Tuesday, January 5, 2016

Society: Encouragement to Superstitious Beliefs

మూఢత్వానికి ప్రోత్సాహం

సమాజాన్ని నిస్సహాయత ఆవహించింది. తప్పని తెలిసి కూడా ఆ తప్పునే అంతా ఆచరిస్తున్నారు. సమాజ దృష్టితో కూడిన ధ్యేయం లేకుండా పోయింది. సంకుచిత స్వార్థాలు, పార్టీ, ముఠా, కులం, మతం, ప్రాంతం, భాష పేరిట కక్షలు పెరిగిపోయాయి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ కర్త, నిర్ణేత పౌరుడే. కానీ ఆ పౌరుడు ప్రభుత్వాన్ని ఆజ్ఞాపించాల్సిందిపోయి, దీనంగా మంత్రుల్నీ, ఎమ్మెల్యేలనీ, స్థానిక ప్రతినిథుల్నీ, ప్రభుత్వాధికారుల్నీ అర్థించే బానిస మాదిరిగా దిగజారిపోయాడు. పౌరుడు దీనుడవటంతో, జనశక్తి బలహీనపడటంతో అధికారులు, పాలక వర్గాల వాళ్లూ తమ ఇష్టాయిష్టాలకు, రాగద్వేషాలకు, భోగవిలాసాలకు, సంపదను పోగేసుకోడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని సాధనంగా చేసుకొని ప్రజల్ని బలి చేస్తున్నారు.
అధికారంలో ఉన్నవాళ్లు నిజంగా ప్రజా ప్రయోజనాలు కోరేవారైతే ప్రజల్లోని మూఢ విశ్వాసాల్ని తొలగించడానికి కృషిచేసి, వారిలో నూతన చైతన్యాన్ని, ప్రేరణనీ కల్పించాలి. కానీ ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నవాళ్లు ప్రజా చైతన్యాన్ని పెంపొందించడానికి బదులు వాళ్లలోని మూఢ నమ్మకాలకు మరింత ప్రోత్సాహమిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జరిగేదొకటే. అది.. ప్రజాస్వామ్య వ్యవస్థ అంటేనే ప్రజల్లో ఏహ్యభావం ఏర్పడి నియంతృత్వంపై అభిమానం పెరగడం. ఇలాంటప్పుడు ఏ అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరిపినా, ఎన్ని ప్రణాళికలు వేసినా, వాటి ఫలితాలు ప్రజలదాకా చేరకుండానే ఇంకిపోతాయి.
ఈ రకంగా భ్రష్టమైన రాజకీయ జీవితం మొత్తం ప్రజా జీవితాన్ని బాధలు పెడుతోంది. ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిథులు తమ కర్తవ్యాల్ని సక్రమంగా నిర్వర్తించకపోతే దానివల్ల వాళ్లు ప్రాతినిథ్యం వహించే కోటానుకోట్ల ప్రజలు కష్టాల పాలవుతారు. అందువల్ల వాళ్లను సంకుచిత ముఠా స్వార్థాలలోకి దిగజారకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలదే.

No comments: