Thursday, May 17, 2012

అలనాటి ఆణిముత్యం: మళ్లీ పెళ్లి (1939)


కథాంశం: బాల్య వివాహాల్ని నిరోధించే శారదా చట్టం అమల్లోకి వస్తుందేమోనని లాయర్ జగన్నాథరావు పంతులు భయపడుతుంటాడు. అతడి ఆరేళ్ల కూతురు లలితని ఓ పెద్దాయనకిచ్చి పెళ్లిచేస్తే, అతను కాస్తా హారీమన్నాడు. దాంతో లలిత బాల వితంతువుగా మారింది. తమ ప్రాంతంలో గట్టి పట్టువున్న పంతులుకి సంఘ సంస్కరణలంటే గిట్టదు.
సుందరరావనే నిరుద్యోగ గ్రాడ్యుయేట్ తన చెల్లెలు కమలతో కలిసి వాళ్ల ఎదురింట్లో ఉంటాడు. కమల, లలిత స్నేహితులవుతారు. సుందరరావు, లలిత మధ్య త్వరలోనే ప్రేమ చిగుర్లు వేస్తుంది. లలితను పెళ్లాడాలని అతను నిశ్చయిస్తాడు. జగన్నాథరావు దగ్గరి బంధువు వెంకటరావు, కమల కూడా ప్రేమించుకుంటారు. ఓసారి లలైత కోసం తన ఇంటికొచ్చిన కమలని బలాత్కరించబోతాడు జగన్నాథరావు. అతణ్ణి చావగొట్టి జైలుకి వెళ్తాడు సుందరరావు. 
లలిత గర్భవతి అయ్యిందనే పుకారు వ్యాపిస్తుంది. సుందరరావును కలిసి తనకే పాపమూ తెలీదని చెబుతుంది లలిత. అతను నమ్మడు. దాంతో చనిపోవాలని భావిస్తుంది లలిత. ఆ మరుసటి రోజే సుందరరావు జైలునుంచి విడుదలవుతాడు. రోడ్డుపక్క పడిపోయి ఉన్న లలితను చూస్తాడు. ఆమెను ఆసుపత్రికి తీసుకుపోతాడు. ఆమెని పరీక్షించిన డాక్టర్ ఆమె గర్భవతి కాదనీ, కానీ కడుపులో బల్ల ఉందనీ చెబుతాడు. సుందరరావు పశ్చాత్తాపపడతాడు. చివరకు జగన్నాథరావు కూడా తన తప్పు తెలుసుకుంటాడు. తన చేతుల మీదుగా లలిత - సుందరరావు, కమల - వెంకటరావు పెళ్లి చేస్తాడు.
తారాగణం: వై.వి. రావు (సుందరరావు), కాంచనమాల (లలిత), బలిజేపల్లి లక్ష్మీకాంత కవి (జగన్నాథరావు), బెజవాడ రాజారత్నం (కమల), కొచ్చర్లకోట సత్యనారాయణ (వెంకటరావు), రంగస్వామి, ఆదినారాయణయ్య, నటేశ అయ్యర్, మాణిక్యమ్మ, రాజలక్ష్మమ్మ, సి. కృష్ణవేణి.
మాటలు, పాటలు: బలిజేపల్లి లక్ష్మీకాంత కవి
సంగీతం: ఓగిరాల రామచంద్రరావు
ఛాయాగ్రహణం: జితేన్ బెనర్జీ
నిర్మాత, దర్శకుడు: వై.వి. రావు
బేనర్: జగదీశ్ ఫిలిమ్స్
విశేషాలు: ఈ సినిమా ద్వారా ఓగిరాల రామచంద్రరావు సంగీత దర్శకునిగా పరిచయమయ్యారు. ఈ చిత్రంలోని 'నా సుందరరూపా' అనే పాట తెలుగులో ఓ గాయకుడు పాడిన తొలి పాటగా చరిత్రకెక్కింది. ఆ పాటని కాంచనమాల, వై.వి. రావుపై డ్యూయెట్‌గా తీశారు. అప్పట్లో పాటల్ని ఎవరి మీద తీస్తే వారే పాడే సంప్రదాయం ఉంది. అయితే వై.వి. రావు పాడలేనందు వల్ల ఆ పాటని కాంచనమాలతో కలిసి ఓగిరాల పాడారు. కానీ గ్రామఫోన్ రికార్డు మీద గాయకుడిగా వై.వి. రావు పేరు వేశారు.

No comments: