Wednesday, July 14, 2010

Health: Take Care With Cooking Oils


ప్రతి స్త్రీ తన కుటుంబం ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని కోరుకుంటుంది. అయితే ఆరోగ్యం కోసమని టీవీలో, పత్రికల్లో వచ్చే ప్రకటనలు మహిళల్ని తికమక పెడుతున్నాయి.
కొలెస్టెరాల్ విషయమే తీసుకోండి. వాస్తవానికి అదేమీ శతృవు కాదు మనకి. లావుగా తయారవడానికి తోడ్పడే ఓ పదార్థం మాత్రమే అది. మనం తీసుకునే ఆహారంలో 20 నుంచి 30 శాతం కొవ్వు వుండవచ్చు. జంతు సంబంధమైన ఆహారంలో.. అంటే మాంసం, చికెన్, కోడి గుడ్లు, పాలు, నెయ్యి మొదలైన వాటిలో కొలెస్టెరాల్ ఎక్కువగా వుంటుంది. వెజిటబుల్ ఆయిల్స్‌లో కొలెస్టెరాల్ వుండదు.
మన దేహంలో కొన్ని ముఖ్యమైన పనుల్ని కొలెస్టెరాల్ నిర్వర్తిస్తుంది. సున్నితమైన నరాలకి రక్షణ కవచంలా అది ఉపయోగ పడుతుంది. జీర్ణశక్తికి తోడ్పడుతుంది. సెక్స్ హార్మోన్లు, ఖనిజ లవణాలు, విటమిన్-డిలలో రవాణా చేస్తుంది. అయితే కొలెస్టెరాల్ వల్ల అనర్థం కూడా వుంది. గుండె నుంచి బయలుదేరే రక్తనాళాల గోడల వద్ద కొలెస్టెరాల్ పేరుకుంటే రక్తనాళాలు వాచి గుండె జబ్బూలకీ, హార్ట్ ఎటాక్‌లకి దారితీస్తుంది.
ఏదేమైనా, కొలెస్టెరాల్ ప్రతిసారీ హానికరం కాదని చెప్పొచ్చు. అది రెండు రకాలు:
1. చెడు కొలెస్టెరాల్ లేదా తక్కువ సాంద్రత వున్న లిక్విడ్స్ (ఎల్.డి.ఎల్.): రక్త నాళాలని కుంచింపచేసి, రక్త ప్రసరణకి ఆటంకం కలిగిస్తుంది.
2. మంచి కొలెస్టెరాల్ లేదా ఎక్కువ సాంద్రత వున్న లిక్విడ్స్ (హెచ్.డి.ఎల్.): వాక్యూం క్లీనర్‌లాగా పనిచేసి, రక్త నాళాలను శుద్ధి చేస్తుంది. చెడు కొలెస్టెరాల్‌ని అరికడుతుంది. మన ఆరోగ్యం మన రక్తంలో వుండే కొలెస్టెరాల్ పరిమాణంపై ఆధారపడి వుంటుంది. 240 మి.గ్రా./డె.లీ. కంటే ఎక్కువగా వుంటే కొలెస్టెరాల్ ఎక్కువైందని అర్థం. 200-239 మి.గ్రా./డె.లీ. వుంటే హద్దు వద్ద వుందని చెప్పాలి. 200 మి.గ్రా./డె.లీ. వుంటే కొలెస్టెరాల్ వుందని భయపడాల్సిన అవసరం లేదు. ఇక చెడు కొలెస్టెరాల్ (ఎల్.డి.ఎల్.) 130 మి.గ్రా./డె.లీ. కంటే ఎప్పుడూ తక్కువగానే వుండాలి. హెచ్.డి.ఎల్. 35 మి.గ్రా./డె.లీ. కంటే ఎక్కువగా వుండాలి. ఎల్.డి.ఎల్., హెచ్.డి.ఎల్.ల నిష్పత్తి 3:1 కంటే తక్కువగా వుండేట్లు చూసుకోవాలి.
కొవ్వు తాలూకు నిజాలు:
వంట నూనెలన్నీ దాదాపు ఒకే విధమైన కెలోరీ విలువ కలిగి వుంటాయి. వంట నూనెలు అంటే శుద్ధ కొవ్వే. శుద్ధ ప్రొటీన్ల కెలోరీ విలువకంటే వంట నూనెల కెలోరీ విలువ రెండు రెట్లు ఎక్కువ. కొవ్వులో కర్బనం, హైడ్రోజన్, ఆక్సిజన్ వుంటాయి. కొవ్వులో హైడ్రోజన్ శాతం అది సంతృప్తమైనదా, అసంతృప్తమైనదా అనే సంగతిని నిర్ణయిస్తుంది. సంతృప్త కొవ్వు ఆమ్లాలు ఎక్కువ హైడ్రోజన్ అణువుల్ని కలిగి వుంటాయి. అందువల్ల ఇవి ఎక్కువ స్థిరత్వంతో ఉండటమే కాక, తొందరగా చెడిపోకుండా కూడా వుంటాయి. నెయ్యి, వెన్న వంటి సంతృప్త వంట పదార్థాలన్నీ గది ఉష్ణోగ్రత వద్ద ఘనరూపంలో వుంటే కొబ్బరినూనె, పామాయిల్ వంటి ద్రవరూప నూనెలు కూడా అధిక సంతృప్త కొవ్వు ఆమ్లాలను కలిగి వుంటాయి. ఆహారంలో సంతృప్త కొవ్వు ఉండాల్సిన అవసరం లేదు. కాలేయం ఉత్పత్తిచేసే ఎల్.డి.ఎల్. కొలెస్టెరాల్‌ని ప్రేరేపించడమే కాక సంతృప్త కొవ్వు గుండె జబ్బుల్నీ, గుండెపోట్లనీ పెంచుతుంది. దీనివల్ల డయాబెటిస్, బ్రెస్ట్ కేన్సర్ కూడా వచ్చే ప్రమాదం వుంది.
వెజిటబుల్ ఆయిల్స్ అన్నీ అసంతృప్తంగా వుంటాయి. వాటిలో కొలెస్టెరాల్ వుండదు. తమ నూనెలు కొలెస్టెరాల్‌ని కలిగివుండవనే వ్యాపార ప్రకటనల అర్థం ఇదే. అయితే అవి కొలెస్టెరాల్‌ని సృష్టించగలవు. అంటే దీనర్థం అవి కొవ్వును తక్కువగా ఉత్పత్తి చేస్తాయని కాదు. వెజిటబుల్ ఆయిల్స్ ఏ ఇతర నూనె కంటే కూడా శుద్ధ కొవ్వుని కలిగి వుంటాయి.
వెజిటబుల్ సీడ్ ఆయిల్స్‌లో వినోలిక్ ఆసిడ్ ఎక్కువగా వుంటుంది. రక్తంలో కొలెస్టెరాల్‌ని సూక్ష్మీకరించడంలో ఈ ఆమ్లం తోడ్పాటునందిస్తుంది. అంతేకాక ప్రాణాంతకమైన కేన్సర్ కణాలతో వినోలిక్ ఆసిడ్ ప్రభావయుతంగా యుద్ధం చేస్తుందని ఫ్రాన్సులో జరిగిన ఆధునిక పరిశోధనలవల్ల తేలింది.
వెజిటబుల్ ఆయిల్స్ ఇంకా రెండు విధాలైన అసంతృప్త కొవ్వుల్ని కలిగి వుంటాయి.
1. పాలీ అన్‌సాచురేటెడ్ ఫాటీ ఆసిడ్స్ (పి.యు.ఎఫ్.ఎ.-ప్యూఫా)
2. మోనో అన్‌సాచురేటెడ్ ఫాటీ ఆసిడ్స్ (ఎం.యు.ఎఫ్.ఎ.-మూఫా)
ఈ ప్యూఫా, మూఫాల మిశ్రమమే వంటనూనెలు. కొవ్వులో ప్యూఫా అధికంగా వుంటే, ఆ కొవ్వు ద్రవరూపంలో వుంటుందని చెప్పవచ్చు. ద్రవరూప నూనెల్ని కఠినం చేయడానికి హైడ్రోజినేషన్ పద్ధతిని వుపయోగిస్తారు. దీనివల్ల అసంతృప్త కొవ్వు ఆమ్లాలు సంతృప్త కొవ్వు ఆమ్లాలుగా మారతాయి. వనస్పతుల్లో ఎక్కువ హైడ్రోజినేట్ అయిన కొవ్వులే. వాటిలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు అధికంగా వుంటాయి. కొన్ని వంటనూనెల తాలూకు వ్యాపార ప్రకటనలు మనల్ని తప్పుదారి పట్టిస్తుంటాయి. తమ ఉత్పత్తిలో 88 శాతం కొవ్వు వుండదు అని వాటిలో వుంటుంది. దీనర్థం ఏమంటే-అది 12 శాతం సంతృప్త కొవ్వును, 88 శాతం అసంతృప్త కొవ్వు (ప్యూఫా)ను కలిగి వుంటుందని.
ప్యూఫా ప్రధానంగా వుండే నూనెల తాలూకు కర్బన గొలుసులు రెండు లేదా అంతకంటే ఎక్కువ ద్విబంధాలను (నాలుగు లేదా అంతకంతే ఎక్కువ హైడ్రోజన్ అణువులను కోల్పోవడం) కలిగి వుంటాయి. ఎందుకంటే ప్యూఫా వుండే నూనెలకి రెండు సమస్యలున్నాయి. వాతావరణపరంగా చూస్తే అవి చాలా సున్నితం. త్వరగా చెడిపోయే తత్వం వాటికి వుంది. అయితే 10 సంవత్సరాల వ్యవధిలో ప్యూఫా రక్తంలో కొలెస్టెరాల్‌ని బాగా తగ్గించివేయ గలిగినట్టు పరిశోధనలు నిరూపించాయి. పొద్దు తిరుగుడు పువ్వు నూనెలో ప్యూఫా అధిక మోతాదులో వుంటుంది. ఈ కారణంచేత నగరాలు, పట్నాల్లో ఈ నూనెల వాడకం పెరిగింది. అలాగే డాక్టర్లు సహితం ఆహారంలో ఈ తరహా నూనెల్నే వాడమని రోగులకి సలహా ఇస్తున్నారు.
ఒక్క సంగతి. గుండె జబ్బున్నవాళ్లు ఆహారంలో నూనెల్ని తక్కువగా వాడటం ఉత్తమం. నూతన పరిశోధనల్లో ప్యూఫా చెడు కొలెస్టెరాల్‌ని మాత్రమే కాక మంచి కొలెస్టెరాల్‌ని కూడా తగ్గిస్తుందనీ, దీనివల్ల దేహంలోని సహజ రక్షణ వ్యవస్థకి విఘాతం కలుగుతుందనే సంగతి బయటపడింది. కర్బన గొలుసులో మూఫా ఒకే ఒక ద్విబంధాన్ని (రెండు హైడ్రోజన్ అణువుల్ని కోల్పోవడం) కలిగి వుంటుంది. అందువల్ల ప్యూఫాతో పోల్చుకుంటే ఇది అంత నాణ్యమైంది కాదని చెప్పవచ్చు. ఆలివ్, నువ్వులు, వేరుశనగ నూనెలు ఈ తరహాకి చెందుతాయి.
దక్షిణ ఇటలీలో గుండె రోగాలు చాలా తక్కువ. అదే పశ్చిమ దేశాల్లో ఈ సమస్య బాగా ఎక్కువ. ఎందుకంటే వాళ్లు మూఫా ఆలివ్ నూనెని అధికంగా వాడతారు. మూఫా చెడు కొలెస్టెరాల్‌ని తగ్గించినా హెచ్.డి.ఎల్.ని కూడా అసలు లేకుండా చేస్తుంది.
నూనెల విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలు:
1. నెయ్యి, వనస్పతి, కొబ్బరి నూనెలను ఆహారంలో తీసుకోవద్దు.
2. కాంతి లేకుండా, చల్లగా వుండే ప్రదేశంలో నూనెల్ని భద్రపరచండి. 3. వాతావరణపరంగా నూనెలు సున్నితం కాబట్టి గాలి చొరబడకుండా వుండే ప్రాంతంలోనే వుంచండి.
4. ఒకసారి వేపుడికి వాడిన నూనెని తిరిగి వాడాలనుకుంటే ఎక్కువకాలం దాన్ని నిల్వ వుంచడం మంచిది కాదు. తిరిగి దాన్ని వేపుడికే ఉపయోగించండి. నూనె రంగు మారితే మాత్రం అవతల పారవేయండి.
5. ఒక టేబుల్ స్పూన్ నూనెలో 90 కెలోరీలుంటాయి. మీరు నూనెని తగ్గిస్తే కెలోరీలను కూడా తగ్గించినట్లే అవుతుంది. కాబట్టి వాడాలనుకున్నదాంట్లో సగమే నూనెని ఉపయోగించండి.
6. అధికంగా వేయించవద్దు. వేపుడు కూరలు వాడకుండా వుంటే స్థూలకాయం రావడం అరుదు.
7. నూనె వంటకాల్లో వెనిగర్, ఉల్లిపాయలు, నిమ్మరసం, వెల్లుల్లి వంటివి ఉపయోగించండి.

No comments: