Monday, July 26, 2010

Rajamouli and his heroes!








అపజయం ఎరుగని డైరెక్టరుగా యస్.యస్. రాజమౌళి తెలుగు చలనచిత్ర చరిత్రలో తనకంటూ ఓ శాశ్వత పేజీని సంపాదించుకున్నాడు. గతంలో దాసరి నారాయణరావు తొలి సినిమా 'తాత మానవుడు' నుంచి వరుసగా పద్నాలుగు విజయవంతమైన సినిమాలను డైరెక్ట్ చేయడం ఒక హిస్టరీ అయితే, ఉండకూడనన్ని ప్రతికూల పరిస్థితులున్న నేటికాలంలో వరుసగా ఎనిమిది హిట్లను అందించిన రాజమౌళిది ఇంకో హిస్టరీ. 'స్టూడెంట్ నెం.1' (2002) నుంచి మొదలైన ఆయన విజయ విహారం 'మగధీర' దాకా అప్రతిహతంగా కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు 'మర్యాద రామన్న' పేరుతో ఆయన తొమ్మిదో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ రిపోర్టుతో సక్సెస్ దిశగా సాగుతోంది. ఈ వ్యాసం ఉద్దేశం రాజమౌళిని కీర్తించడం కాదు. ఆయనతో హిట్ సినిమాల్లో భాగస్వాములైన హీరోల కెరీర్, ఆ సినిమాల తర్వాత ఎలా కొనసాగుతున్నదన్నది విశ్లేషించడం. ఆసక్తి కలిగించే పాయింట్ ఒకటి అందులో ఉండటమే ఈ విశ్లేషణకు ఆధారం. రాజమౌళి డైరెక్షనులో హిట్లను సాధించిన ఆ హీరోల్లో ఎక్కువమంది ఆ తర్వాత కెరీర్లో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ వొస్తున్నారు!
ప్రభావాన్ని తట్టుకుంది ఒక్క రవితేజే!
రాజమౌళి దర్శకత్వంలో 'మర్యాద రామన్న' సునీల్ సహా ఇప్పటివరకు ఆరుగురు హీరోలు నటించారు. వారిలో రాంచరణ్ తో ఆయన తీసిన సినిమా 'మగధీర' అపూర్వమైన రీతిలో బాక్సాఫీసు రికార్డుల్ని నెలకొల్పిన సంగతి మనకు తెలుసు. 'మగధీర' తర్వాత రాంచరణ్ మరో సినిమా ఏదీ ఇంకా విడుదల కాలేదు. కాబట్టి రాంచరణ్నీ, సునీల్నీ మినహాయిస్తే మిగతా నలుగురు హీరోల్లో ఒక్క రవితేజ మాత్రమే రాజమౌళితో చేసిన సినిమా తర్వాత కూడా క్రమం తప్పకుండా విజయాలు సాధిస్తూ వొచ్చాడు. మిగతా ముగ్గురు.. ఎన్టీఆర్, ప్రభాస్, నితిన్ మిగతా దర్శకులతో చెప్పుకోదగ్గ విజయాల్ని సాధించలేక పోయారు. రాజమౌళి, రవితేజ కాంబినేషన్లో 'విక్రమార్కుడు' (2006) వొచ్చింది. ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత రవితేజ నుంచి 'దుబాయ్ శీను' (2007), 'కృష్ణ' ('08), 'కిక్' ('09) వంటి హిట్లు వొచ్చాయి. అంటే రాజమౌళి ప్రభావాన్ని తట్టుకుని నిలిచింది ఇప్పటివరకు అతనే. ఈ ఏడాది ఇంకా హిట్ రాకపోయినా 'డాన్ శీను' ఆ లోటుని పూరించే అవకాశాలు ఉన్నాయని అతను ఆశిస్తున్నాడు.
రాజమౌళితోటే మళ్లీ హిట్టు
ఎన్టీఆర్ సంగతికి వొస్తే, అతని కెరీర్లో తొలి హిట్ 'స్టూడెంట్ నెం.1', బిగ్గెస్ట్ హిట్ 'సింహాద్రి'. ఈ రెండింటి డైరెక్టరూ రాజమౌళి కావడం విశేషం. 2001లో 'నిన్ను చూడాలని' ఫ్లాపుతో హీరోగా తెరంగేట్రం చేసిన ఎన్టీఆర్కి రెండో సినిమా 'స్టూడెంట్ నెం.1' ('01) తొలి హిట్టుని అందించింది. అది రాజమౌళికి తొలి సినిమా. ఆ తర్వాత వినాయక్ దర్శకత్వంలో అతను చేసిన 'ఆది' సూపర్ హిట్టయ్యింది. అది వినాయక్ తొలి సినిమా. అంటే నేటి మెగా డైరెక్టర్లలో ఇద్దరు అతని సినిమాలతోటే పరిచయమయ్యారు. 'ఆది' తర్వాత ఎన్టీఆర్కి మళ్లీ హిట్టు వచ్చింది 'సింహాద్రి' ('03)తోటే. అది మామూలు హిట్టు కాదు. ఎన్టీఆర్ని టాప్ హీరోగా నిలబెట్టిన హిట్టు. ఆ సినిమా ఇచ్చిన నమ్మకంతోటే "నా లక్ష్యం నెంబర్ వన్ హీరో కావడం" అని ప్రకటించాడు ఎన్టీఆర్. కానీ ఆ తర్వాత అతని నుంచి వొచ్చిన సినిమాలు ఆ లక్ష్యాన్ని అందించలేకపోయాయి. 'సింహాద్రి' తర్వాత మరో విజయం కోసం అతను నాలుగేళ్లపాటు ఏడు సినిమాల దాకా నిరీక్షించాడు. 'యమదొంగ' ('07)తో అతను అందుకున్న హిట్టు మళ్లీ రాజమౌళితోటే కావడం గమనార్హం. అంటే రాజమౌళే అతన్ని ఆదుకున్నాడు. దాని తర్వాత వొచ్చిన 'కంత్రి' నిరాశపరచగా, 'అదుర్స్' సినిమా పేరుకి హిట్ అనిపించుకుని, నిర్మాతకి 4 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. అందుకే ఈ సినిమా ఫలితం ఎన్టీఆర్కి అంత సంతృప్తినివ్వలేదు. ఇప్పుడతని చూపంతా రానున్న రెండు సినిమాలు 'బృందావనం', 'శక్తి' మీద ఉన్నాయి. వీటిలో 'బృందావనం' చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తుంటే, 'శక్తి'ని మెహర్ రమేశ్ తీర్చిదిద్దుతున్నాడు. ఈ సినిమాలతో ఎన్టీఆర్ మళ్లీ టాప్ రేంజికి వెళతాడేమో చూడాలి.
మరో హిట్టేదీ?
రాజమౌళి డైరెక్ట్ చేసిన రెండో హీరో నితిన్. అదివరకు తేజ దర్శకత్వంలో 'జయం', వినాయక్ డైరెక్షన్లో 'దిల్' హిట్లను పొందిన నితిన్కి మూడో విజయాన్ని అందించింది రాజమౌళి డైరెక్ట్ చేసిన 'సై' (2004). ఈ సినిమాతోటే తెలుగు ప్రేక్షకులకి రగ్బీ ఆటతో పాటు ప్రదీప్ రావత్ వంటి భీకర విలన్ని పరిచయం చేశాడు రాజమౌళి. దురదృష్టమేమంటే ఆ సినిమా తర్వాత గొప్పగా చెప్పుకునే రేంజిలో ఒక్క సినిమా కూడా రాలేదు నితిన్కి. ఈ ఆరేళ్లలో అతను పన్నెండు సినిమాలు చేశాడు. వాటిలో మలయాళ డైరెక్టర్ సిద్ధిఖ్ డైరెక్ట్ చేసిన 'మారో' సినిమా ఇంకా విడుదలకు నోచుకోలేదు. కె. రాఘవేంద్రరావు (అల్లరి బుల్లోడు), తేజ (ధైర్యం), ఎన్. శంకర్ (రామ్), అమ్మ రాజశేఖర్ (టక్కరి), ఎ.ఎస్. రవికుమార్ చౌదరి (ఆటాడిస్తా), రాంగోపాల్ వర్మ (అడవి), పరుచూరి మురళి (రెచ్చిపో) వంటి డైరెక్టర్లు కూడా అతనికి హిట్టుని ఇవ్వలేకపోయారు. 'మారో'తో అతనికి ఆ లోటు తీరుతుందేమో చెప్పలేం.
ఐదేళ్లు ఆగాల్సి వచ్చింది
శోభన్ డైరెక్ట్ చేసిన 'వర్షం' (2004)తో తొలి విజయాన్ని అందుకున్న ప్రభాస్ మలి విజయాన్ని అందుకున్నది రాజమౌళి డైరెక్షన్లో. ఆ సినిమా 'ఛత్రపతి' ('05). దాని తర్వాత ప్రభాస్ కెరీర్ ఆశించిన రీతిలో సాగలేదు. ప్రభుదేవా (పౌర్ణమి), వి.వి. వినాయక్ (యోగి), పూరి జగన్నాథ్ (బుజ్జిగాడు, ఏక్ నిరంజన్) వంటి డైరెక్టర్లు అతనికి విజయాల్ని అందించలేకపోయారు. మెహర్ రమేశ్ డైరెక్ట్ చేసిన రీమేక్ ఫిల్మ్ 'బిల్లా' సైతం ఆశించిన తీరులో హిట్టవలేదు. అలా 'ఛత్రపతి' వచ్చిన దాదాపు ఐదేళ్లకి గానీ ప్రభాసుకి మరో హిట్టు లభ్యం కాలేదు. ఈసారి తమిళ దర్శకుడు కరుణాకరన్ 'డార్లింగ్' రూపంలో అతనికో విజయాన్ని సాధించిపెట్టాడు. ప్రస్తుతం దశరథ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా తర్వాత అతను మరోసారి తన ఫేవరైట్ డైరెక్టర్ రాజమౌళితో పనిచేయబోతున్నాడు. ఈ కాంబినేషన్లో వొచ్చే రెండో సినిమా ప్రభాసుకి మరో మెగా హిట్టుని అందించఢమ్ ఖాయమనేది విశ్లేషకుల అభిప్రాయం.
ఇంకా టైముంది
రాంచరణ్ చేసింది రెండే సినిమాలయినా, రెండో సినిమాతోటే మెగా హీరో ఆయిపోయాడు. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన 'చిరుత' ('07)తో హీరోగా పరిచయమై ఓ మోస్తరు విజయాన్ని పొందిన రాంచరణ్ రెండేళ్ల తర్వాత 'మగధీర' ('09) సాధించిన అద్భుత విజయంతో టాప్ స్టార్లల్ చేరిపోయాడు. ఆ సినిమా డైరెక్టర్ రాజమౌళి టాలీవుడ్డులో నెంబరువన్ డైరెక్టరుగా నిలిచాడు. 'మగధీర' తర్వాత రాంచరణ్ రెండు సినిమాలు చేస్తున్నాడు. వాటిలో ఒకటి బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో చేస్తున్న 'ఆరంజ్' అయితే, మరొకటి ధరణి డైరెక్షన్లో చేస్తున్న 'మెరుపు'. ఈ ఇద్దరు డైరెక్టర్లూ తమిళులే కావడం గమనార్హం. ఈ సినిమాల ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.
ఉత్కంఠ రేపిన 'మర్యాద రామన్న'
తెలుగు చిత్రసీమ చరిత్రలోనే అత్యధిక వసూళ్లను సాధించి, ముక్కుమీద వేలేసుకునే రేంజిలో బాక్సాఫీసు రికార్డుల్ని సృష్టించిన సినిమా తీసిన ఏ డైరెక్టరైనా ఏం చేస్తాడు? తన తదుపరి సినిమాని ఏ స్థాయి హీరోతో చేస్తాడు? కచ్చితంగా అగ్ర హీరోతోనే చేయాలనుకుంటాడు. కానీ రాజమౌళి అందుకు భిన్నం. రాంచరణ్తో 'మగధీర' వంటి రికార్డుల సినిమాని రూపొందించిన ఆయన తదుపరి సినిమాలో కమెడియన్ సునీల్ హీరో కావడం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. 'ఏ మహేశ్ తోనో, లేదా ఎన్టీఆర్ తోనో సినిమా చేస్తాడనుకుంటే.. ఇదేమిటి రాజమౌళి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు?' అని చాలామంది అన్నారు. ఎవరేమన్నా, అనుకున్నా ఆయనలోని డైరెక్టర్ కథనే నమ్ముకున్నాడు. ఆ కథకి సునీల్ అయితేనే కరెక్టనుకున్నాడు. అలా అని సునీల్ని మనం మరీ తక్కువ చేయాల్సిన పనిలేదు. 'అందాల రాముడు'తోనే అతను హీరో అయ్యాడు. మెప్పించాడు. అయితే దాని తర్వాత అతను హీరో పాత్రలే చేయాలని గిరి గీసుకోకుండా కమెడియనుగానే కొనసాగుతూ వొచ్చాడు. స్టార్ కమెడియనుగా తన ఇమేజిని కాపాడుకుంటూ వొస్తున్నాడు. అతను మళ్లీ హీరో పాత్ర చేసింది 'మర్యాద రామన్న'లోనే. ఈమధ్యే 'వేదం' వంటి ఉత్తమ చిత్రంతో సినీ నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన ఆర్కా మీడియా వర్క్స్ అధినేతలు ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమాలో సునీల్ సరసన సలోనీ ('ఒక ఊరిలో', 'కోకిల' ఫేమ్) నాయికగా నటించింది. ఈ సినిమాపై ఇటు చిత్రసీమలోనూ, అటు ట్రేడ్ వర్గాల్లోనూ నెలకొన్న విపరీతమైన ఆసక్తికి అనుగుణంగానే బాలకృష్ణ సినిమా 'సింహా' సినిమాకి మించి ఎక్కువ బిజినెస్ చేసింది. అదీ రాజమౌళి బ్రాండ్ వాల్యూ. అలాంటి 'మర్యాద రామన్న' ఏ రేంజిలో హిట్టవుతాడో చూడాలంటే కొద్ది రోజులు ఆగాలి.

No comments: