Tuesday, May 24, 2011

ఇంటర్వ్యూ: పోసాని కృష్ణమురళి

"జనం కోసం నాయకులు బతకాలని చెబుతూ 'దుశ్శాసన'లో హీరో ఓ సిస్టమ్ పెడతాడు. ఇప్పటి వ్యవస్థ ప్రక్షాళనకి ఈ సినిమాలో నేను పరిష్కారం చూపించా. ఓ మాటలో చెప్పాలంటే 'దుశ్శాసన' నా ఆత్మ'' అని చెప్పారు. పోసాని కృష్ణమురళి. శ్రీకాంత్, సంజన జంటగా లాఫింగ్ లార్డ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మురళీకృష్ణ నిర్మించిన 'దుశ్శాసన' చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. ఈ నెల 27న ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఆ సినిమా గురించీ, అందులోని రాజకీయ అంశాల గురించీ విపులంగా మాట్లాడారు పోసాని. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...

రాజకీయ నాయకుల్లో ఎవరైతే ప్రజాస్వామ్య విలువల్ని వలువల్లా లాగేస్తున్నారో వారే నా సినిమాలో 'దుశ్శాసన'. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు వంటి రాజకీయ నాయకులకి ఉండే సౌకర్యాలేవీ సామాన్య జనానికి ఉండవు. ఏ మంత్రి లేదా ఎమ్మెల్యే ఇంట్లో కరెంటు సమస్య కానీ, నీటి సమస్య కానీ, పారిశుద్ధ్య సమస్య కానీ ఉండదు. ఇవన్నీ జనానికి ఉంటాయి. దీన్ని ప్రశ్నించి, "మీకు ఉండే సౌకర్యాలన్నీ మాకూ ఇవ్వండిరా'' అని డిమాండ్ చేసే ఓ కామన్ మ్యాన్ కథ ఈ సినిమా. ఏ పనులు చేస్తామని పదవులు చేపట్టారో ఆ పనులు ఎందుకు చెయ్యడం లేదని అడిగే పాత్రలో శ్రీకాంత్ బాగా చేశాడు. అర్జెంటీనా ఉద్యమకారుడు చేగువేరా అంటే నీతికీ, నిజాయితీకీ, పోరాటానికీ, ధైర్యానికీ ప్రతీక. అందుకే శ్రీకాంత్ పాత్రకి ఆ లుక్ ఇచ్చా. అంతకుమించి చేగువేరాకీ, నా సినిమాకీ ఎలాంటి సంబంధమూ లేదు.
అందుకే పాలిటిక్స్ 
నా ఉద్దేశంలో జనజీవన స్రవంతిలో కలవాల్సింది మావోయిస్టులు కాదు. రాజకీయ నాయకులే. మావోయిస్టులు అన్ని సౌకర్యాల్నీ వదులుకుని అడవుల్లో జనం కోసం బతుకుతున్నారు. జనం మధ్య ఉంటూనే జనానికి దూరంగా బతుకుతోంది ఈ రాజకీయ నాయకులే. నక్సలైట్లు ఊరికే పుట్టడం లేదు. ఈ రాజకీయ వ్యవస్థవల్లే పుడుతున్నారు. చెప్పీ చెప్పీ ఏమీ ప్రయోజనం ఉండకపోవడంతో విసిగిపోయి నక్సలైట్లుగా మారుతున్నారు. అందుకే పాలిటిక్స్ గురించి ఎంత ఎక్కువ చెబితే అంత మంచిదనే ఉద్దేశంతో నా సినిమాల్లో రాజకీయ అంశాల్ని ప్రస్తావిస్తూ వస్తున్నా
వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లను 
ఇవాళ రాజకీయ నాయకులు ఎంతకైనా దిగజారుతున్నారు. తమకి అడ్డు వచ్చినవాళ్లని అడ్డు తొలగించుకోడానికి వెనుకాడటం లేదు. ఇలా అడుగుతున్నానని నన్ను ఎవరైనా ఎప్పుడైనా ఏమైనా చేయొచ్చు. ఈ సంగతి మా కుటుంబానికి కూడా చెప్పా. నేను తప్పు చెయ్యనని మా వాళ్ల నమ్మకం. అందుకే వాళ్లు నాకు అడ్డురారు. నేను ఎవరి వ్యక్తిగత విషయాల జోలికీ వెళ్లను. వ్యక్తిగతంగా వాళ్లేం చేసినా నాకు అభ్యంతరం లేదు. కానీ జనంలోకి వస్తేనే అడుగుతా. 'దుశ్శాసన'లో జనం కోసం నాయకులు బతకాలని చెబుతూ హీరో ఓ సిస్టమ్ పెడతాడు. ఇప్పటి వ్యవస్థ ప్రక్షాళనకి ఈ సినిమాలో నేను పరిష్కారం చూపించా. ఓ మాటలో చెప్పాలంటే 'దుశ్శాసన' నా ఆత్మ.
బిజినెస్ సమస్య లేదు 
పోసాని వల్ల ఏ నిర్మాతా నాశనం కాడు. పోసాని సినిమా అంటే కొనేవాళ్లు ఇంకా ఉన్నారు. నేను తీసేది తక్కువ బడ్జెట్‌తో కావడం వల్ల బిజినెస్ సమస్య నా సినిమాలకు లేదు. 'దుశ్శాసన' అన్ని ప్రాంతాలకూ అమ్ముడుపోయింది.
జేపీ నీతిమంతుడే కానీ... 
రాజకీయాల్లో స్థిరమైన నిర్ణయాలు ఉండవు. జనం ఎప్పుడూ ఏదో ఒక పార్టీకే ఎందుకు ఓట్లేయడం లేదు. ఒకసారి ఓ పార్టీని గెలిపించే వారు ఆ పార్టీ ప్రభుత్వం బాగా పనిచేస్తేనే మళ్లీ దానికి ఓటేస్తారు. లేదంటే వేరే పార్టీని ఎన్నుకుంటారు. నేను కూడా అంతే. ఏ నాయకుడైనా బాగా చేస్తుంటే మెచ్చుకుంటా. పొరపాట్లు చేస్తే తిడతా. మొన్న చంద్రబాబునీ, నిన్న చిరంజీవినీ అలాగే మెచ్చుకున్నా, తర్వాత తిట్టా. ఇవాళ రాజకీయ నాయకుల్లో 99 శాతం అవినీతిపరులే. అవినీతికి పాల్పడని రాజకీయ నాయకుల్ని ఓ ముగ్గుర్ని చూపించండి. నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో అవినీతి అనివార్యమైపోయింది. రాజకీయ నాయకులతో పాటు ప్రజలూ అవినీతి గురించి మాట్లాడే హక్కు కోల్పోయారు. లోక్‌సత్తా నేత జయప్రకాశ్ నారాయణ నీతిమంతుడు. అయితే ఇవాళ నీతి ఒక్కటే సరిపోదు. దానితో పాటు సమర్థతా, బలమూ కావాలి. జె.పి.కి ఆ బలం లేదు. ఉన్నవాళ్లలో సమర్థుడు అనిపించబట్టే వై.ఎస్. జగన్మోహనరెడ్డికి మద్దతు పలుకుతున్నా.

No comments: