసాద్ జంటగా వచ్చిన 'కళవర్ కింగ్'.
నాగార్జున 'కేడి' సినిమాకి సబ్జెక్టుతో పాటు హీరోయిన్ మమతా మోహన్ దాస్ కూడా మైనస్ అయ్యిందనేది విశ్లేషకుల అభిప్రాయం. పదహారు రోజుల తెలుగు సంప్రదాయ వివాహాన్ని హైలైట్ చేస్తూ ఈ సినిమా తీశామని దర్శకుడు గుణశేఖర్ ఊదరగొట్టిన 'వరుడు' సినిమా ప్రేక్షకుల్ని ఏమాత్రం మెప్పించలేకపోయింది. 'వరుడు'గా అల్లు అర్జున్ బాగా నటించినా, సినిమాలో ఆహ్లాదం కంటే బీభత్సం పాలు ఎక్కువవడం, వధువుగా భానుశ్రీ మెహ్రా ఆకట్టుకోలేకపోవడం ఈ సినిమాని అనాసక్తికరం చేశాయి. ఒకప్పటి క్లాసిక్సుని రీమేక్ చెయ్యడం ఎంతటి దుస్సాహసమో 'మరో చరిత్ర' రిజల్ట్ తేల్చిచెప్పింది. కె. బాలచందర్ రూపొందించిన అజరామర ప్రేమకథాచిత్రం 'మరో చరిత్ర'ని నేటి కాలానికి అన్వయిస్తూ దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా రవ్వంత కూడా ఆడియెన్సుని ఆకట్టుకోలేక బాక్సాఫీసు వద్ద చతికిలపడింది.
ఆరేళ్లకు పైగా విరామం తీసుకుని దర్శకరత్న దాసరి నారాయణరావు రూపొందించిన 'యంగ్ ఇండియా' సినిమా యువ ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. 'భారతీయుడుగా సాధించు, భారతీయుడుగా మరణించు' అనే స్లోగన్ ఇచ్చిన ఈ సినిమా లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. 'అరుంధతి' వంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తర్వాత అనుష్క టైటిల్ రోల్ చేసిన 'పంచాక్షరి' విడుదలకు ముందు తెచ్చుకున్న క్రేజుని, విడుదల తర్వాత సొమ్ము చేసుకోలేకపోయింది. నిర్మాతకి టేబుల్ ప్రాఫిట్ అందించిన ఈ సినిమా బయ్యర్లకు మాత్రం నష్టాల్ని మిగిల్చింది.
కాగా ఈ ఆర్నెల్లలో వచ్చిన డైరెక్టర్ దేవా కట్టా సినిమా 'ప్రస్థానం', చంద్రసిద్ధార్థ్ సినిమా 'అందరి బంధువయ' సినిమాలు విమర్శకుల ప్రశంసలు పొంది వాళ్లకి మంచి పేరు తెచ్చాయి. అయితే కమర్షియలుగా అవి ఫెయిల్ అయ్యాయి. ఈ ఏడాది యువ హీరోల్లో 'రామరామ కృష్ణకృష్ణ'తో రామ్, 'మరో చరిత్ర'తో వరుణ్ సందేశ్, 'సీతారాముల కల్యాణం.. లంకలో'తో నితిన్, 'ఓం శాంతి', 'యాగం'లతో నవదీప్, 'కళవర్ కింగ్'తో నిఖిల్, 'మౌనరాగం'తో తనీష్ ఫ్లాపులనిచ్చారు. అయితే ఈ 2010 అర్ధభాగంలో ఓ విశేషం చోటుచేసుకుంది. అది ఒకప్పటి మరపురాని మహోజ్వల పౌరాణిక చిత్రరాజం 'మాయాబజార్' రంగుల్లో విడుదలకావడం. ఈ సరికొత్త రంగుల మాయాబజారుని జనం బాగానే ఆదరించారు. మొత్తంగా చూసినట్లయితే ఎప్పట్లాగే లాభాల కంటే ఐదు రెట్లు ఎక్కువగా నష్టాల్నే మూటగట్టుకుంది టాలీవుడ్ ఇండస్ట్రీ.

No comments: