Saturday, January 2, 2016

Synopsis of the movie CHIRANJEEVI (1969)

'చిరంజీవి' (1969) చిత్ర కథాంశం

బాలకృష్ణ నర్సింగ్ హోంలో 7వ నెంబర్ వార్డులోని ముగ్గురు రోగులు - సత్యం (చలం), మధు (రామకృష్ణ), వెంకటప్పయ్య (అల్లు రామలింగయ్య). సత్యం అనాథ. ఊపిరితిత్తుల వ్యాధితో బతికేది కొద్ది రోజులే అయినా అది తెలియక అందర్నీ నవ్విస్తూ, కవ్విస్తూ కాలక్షేపం చేస్తుంటాడు. మధు పేరుపొందిన ఫుట్‌బాల్ ఛాంపియన్. ప్రపంచ ఖ్యాతి వచ్చిందని సంబరపడేంతలోనే కాలు విరిగి తన భవిష్యత్ అంధకారబంధురమైందని బాధపడుతుంటాడు. ఇక వెంకటప్పయ్యకు కడుపులో పుండు. డాక్టర్‌కు తెలీకుండా దొరికిన ప్రతిదీ తింటుండే మూర్ఖుడు.
మృత్యువు సమీపంలో ఉన్న సత్యం డాక్టర్ ఇందిరాదేవి (సావిత్రి), మధు మధ్య ప్రేమను కలిగిస్తాడు. తనకు మందు ఇచ్చే నర్సు స్టెల్లా (మీనాకుమారి)ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని కలలు కంటుంటాడు. రోగుల్ని కన్నతండ్రిగా చూసే డాక్టర్ బాలకృష్ణ (ప్రభాకరరెడ్డి)నీ, ఇందిరాదేవినీ అవసరమున్నా లేకపోయినా మాటిమాటికీ కంగారుపెడుతుంటాడు. కానీ తాను ఎక్కువ కాలం బతకననే నిజం డాక్టర్ నోట రహస్యంగా విన్న సత్యం జీవితంలో నిజమైన బాధను తొలిసారి అనుభవిస్తాడు. జీవితం అంటే ఏమితో తొలిసారిగా అప్పుడే అర్థమవుతుంది. చనిపోయేలోగా తానూ ఒక మంచిపని చేసి చనిపోవాలనుకుంటాడు. ఆ మంచిపని మధు, ఇందిర పెళ్లనేది అతని అభిప్రాయం.
సత్యం జీవితం ముగిసిపోయే క్షణం రానే వచ్చింది. డాక్టర్ కోసం కాలింగ్ బెల్ నొక్కుతాడు. ఇదీ వేళాకోళానికేనని భావించిన ఇందిర నిర్లక్ష్యం చేస్తుంది. చివరకు పెద్ద డాక్టర్ వచ్చినా ఫలితం ఉండదు. మధు చేతిలో సత్యం కన్ను మూస్తాడు. చనిపోయే ముందు డాక్టర్ బాలకృష్ణ మనసు మార్చి ఆయన కూతురు ఇందిరను కుంటివాడైన మధుకు ఇవ్వడానికి ఒప్పిస్తాడు. ఇదివరకు తండ్రి వ్యతిరేకించా మధు ప్రేమ కోసమే విదేశాల్లో విద్యాభ్యాసానికి స్వస్తి చెప్పిన ఇందిర, ఇప్పుడు సత్యం మరణంతో మనసు మార్చుకుంటుంది. విదేశాలకు వెళ్లి కేన్సర్ స్పెషలిస్టయి సత్యంలాంటి అభాగ్యుల్ని చిరంజీవులను చేయాలనుకుంటుంది. ఆమె నిర్ణయాన్ని మనసారా అభినందిస్తాడు మధు. తన యావదాస్తినీ ఆమె ఆస్పత్రికి దానం చేస్తానని మాటిస్తాడు.

తారాగణం: సావిత్రి, ప్రభాకరరెడ్డి, చలం, రామకృష్ణ, అల్లు రామలింగయ్య, మీనాకుమారి
సంగీతం: టి. చలపతిరావు
నిర్మాత: ఎ.కె. వేలన్
దర్శకురాలు: సావిత్రి

No comments: