Tuesday, October 13, 2015

Rajamouli's Answers With BAAHUBALI

సీక్వెల్ పనిలో.. 



పోటీ తీవ్రంగా ఉన్న ఈ కాలంలో, సినిమా జూదంగా మారిపోయిన సంధి కాలంలో డైరెక్ట్‌ చేసిన పది సినిమాల్లో తొమ్మిది సినిమాలు నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టాయంటే, వాటిలో రెండు ఇండస్ట్రీ హిట్లు కూడా ఉన్నాయంటే ఆ దర్శకుణ్ణి ఏమని పిలవాలి? దర్శకుల్లోనే ‘బాహుబలి’ అని. ఆ ‘బాహుబలి’ యస్‌.యస్‌. రాజమౌళి కాకపోతే ఇంకెవరవుతారు! ఇవాళ ‘బాహుబలి’ ఓ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌. రాజమౌళి ఓ ఇంటర్నేషనల్‌ బ్రాండ్‌. ‘మగధీర’, ‘ఈగ’ సినిమాలతో తెలుగు సినిమాను జాతీయ స్థాయిలో నిలిపిన ఆయన ‘బాహుబలి: ద బిగినింగ్‌’తో అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. ఒక్క ‘సై’ మినహా ఆయన రూపొందించిన మిగతా సినిమాలన్నీ హిట్టే. ‘సై’ కూడా కాస్ట్‌ ఫెయిల్యూర్‌ మాత్రమే. ‘బాహుబలి’ సినిమా తెలుగులోనే కాకుండా దక్షిణ భారతావనిలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా చరిత్రకెక్కి, ప్రపంచవ్యాప్త వసూళ్లలో టాప్‌ 3 ఇండియన్‌ గ్రాసర్‌గా నిలిచింది. ఇక దేశీయ వసూళ్లలో నెంబర్‌వన్‌ ప్లేస్‌ ‘బాహుబలి’దే. ఇంతటి చరిత్రకు కారకుడైన రాజమౌళి ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌ అయిన ‘బాహుబలి: ద కంక్లూజన్‌’ రూపకల్పనలో నిమగ్నమయ్యాడు. విమర్శకుల ప్రకారం మొదటి సినిమాను ‘ఇంటర్వెల్‌’లో ఆపేసిన ఆయన, పోస్ట్‌ ఇంటర్వెల్‌, ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌ భాగాల్ని తీస్తున్నాడన్న మాట. అమరేంద్ర బాహుబలి, దేవసేన మధ్య పరిచయం ఎలా జరిగింది? ఆ పరిచయం ప్రణయంగా ఎలా మారింది? అది పెళ్లిగా ఎలా రూపాంతరం చెందింది? దేవసేనపై మోజుపడ్డ భల్లాలదేవ దీన్నంతా చూస్తూ ఊరుకున్నాడా? బాహుబలిని కట్టప్ప ఎందుకు వెన్నుపోటు పొడిచాడు? అమరేంద్ర బాహుబలి కొడుకు, పసికందు మహేంద్ర బాహుబలిని రాజమాత శివగామి ఎలాంటి పరిస్థితుల్లో కాపాడింది? భర్త హత్యకు కొడుకు మహేంద్ర/శివుడు సాయంతో దేవసేన ఎలా ప్రతీకారం తీర్చుకుంది?... ఇవన్నీ ‘బాహుబలి’ చూశాక మన మనసుల్లో తలెత్తిన ప్రశ్నలు. వాటన్నింటికీ సీక్వెల్‌లో సమాధానాలివ్వబోతున్నాడు రాజమౌళి. దీని కథేమిటో ముందే మనకు తెలిసినా, ఎలా తీసుంటాడనే కుతూహలం అందరిలోనూ ఉంది. సన్నివేశాల కల్పన, భావోద్వేగాల చిత్రణ విషయంలో సామాన్య ప్రేక్షకులఊహల్ని ఎప్పుడూ సంతృప్తిపరుస్తూనే ఉన్నాడు రాజమౌళి. ‘బాహుబలి: ద కంక్లూజన్‌’తోనూ ఆయన ఆ మ్యాజిక్‌ను మరోసారి చూపిస్తాడనేది ఖాయం. చూడాల్సింది.. అది ‘బాహుబలి’ని మించుతుందా, లేదా?.. అని మాత్రమే.

- ఆంధ్రజ్యోతి డైలీ, 10 అక్టోబర్ 2015

No comments: