Wednesday, May 9, 2012

టర్నింగ్ పాయింట్: చంద్రమోహన్


తొలి సినిమాతోటే బ్రేక్ సంపాదించడం కొంతమందికే దక్కే అదృష్టం. అది నాకు దక్కింది. ఆ సినిమా 'రంగులరాట్నం'. దాని దర్శకుడు బి.ఎన్. రెడ్డి. 1967లో ఆ సినిమా రాష్ట్రంలో బంగారు నంది రావడమే గాక, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డూ గెలుచుకొంది. అదో గొప్ప అనుభూతి. కొత్తవాళ్లని పరిచయం చేయడమనే ట్రెండ్ అప్పుడే మొదలైంది. అప్పుడు నా వయసు 21 సంవత్సరాలు. 
బీకాం పూర్తి చేసిన నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా. నా ఆసక్తి అంతా డబ్బు లెక్కపెట్టడం, ఎకౌంటన్సీ, బ్యాలెన్స్ మెయిన్‌టైన్ చెయ్యడం వంటివాటి మీద ఉండేది. బ్యాక్‌లో పనిచేసిన నా క్లాస్‌మేట్ లాగే నేనూ బ్యాకులో పనిచేసినట్లయితే ఏజీఎం ర్యాంకులో రిటైరయి, మంచి పెన్షన్ వస్తూ ఉండేది. 
చిత్రసీమలో ప్రవేశించిన మొదట్లో నేను మంచి పేరు తెచ్చుకున్నా, ఆదాయం ఆంతంత మాత్రంగానే ఉండేవి. కామన్ మ్యాన్ లాగా సాధారణ, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని నేను మిస్సయ్యాను. 
నా జీవితమంతా ప్రయాణాలతోటీ, వచ్చిన పాత్రలు చేయడంతోటీ గడిచిపోయింది. ఆ పాత్రలు చేయకపోతే పోటీలో లేకుండా పోతానేమోననే ఆలోచనతోటే వచ్చిన పాత్రనల్లా చేసుకుంటూ వచ్చా. నా భార్యా పిల్లలతో ఆదివారం పూట సరదాగా గడిపిన రోజులేవీ నాకు జ్ఞాపకం లేవు. సినిమాకి 45 సంవత్సరాల సేవ చేసిన నేను తిరిగి చూసుకుంటే ఇప్పటికీ కొత్తలో మాదిరిగా జీవిక కోసం కష్టపడుతూనే ఉన్నా.

No comments: