Monday, January 25, 2016

Society: Need vast selfishness in people

విశాల 'స్వార్థం' కావాలి

కరడుగట్టిన స్వార్థపరులు కూడా తమ కుటుంబం మేరకు స్వార్థాన్ని సడలించి భార్యాబిడ్డల సుఖానికి పాటుపడతారు. వ్యక్తిగత స్వార్థం కొంచెం విశాలమై కుటుంబ స్వార్థంగా పరిణమిస్తుంది. సమాజంలో చాలామంది కుటుంబం కోసం వ్యక్తిగత స్వార్థాన్ని త్యాగం చేస్తారు. అయితే వాళ్లు ఇతరులతో వ్యవహరించేప్పుడు మాత్రం స్వార్థాన్ని ఆవగింజంతైనా వదిలిపెట్టరు. మరికొంతమందిలో కులం, మతం, ప్రాంతం, రాజకీయ పార్టీ వరకు రకరకాలుగా స్వార్థం వ్యాపించి ఉంటుంది. ఎవరికి వాళ్లకు ఆ పరిధుల్ని నిర్ణయించుకునే స్వాధికారం ఉంది. ఇలా స్వార్థం విశాలతను పొందుతూ ఉంటే అది సాధించ గలిగిన, సాధించాలనుకున్న విషయాలు విశాలమైన ఆశలుగా పరిణతి చెందుతాయి. కుటుంబ పరిమితుల్లో సాధించదగ్గ విషయాలు రాష్ట్రం, దేశం వంటి పరిమితుల్లో సాధించదగ్గ విషయాల కంటే చిన్నవిగా, త్వరితగతిన సాధింప దగ్గవిగా ఉంటాయి. ఈ స్వార్థం అతి విశాలతను పొంది ఉన్నతమైన ఆశగా రూపొందినప్పుడు అది ఇతరుల కోసమే అవుతుంది.
ఇలాంటి విశాలమైన ఆశే ఆదర్శం. ఆశలో సంఘ దృష్టి సమ్మిళితమవుతున్న కొద్దీ అది విశాలతను సంతరించుకుంటుంది. కొంతమంది సంస్కర్తలు, విప్లవకారులు కొన్ని ఆదర్శాలను నమ్మి మూఢ సంఘాన్ని, మూఢ నమ్మకాల్ని ఎదిరించారు. తమ ఆదర్శాల కోసం ప్రాణాలు కోల్పోవడానికి కూడా వెనుకాడలేదు. కాల గమనంలో వాళ్ల ఆదర్శాలు ఫలించినప్పుడు భావి తరాలవాళ్లు వాళ్లను పూజించారు. బుద్ధుడు, సోక్రటీస్, క్రీస్తు, మహమ్మద్, బ్రూనో, గెలీలియో, లింకన్, గాంధీ, అంబేద్కర్, మార్క్స్, కందుకూరి వీరేశలింగం.. ఈ కోవలోకి వస్తారు. వీళ్లు ప్రచారం చేసిన విశాల భావాలు మానవాళికి ఆశాజ్యోతులై ఆదర్శాలయ్యాయి.
వ్యక్తి తాలూకు, సంఘం తాలూకు అనుభవాల్ని ఆదర్శాలు సంస్కరిస్తాయి. నిరాశతో కుంగిపోకుండా, ఉత్సాహంతో, ఉత్తేజంతో జీవిస్తూ, ఇతరులకు ఆ ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలగజేయడంలో జీవితం ఉత్తమంగా భాసిస్తుంది. కొన్ని ఆశయాలు, లక్ష్యాలు మనుషుల్ని ఉద్వేగపరచి ఉద్రేకపరుస్తాయి. అవి కొరవడితే నిరాశ, నిస్పృహ ఆవహిస్తాయి. స్తబ్దత ప్రవేశిస్తుంది. శాశ్వతమైన ఆదర్శాన్ని గుర్తించని ఉద్యమాలు సంపూర్ణ పరిణతిని చెందలేవు, సంపూర్ణ ప్రయోజనం కలిగించలేవు. ప్రజాస్వామిక హక్కుల కోసం, స్వయం నిర్ణయాధికారం కోసం పోరాడటం విశాలమైన సమతా సాధన కృషిలో భాగాలుగా గుర్తించాలి.
నియంతృత్వానికి ఎదురునిల్చి బహిరంగంగా పోరాటం చేసే ఆదర్శవాదులు లేకుండాపోతున్నారు. నియంతలు, నిరంకుశవాదులు తమ ఆధిపత్యం నిలబెట్టుకోడానికి ఆదర్శాలు వల్లిస్తారు. నిజం గ్రహించడానికి సమయం పడుతుంది. సంకుచితమైన లక్ష్యాలు ఆదర్శాలుగా చలామణీ అవుతున్నా, వాటిని ఎత్తిచూపే విచక్షణాశక్తిని ప్రజల్లో కలిగించడంలో నాయకులు విఫలమవుతున్నారు. వాతావరణం సానుకూలంగా లేనప్పుడు కూడా ఇసుమంతైనా వెనుదీయకుండా విశాల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని అధిక సంఖ్యాకులకు అప్రియమైన సత్యాన్నయినా ఆదర్శవాదులు ఎలుగెత్తి చెప్పాలి. ప్రచారం వల్లా, ఆదర్శవాదుల అకుంఠిత దీక్ష వల్లా విశాల భావాలకు అమోదం లభిస్తూ సంఘం మారుతుంది. 'న్యాయానికి రోజులు కావు' అనే ధోరణిని ఆదర్శవాదులే తమ ఆచరణ ద్వారా ఎదుర్కొని, మోసం, అన్యాయంతో రాజీపడే అవకాశవాదులకు తగిన సమాధానం చెప్పి వాతావరణంలో మార్పులు తీసుకొని రావాలి.

No comments: