Friday, May 4, 2012

అలనాటి ఆణిముత్యం: వర విక్రయం (1939)


నటిగా భానుమతి పరిచయమైన చిత్రం 'వర విక్రయం'. కవితా కళానిధిగా ప్రసిద్ధులైన బలిజేపల్లి లక్ష్మీకాంత కవి నటునిగా తెరపై కనిపించిన తొలి సినిమా కూడా ఇదే. అంతే కాదు అనంతర కాలంలో గొప్ప కమెడియన్‌గా రాణించిన కస్తూరి శివరావు ఓ చిన్నపాత్ర ద్వారా ఈ సినిమాతోటే తెరంగేట్రం చేశారు.'చింతామణి', 'మధుసేవ' వంటి గొప్ప నాటకాల్ని రాసిన కాళ్లకూరి నారాయణరావు కలం నుంచి జాలువారిన మరో గొప్ప నాటకం 'వర విక్రయం'. వరకట్న పిశాచానికి వ్యతిరేకంగా రాసిన ఈ నాటకం ఆధారంగానే అదే పేరుతో ఈ సినిమా రూపొందింది. 
ఇందులోని కాళింది పాత్రకు బాగా పాడగల నటికోసం దర్శకుడు సి. పుల్లయ్య అన్వేషిస్తున్నప్పుడు భానుమతి గురించి ఆయనకు తెలిపారు గోవిందరాజుల సుబ్బారావు. భానుమతి తండ్రి బొమ్మరాజు వెంకటశేషయ్య, గోవిందరాజుల మంచి స్నేహితులు. స్క్రీన్ టెస్ట్ ద్వారా భానుమతిని తీసుకున్నారు పుల్లయ్య. అయితే తన కూతుర్ని ఏ పురుష నటుడూ స్పృశించకూడదనే నిబంధనతో ఇందులో భానుమతి నటించేందుకు శేషయ్య అంగీకరించారు. అలా ఓ గొప్ప నటి ఈ సినిమా ద్వారా తెలుగులోకి అడుగుపెట్టింది.
కథాంశం: రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అయిన పుణ్యమూర్తుల పురుషోత్తమరావు (దైతా గోపాలం) గాంధేయవాది. ఆయన భార్య భ్రమరాంబ (సీనియర్ శ్రీరంజని), కూతుళ్లు కాళింది (భానుమతి), కమల (పుష్పవల్లి). వరకట్నానికి పురుషోత్తమరావు వ్యతిరేకి. కానీ తన పెద్ద కూతురు కాళిందిని సింగరాజు లింగరాజు (బలిజేపల్లి లక్ష్మీకాంత కవి) దత్తపుత్రుడు బసవరాజు (కొచ్చర్లకోట సత్యనారాయణ)కు ఇచ్చి పెళ్లి చేయడానికి వరకట్నం నిమిత్తం తన పదెకరాల వరిపొలాన్ని అమ్మక తప్పని స్థితి ఎదురయింది. లింగరాజు పక్షం వహించిన పెళ్లిళ్ల పేరయ్య (పేరి రామచంద్రమూర్తి), వివాహాల వీరయ్య (జె. సత్యనారాయణ) వల్ల పెళ్లికాక ముందే కట్నం ఇచ్చేస్తాడు పురుషోత్తమరావు. తన పెళ్లి కారణంగా తల్లిదండ్రులు దరిద్రులై పోతున్నారని ఆవేదన చెందిన కాళింది నూతిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది.
పెళ్లి జరగకపోయినా కట్నం సొమ్ము ఇవ్వడానికి నిరాకరిస్తాడు లింగరాజు. దాంతో అతనికి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంటుంది కమల. తన తండ్రి అభిమతానికి విరుద్ధంగా బసవరాజుతో పెళ్లికి ఒప్పుకుంటుంది. పెళ్లయ్యాక అత్తగారింటికి వెళ్లేందుకు నిరాకరించిన కమల తాను కట్నమిచ్చి వరుణ్ణి కొనుక్కున్నాననీ, అందువల్ల బసవరాజే తమ ఇంటికి రావాలని డిమాండ్ చేస్తుంది. కొడుకు పేరుతో కమలని కోర్టుకు లాగుతాడు లింగరాజు. జడ్జి కమలకి అనుకూలంగా తీర్పు చెబుతాడు. తండ్రి చేష్టలకి విసుగెత్తిపోయిన బసవరాజు భార్యతో కలిసి జీవిస్తానంటాడు. తన తప్పు తెలుసుకున్న లింగరాజు క్షమించాల్సిందిగా పురుషోత్తమరావును అర్థిస్తాడు.
తారాగణం: బలిజేపల్లి లక్ష్మీకాంత కవి, దైతా గోపాలం, సీనియర్ శ్రీరంజని, భానుమతి, పుష్పవల్లి, కొచ్చర్లకోట సత్యనారాయణ, తుంగల చలపతిరావు, పేరి రామచంద్రమూర్తి, జె. సత్యనారాయణ, అడ్డాల నారాయణరావు, ఎ.వి. సుబ్బారావు, ఎల్. సత్యనారాయణ, రేలంగి వెంకట్రామయ్య, కోటిరత్నం, సుభద్ర, కస్తూరి శివరావు
కథ: కాళ్లకూరి నారాయణరావు
మాటలు: బలిజేపల్లి లక్ష్మీకాంత కవి
సంగీతం: ప్రభల సత్యనారాయణ
నేపథ్య సంగీతం: దుర్గాసేన్
ఛాయాగ్రహణం: బీరేన్ డే
సౌండ్: సి.ఎస్. నిగం
కూర్పు: ధరం వీర్
కళ: బాటూసేన్
మేకప్: ఈదు
దర్శకుడు: చిత్తజల్లు పుల్లయ్య
బేనర్: ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ

No comments: